పెళ్లి మోసం: మండపానికి చేరిన 42 మంది పెళ్లికొడుకులు, కనిపించని పెళ్లి కూతుళ్లు, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విష్ణుకాంత్ తివారీ, సమీర్ ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా మాతా టేకరి ఆలయంలో ఆదివారం (మే 24) ఉదయం కొందరు యువకులు హల్దీ, పెళ్లి తంతు కోసం ఎదురుచూస్తున్నారు. కొందరి మెడలో పూలదండలు ఉన్నాయి, మరికొందరు బంధువులతో కలిసి వచ్చారు, ఇంకొందరు కిరాయి కార్లలో బారాత్‌తో చేరుకున్నారు.
రాబోయే 24 గంటల్లో పెళ్లి జరుగుతుందని వారికి నిర్వాహకులు చెప్పారు. అయితే, రాత్రయినా అక్కడికి వధువులు రాలేదు, ఎవరి పెళ్లీ కాలేదు.
ఈ సామూహిక వివాహ మోసం కేసులో దేవాస్ జిల్లా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
"ఈ కేసులో పక్కా ప్లాన్‌తో చాలామందికి పెళ్లి ఆశ చూపి, డబ్బులు వసూలు చేశారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్టు చేశాం, దర్యాప్తు కొనసాగుతోంది" అని దేవాస్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ జయవీర్ సింగ్ భదౌరియా తెలిపారు.
పెళ్లిళ్లు చేస్తామని నమ్మించి పలువురు పురుషుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇందౌర్‌లోని ఒక అనాథ శరణాలయానికి చెందిన అమ్మాయిలతో వివాహం జరిపిస్తామని నమ్మించారని పోలీసులు పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, SAMEER KHAN
ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేసేదంటే..
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి కోసం వెతుకుతున్న పురుషులను ఈ ముఠా మొదట సంప్రదించేది. ఇందౌర్‌లోని ఒక ఆశ్రమంలో ఉండే అమ్మాయిలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పేవారు. ఆ తర్వాత పురుషుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు తీసుకుని, ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను కూడా సేకరించేవారు.
ఈ కేసులో కూడా పెళ్లికొడుకులు, వారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లకు అమ్మాయిల ఫోటోలను పంపారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా నుంచి తీసుకున్నట్లు బాధితులు తర్వాత గుర్తించారు. నమ్మకం కలిగించడం కోసం ముఖ్యమంత్రి పేరును కూడా వాడుకున్నట్లు కొందరు ఫిర్యాదుదారులు ఆరోపించారు.
"మంచి అమ్మాయిలతో పెళ్లి జరుగుతుందని మాకు ఆశలు కల్పించారు. ముఖ్యమంత్రి స్వయంగా వస్తారని, 51 వేల రూపాయల చెక్కు కూడా ఇస్తారని చెప్పారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బాధితుడు బీబీసీతో అన్నారు.
ఈ ముఠా సదరు యువకుడిని ఒక దూరపు బంధువు ద్వారా సంప్రదించింది.
"ముఖ్యమంత్రి పేరు చెప్పడం, సామూహిక వివాహం అనడం, అమ్మాయిల ఫోటోలు చూపించడంతో మేం నమ్మాం" అని 22 ఏళ్ల ఆ యువకుడు చెప్పారు.
పెళ్లికి ముందే అమ్మాయిలను కలవాలని కోరగా, వారు అనాథ శరణాలయానికి చెందినవారు కావడంతో ముందస్తుగా కలవడం సాధ్యం కాదని నిర్వాహకులు చెప్పారు.
"మే 24న అమ్మాయిలు, అబ్బాయిలకు పరిచయం చేస్తామని, మాట్లాడుకోవడానికి పూర్తి అవకాశం ఇస్తామని చెప్పారు. ఆపై మే 25న సామూహిక వివాహాల కార్యక్రమంలో పెళ్లి జరిపిస్తామన్నారు" అని బాధితుడు వివరించారు.
పెళ్లిలో కట్నంగా సామాన్లు ఇస్తామని కొన్ని కుటుంబాలకు నమ్మబలికారు. పెళ్లి ప్రక్రియ మొత్తం దేవాస్‌లోనే జరుగుతుంది కాబట్టి, ఇంటి దగ్గర హల్దీ, మెహందీ వంటి వేడుకలు చేయవద్దని మరికొందరికి చెప్పారు.

