కాంగ్రెస్ 'వెన్నుపోటు' పొడిచిందంటూ డీఎంకే ఆగ్రహం.. విజయ్ పార్టీకి మద్దతు వల్ల హస్తం పార్టీకి కలిగే ప్రయోజనమేంటి?

విజయ్, రాహుల్ గాంధీ, టీవీకే, కాంగ్రెస్

ఫొటో సోర్స్, TVKPartyHQ/Getty

    • రచయిత, నందిని వెల్లైసామి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

తమిళనాడులో అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డీఎంకే - కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగంకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

టీవీకేతో పొత్తు పెట్టుకోవాలనే తమ ఉద్దేశాన్ని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోని ఒక వర్గం బహిరంగంగా వ్యక్తం చేసింది. ఇప్పుడు టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.

ఈ నిర్ణయం తమిళనాడులో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని కొంతమంది రాజకీయ నిపుణులు భావిస్తుండగా, మరికొందరు విశ్లేషకులు మాత్రం ఇది ఒక అవకాశవాద నిర్ణయమని, విధానపరమైనది కాదని విమర్శిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది.

ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతిచ్చింది కాంగ్రెస్. డీఎంకేతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలిచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, టీవీకే, కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ

ఫొటో సోర్స్, TVK

టీవీకేకు కాంగ్రెస్ షరతు

"భారత రాజ్యాంగాన్ని విశ్వసించని మతతత్వ శక్తులను కూటమికి దూరంగా ఉంచాలనే" షరతుపై తమ పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ఇన్‌చార్జి గిరీశ్ చోడంకర్ పేరుతో జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది.

"తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో దానిని బలోపేతం చేయాలనుకుంటున్నారు" అని సీనియర్ జర్నలిస్ట్ మాలన్ అన్నారు.

"ఈ కూటమి పరస్పర గౌరవం, సముచిత భాగస్వామ్యం, ఇరుపక్షాల బాధ్యతా స్ఫూర్తిపై ఆధారపడి ఉంది. ఇది ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటుకే కాకుండా భవిష్యత్తులో స్థానిక సంస్థలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలకు కూడా కొనసాగుతుంది" అని గిరీశ్ చోడంకర్ అన్నారు.

"స్థానిక సంస్థల ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వెనుక, రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్న వారి ఆకాంక్ష ఉండవచ్చు. విజయ్‌తో చేతులు కలిపితే అది తమకు సులభమవుతుందని వారు భావిస్తున్నారు. తమ భవిష్యత్ వైఖరిని డీఎంకేకు తెలియజేయడానికి కూడా వారు ఈ మాట చెప్పి ఉండవచ్చు" అని లోక్‌సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ మద్దతు ఇస్తామనడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జర్నలిస్ట్ మాలన్ విశ్లేషించారు.

తమిళనాడులో కాంగ్రెస్ చాలా కాలంగా డీఎంకేకు అతిపెద్ద మిత్రపక్షంగా ఉంది.

మధ్యలో కొన్ని విభేదాలొచ్చినప్పటికీ ఇందిరా గాంధీ కాలం నుంచి రాహుల్ గాంధీ కాలం వరకు డీఎంకే - కాంగ్రెస్ సంబంధం చాలా కాలం కొనసాగింది.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీల మధ్య బంధం తమిళనాడులో చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ సోషల్ మీడియా, ఇతర వేదికలపై ఒకరినొకరు "సోదరులు" అని పిలుచుకుంటారు.

తమిళనాడు, టీవీకే, కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టాలిన్, రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

డీఎంకే - కాంగ్రెస్ కూటమి

గత 20 ఏళ్లలో డీఎంకే - కాంగ్రెస్ కూటమి చరిత్రను పరిశీలిస్తే, 2004 పార్లమెంటరీ ఎన్నికల కోసం సుదీర్ఘ విరామం తర్వాత ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమి 2011 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగింది.

2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కూటమి నుంచి డీఎంకే వైదొలిగింది. ఆ ఎన్నికలను కాంగ్రెస్ ఒంటరిగా ఎదుర్కొంది.

ఆ తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ రెండు పార్టీలు మళ్లీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తు 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగింది.

'ప్రభుత్వంలో భాగస్వామ్యం' కావాలన్న కాంగ్రెస్ డిమాండ్‌తో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ డీఎంకేతో పొత్తును కొనసాగిస్తుందా? లేదా? అనే ప్రశ్నలను లేవనెత్తినప్పటికీ సుదీర్ఘ చర్చల అనంతరం రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి.

తమిళనాడు, టీవీకే, కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, శరవణన్ అన్నాదురై

కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహం

టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఇది ముమ్మాటికీ వెన్నుపోటే. గెలిచినట్లు అధికారిక ధ్రువీకరణ పత్రం రాకముందే కూటమి మార్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీనికి వారు చెబుతున్న కారణం సంతృప్తికరంగా లేదు" అని అన్నారు.

కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మోహన్ కుమారమంగళం బీబీసీతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ వల్ల డీఎంకేకు ఎలాంటి ప్రయోజనం కలగలేదా? ఎన్నికలకు ముందే టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌లో చాలామంది పట్టుబట్టారు. తమతో రావాలని డీఎంకేనే కోరింది. ప్రయోజనం లేనప్పుడు వారు ఎందుకు ఆహ్వానిస్తారు? ఇరుపక్షాలకూ లాభం కలిగింది. తమిళనాడులో మాకు ఓటు బ్యాంకు లేదా?" అని ప్రశ్నించారు.

