ఇంట్లో రూ.384 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లు.. అమెరికా మాజీ అధికారి అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరీన్ హబేషియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అమెరికాలో వర్జీనియాలోని ఒక మాజీ ప్రభుత్వ అధికారి నివాసంలో సుమారు 40 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 384 కోట్లు విలువైన వందలాది బంగారు బిస్కెట్లను ఎఫ్‌బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, నిందితుడిని అరెస్ట్ చేశారు.
కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. 'పని సంబంధిత ఖర్చుల' కోసం ఆ బంగారు బిస్కెట్లను తనకు ఇవ్వాలని డేవిడ్ రష్ గత ఏడాది కాలంలో అమెరికా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సొమ్మును క్రిమినల్ పద్ధతిలో దొంగిలించినట్లు గతవారం దాఖలైన ఫిర్యాదులో ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, డేవిడ్ రష్ కొద్దిరోజుల కిందటి వరకు సీఐఏలో ఉన్నత పదవిలో కొనసాగారు.
ఆయన్ను అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ వారం జరిగే విచారణ వరకు అదుపులోనే ఉంచనున్నారు. ఈ కేసుపై మాట్లాడేందుకు ఆయన తరఫు న్యాయవాది నిరాకరించారు.
రష్ నివాసంలో ఏజెంట్లు దాదాపు 2 మిలియన్ డాలర్ల అమెరికా కరెన్సీతో పాటు 35 విలాసవంతమైన గడియారాలను కూడా కనుగొన్నారు. వీటిలో ఎక్కువ రోలెక్స్ బ్రాండ్‌కు చెందినవే ఉన్నాయి.

ఎవరీ డేవిడ్ రష్?
అత్యంత రహస్యమైన అంశాలు, సమాచారాన్ని తెలుసుకునే వీలున్న ఉన్నత స్థాయి భద్రతా అనుమతులు డేవిడ్ రష్కు ఉన్నట్లు కోర్టు డాక్యుమెంట్స్ చెబుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో తన విద్యార్హతలు, మిలిటరీ సర్వీస్ గురించి ఆయన అబద్ధాలు చెప్పినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే, వేలాది డాలర్ల జీతంతో కూడిన సైనిక సెలవులను రష్ మోసపూరితంగా పొందినట్లు ఆరోపణలున్నాయి.
డేవిడ్ రష్ వర్జీనియాలోని ఒక అమెరికా ప్రభుత్వ సంస్థలో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినట్లు కోర్టు డాక్యుమెంట్స్ పేర్కొన్నాయి.
డేవిడ్ రష్ కేసు గురించి ఎఫ్‌బీఐని ప్రశ్నించగా.. సీఐఏ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మే 19న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏజెన్సీ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపింది.
"చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు సీఐఏ అంతర్గత విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో.. సీఐఏ డైరెక్టర్ జాన్ రాక్లిఫ్ ఆ సమాచారాన్ని తదుపరి దర్యాప్తు కోసం ఎఫ్‌బీఐకి పంపారు" అని తెలిపింది.
కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం, 2025 నవంబర్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో, రష్ "పని సంబంధిత ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీతో పాటు పది మిలియన్ల డాలర్ల(సుమారు రూ.96 కోట్లు) విలువైన బంగారు బిస్కెట్లను పొందేందుకు" అమెరికా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత, వాటిని ఆయన పొందారు కూడా.
అయితే, ఒక సమీక్ష సమయంలో సీఐఏ "ఆ బంగారు బిస్కెట్లను గానీ లేదా పెద్ద మొత్తంలో ఉన్న విదేశీ కరెన్సీని గానీ గుర్తించలేకపోయింది" అని కోర్టు డాక్యుమెంట్స్ పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మే 18న తనిఖీలు
పని సంబంధిత అవసరాల కోసం తాను తీసుకున్న కరెన్సీ లేదా బంగారు బిస్కెట్ల వినియోగానికి సంబంధించి డేవిడ్ రష్ తన యాజమాన్యానికి సమాచారం అందించినట్లు ఎలాంటి ఆధారాలూ ప్రభుత్వానికి లభించలేదు.
దీంతో ఎఫ్‌బీఐ మే 18న వర్జీనియాలోని డేవిడ్ రష్ నివాసంలో సెర్చ్ వారెంట్ అమలు చేసింది. ఆ తనిఖీల్లో ఎఫ్‌బీఐ ఏజెంట్లు దాదాపు 303 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారని, వాటిలో ఒక్కొక్కటి సుమారు ఒక కిలోగ్రాము బరువు ఉన్నాయని కోర్టు డాక్యుమెంట్లలో ఏజెన్సీ తెలిపింది.
ప్రస్తుత బంగారం ధరల ప్రకారం, వీటి అంచనా విలువ 40 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ. 384 కోట్లు)కు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
డేవిడ్ రష్ ఆ బంగారు బిస్కెట్లను, కరెన్సీని తన ఇంట్లోనే ఎందుకు ఉంచారు అనే విషయాలు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొనలేదు.
ఈ వ్యవహారంపై స్పందన కోసం బీబీసీ సీఐఏను సంప్రదించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