వరుళ్లు వచ్చారు, వధువులే లేరు
ఓ ఫిర్యాదుదారుడు చెప్పినదాని ప్రకారం, ఆయన తొమ్మిది మందితో కలిసి బారాత్‌తో దేవాస్ చేరుకున్నారు.
"మమ్మల్ని మాతా టేకరి ఆలయానికి రమ్మన్నారు. మే 24 ఉదయం ఎనిమిది గంటలకల్లా చేరుకోవాలని చెప్పారు" అని ఆయన అన్నారు.
ఆయనతో కలిపి దాదాపు 42 మంది పెళ్లికొడుకులు అక్కడ ఉన్నారు.
"చాలా మంది వయస్సు 40 ఏళ్లకు దగ్గరగా ఉంది. కొందరు 60 ఏళ్ల పెళ్లికొడుకులు కూడా ఉన్నారు. అప్పుడే మాకు కొంచెం అనుమానం వచ్చింది" అని ఆయన చెప్పారు.
వికాస్ మీనా దేవాస్‌కు సమీపంలోని గ్రామం నుంచి వచ్చారు. పెళ్లి చేస్తామనే వాగ్దానంతోనే ఆయనను కూడా ఇక్కడికి పిలిపించారు. వికాస్ ఈ పెళ్లి కోసం 25 వేల రూపాయలు చెల్లించారు.
"మా నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు తీసుకున్నారు. ఇందౌర్‌లోని ఒక అనాథ శరణాలయానికి చెందిన అమ్మాయిలతో పెళ్లి జరిపిస్తామని చెప్పారు. ఫోటోలు అడిగితే మొబైల్‌కు అమ్మాయిల ఫోటోలను పంపారు. అవి సోషల్ మీడియా నుంచి తీసుకున్నవని తర్వాత తెలిసింది" అని వికాస్ అన్నారు.
పెళ్లి ముఠా వలలో చిక్కుకుని, భోపాల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాస్ చేరుకున్నారు బాధితులు.
మొబైల్‌కు పంపిన ఫోటోల నుంచి తాను వధువును ఎంపిక చేసుకున్నట్లు మరో బాధితుడు ఓంప్రకాశ్ ప్రజాపతి చెప్పారు.
"దేవాస్ మాతా టేకరి ఆలయంలో పెళ్లి జరుగుతుందని మాకు చెప్పారు. మేం కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చాం" అని ఆయన అన్నారు.
నిర్వాహకులకు 12 వేల రూపాయలు ఇచ్చినట్లు ఓంప్రకాష్ చెప్పారు.
"మమ్మల్ని మామూలు దుస్తుల్లోనే రమ్మన్నారు. పెళ్లికొడుకు దుస్తులు, మిగిలిన ఆచారాలు ఇక్కడే జరుగుతాయని చెప్పారు. ఇంటి దగ్గర ముందే హల్దీ, మెహందీ కూడా పెట్టుకోవద్దని గట్టిగా చెప్పారు" అని ఆయన వివరించారు.

రాత్రి వరకు ఎదురుచూసిన పెళ్లికొడుకులు
బాధిత కుటుంబాల కథనం ప్రకారం, ఆదివారం ఉదయం దాదాపు ఎనిమిది గంటలకు వారు వేదిక వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ కార్యక్రమ బాధ్యతలు చూస్తున్న ముకేశ్ బైరాగి, ఆయన భార్య సునీత కనిపించారు.
ముకేశ్, సునీతలు ఈ పెళ్లికొడుకులలో చాలామందితో, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడారు. వీరే పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేయించి, డబ్బులు వసూలు చేశారు.
ఆదివారం ఉదయం పెళ్లికొడుకుల కుటుంబ సభ్యులతో ముకేశ్, సునీతలు నిరంతరం మాట్లాడుతూ.. వధువులు ఇందౌర్ నుంచి బయలుదేరారని, కొద్దిసేపట్లోనే వచ్చేస్తారని చెబుతూ వచ్చారు.
బాధితుల కథనం ప్రకారం, నిర్వాహకులు రోజంతా రకరకాల వంకలు చెబుతూనే ఉన్నారు. ఒకసారి వాహనాలు దారిలో ఉన్నాయని, మరోసారి మిగిలిన వారు వస్తున్నారని అన్నారు. కానీ, రాత్రయినా ఎవరూ రాకపోవడంతో, అక్కడ ఉన్నవారు గొడవ చేయడం ప్రారంభించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు.

నలుగురిపై ఎఫ్‌ఐఆర్, ఇద్దరి అరెస్టు
దేవాస్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ జయవీర్ సింగ్ భదౌరియా మీడియాతో మాట్లాడుతూ.. "పెళ్లిళ్లు చేస్తామనే పేరుతో కొంతమంది ఒకచోట గుమిగూడారని, అక్కడ మోసం జరిగి ఉండొచ్చని మాకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నవారితో మాట్లాడారు. వారి ఫిర్యాదు ఆధారంగా మోసంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం" అని తెలిపారు.
ఈ కేసులో ముకేశ్ బైరాగి, సునీత బైరాగి, దినేశ్ బైరాగి, మరొక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన తర్వాత, 22 ఏళ్ల ఫిర్యాదుదారుడు మిగిలిన పెళ్లికొడుకుల లాగే తన ఇంటికి తిరిగి పయనమయ్యారు.
‘‘ఈ విషయం తెలిసిన వారిని చేతులు జోడించి వేడుకున్నాను, బయట ఎవరికీ చెప్పవద్దని బతిమాలాను. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా భవిష్యత్తు పాడవుతుంది’’ అని ఆయన అన్నారు.
‘‘అయినా మోసం చేసినవారిని ఇలాగే వదిలిపెట్టను. నేను ఫిర్యాదు చేశా, వీరికి శిక్ష పడేలా చేయడానికి చట్టపరంగా పోరాటం కూడా చేస్తా’’ అన్నారాయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