డీఎంకే కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు కాంగ్రెస్ ఒక అవకాశం కోసం ఎదురుచూస్తోందని, ఇప్పుడు ఆ అవకాశం దొరికిందని సీనియర్ జర్నలిస్ట్ ఇలంగోవన్ రాజశేఖరన్ అంటున్నారు.

"గతంలో ఏఐఏడీఎంకే బీజేపీతో ఉండటంతో కాంగ్రెస్‌కు మరో కూటమి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ టీవీకేను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తోంది. ఎన్నికలలో డీఎంకే నుంచి ఓట్లు తీసుకుని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు టీవీకేతో కలిసి వెళ్తున్నారు'' అని ఆయన అన్నారు.

ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు ద్వారా లాభపడి ఇప్పుడు టీవీకేకు మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్‌ను ఆయన విమర్శించారు.

తమిళనాడు, టీవీకే, కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ

ఫొటో సోర్స్, X/TVK

ఫొటో క్యాప్షన్, టీవీకేకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని కొందరు నిపుణులు తప్పుపడుతున్నారు.

'విశ్వసనీయతను కోల్పోయిన కాంగ్రెస్’

రాష్ట్రాల్లోని పెద్ద పార్టీలను కాంగ్రెస్ తన ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఇలంగోవన్ రాజశేఖరన్ విమర్శించారు. "ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకే వ్యతిరేకంగా కాంగ్రెస్ పనులు చేసింది. దీంతో కూటమిలోని మిగిలిన పార్టీలకు కాంగ్రెస్‌పై అసంతృప్తి ఏర్పడింది. ఇలాంటి వైఖరితో బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎప్పటికీ ఎదగలేదు. కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయింది" అని ఆయన అన్నారు.

అయితే "బిహార్‌లో మేం తేజస్వి యాదవ్‌కు అండగా నిలిచాం" అని కాంగ్రెస్ నాయకుడు మోహన్ కుమారమంగళం అన్నారు.

కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వారి విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తవచ్చని సీనియర్ జర్నలిస్ట్ మాలన్ కూడా విశ్లేషించారు.

''అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకుల మధ్య విభేదాలున్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో కాంగ్రెస్ భాగం కాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారొచ్చు" అని ఆయన అన్నారు.

అయితే, క్యాబినెట్‌లో భాగస్వామ్యం తమ షరతు కాదని కాంగ్రెస్ నాయకుడు మోహన్ కుమారమంగళం అంటున్నారు.

తమిళనాడు, టీవీకే, కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ

ఫొటో సోర్స్, TVKHQ/X

ఫొటో క్యాప్షన్, మద్దతు ఇచ్చేందుకు విజయ్‌కు కాంగ్రెస్ షరతులు విధించింది.

బీజేపీపై టీవీకే వైఖరేంటి?

"భారత రాజ్యాంగాన్ని విశ్వసించని మత శక్తులు" ఈ కూటమిలో చేరకూడదని కాంగ్రెస్ విధించిన షరతు ఆమోదయోగ్యం కాదని ఇలంగోవన్ రాజశేఖరన్ అన్నారు.

"ముఖ్యమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉండాలని విజయ్ నిర్ణయించుకుంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.

''టీవీకే, కాంగ్రెస్ మధ్య నిజంగా ఏ సిద్ధాంతాలపై చర్చ జరిగింది? నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ వంటి అంశాలపై ఇరుపక్షాలు ఏం మాట్లాడుకున్నాయి? ఇలాంటి అత్యవసర పరిస్థితిలో వీటన్నింటిపై చర్చించే అవకాశం నిజంగా ఉందా? ఇదంతా నంబర్ గేమ్ మాత్రమే" అని చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ సీనియర్ ప్రొఫెసర్ ఆనంది అన్నారు.

"తన రాజకీయ శత్రువు బీజేపీ అని విజయ్ చాలాసార్లు స్పష్టం చేశారు. మతతత్వ శక్తులు కూటమిలోకి రాకూడదనేది మద్దతుకు మేం పెట్టిన షరతు. అంటే బీజేపీ రాకూడదు'' అని మోహన్ కుమారమంగళం అన్నారు.

తమిళనాడు, టీవీకే, కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ
ఫొటో క్యాప్షన్, టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై సందేహాలు తలెత్తుతున్నాయి.

'ఇండియా' కూటమి భవిష్యత్తేంటి?

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన 'ఇండియా' కూటమి భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

"విజయ్ 'ఇండియా' కూటమిలో చేరవచ్చు. ఆ కూటమిలోని పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ, జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే విషయంలో ఐక్యంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు టీవీకే 'ఇండియా' కూటమిలోకి వస్తే, ఆ కూటమిలో డీఎంకే కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు" అని మాలన్ అన్నారు.

"డీఎంకే విధానం బీజేపీకి వ్యతిరేకం. అలాంటప్పుడు వారు 'ఇండియా' కూటమితో ఎందుకు కొనసాగరు? టీవీకే - డీఎంకే రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి. అనేక రకాల విధానాలున్న పార్టీలు 'ఇండియా' కూటమిలో ఉన్నాయి. 'ఇండియా' కూటమిలో చేరకుండా బీజేపీతో డీఎంకే పొత్తు పెట్టుకుంటుందా? రెండూ 'ఇండియా' కూటమిలో ఉండగలవు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు" అని మోహన్ కుమారమంగళం అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)