ఒడోమా పిగే-స్వాచ్: ఈ కంపెనీలు కలిసి తయారు చేసిన వాచ్‌ల కోసం జనం ఎందుకు ఎగబడ్డారు, షాపులు మూసే పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఒడొమా పిగే

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

స్వాచ్ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసిన కొత్త పాకెట్ వాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు షాపులకు ఎగబడ్డారు.

దీంతో కొన్నిచోట్ల షాపులు మూసేయాల్సి వచ్చింది. ఒడొమా పిగే తో కలిసి తాము కొత్తవాచ్ ప్రవేశపెట్లామని స్వాచ్ అధిపతి తెలిపారు.

రాయల్ పాప్‌ వాచ్ కోసం ప్రజలు "తండోపతండాలుగా వచ్చారని" సీఈఓ నిక్ హాయెక్ జూనియర్ బీబీసీతో అన్నారు.

అమ్మకాలు ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదని, కొన్ని నెలల పాటు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

"కొత్త వస్తువును మార్కెట్‌లో ప్రవేశ పెట్టినప్పుడు షాపుల వద్ద జనం గుంపులు గుంపులుగా రావడం దుర్వార్తేమీ కాదు, మంచిదే" అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్వాచ్, వాచ్, పాకెట్ వాచ్, బ్రిటన్, లండన్

ఫొటో సోర్స్, Swatch

ఫొటో క్యాప్షన్, ది రాయల్ పాప్ పాకెట్ వాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

వాచ్ కోసం జనం భారీగా రావడంతో బ్రిటన్‌లోని కొన్ని షాపింగ్ సెంటర్లలో భద్రత దృష్ట్యా కొన్ని రిటైల్ షాపుల్ని మూసివేయాల్సి వచ్చింది. విదేశాల్లోనూ షాపుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది.

రాయల్ పాప్ అనే ఈ పాకెట్ వాచ్ ఖరీదు భారత కరెన్సీలో రూ.38 వేలు. ఇది ఆన్‌లైన్‌లో దొరకదు.

ఈ వాచ్‌ను 1980ల నాటి స్వాచ్ పాప్ ఆర్ట్ స్టైల్‌ను, లగ్జరీ వాచ్‌ల తయారీ సంస్థ ఒడొమా పిగేకి చెందిన ఆక్టోజెనల్ బెజెల్‌ను కలిపి తయారు చేశారు.

ఒడొమా పిగే బ్రాండ్ వాచ్‌ల ధరలకంటే దీని ధర తక్కువగా నిర్ణయించారు.

"షాపింగ్ మాల్స్ వద్ద అధికారులు మొదటి నుంచి మాకు సహకరిస్తున్నారు. అలాంటి చోట పరిస్థితి బాగానే ఉంది" అని హాయెక్ జూనియర్ బీబీసీతో చెప్పారు.

"కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండవచ్చు. అందరూ బాగా పని చేశారు. అయితే అన్నిసార్లు మనం అన్నింటినీ నియంత్రించలేం" అని ఆయన అన్నారు. మొత్తానికి ఈ ప్రారంభోత్సవం అసాధారణంగా జరిగిందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

గ్రేటర్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఉన్న స్వాచ్ కంపెనీ షాపును పోలీసులు వచ్చిన తర్వాత మళ్లీ తెరిచారు. షాపు తెరిచిన తర్వాత అక్కడ ఉన్న అనేకమందిని పోలీసులు పంపించి వేశారు.

కార్డిఫ్‌లోనూ సెయింట్ డేవిడ్స్‌ షాపింగ్ సెంటర్ వద్దకు పోలీసులు వచ్చారు. ఇక్కడ 25 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు.

లివర్‌పూల్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, షెఫీల్డ్, గ్లాస్గో , లండన్‌లోని స్వాచ్ కంపెనీ షాపులను భద్రత కారణాల దృష్ట్యా మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో స్వాచ్ స్టోర్ల ముందు జనం భారీగా బారులు తీరి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

స్వాచ్, వాచ్, పాకెట్ వాచ్, బ్రిటన్, లండన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, టోక్యోలో స్వాచ్ షోరూం దగ్గర వాచ్ కోసం పడిగాపులు కాస్తున్న కొనుగోలుదారులు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 220 స్టోర్లలో 20 మాత్రమే మూసి వేసినట్లు స్వాచ్ తెలిపింది.

సోమవారం తమ స్టోర్ల వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని హాయెక్ జూనియర్ చెప్పారు. తమ గడియారాలను ఆన్‌లైన్‌లో భారీ ధరలకు అమ్మిన వాళ్లను తానేమీ విమర్శించలేనని అన్నారు.

"ఎవరైనా ఇష్టంతో వాచ్ ఉంచుకోవడానికి బదులుగా అమ్మాలనుకుంటే ఏం చేయగలం? లగ్జరీ వస్తువుల మార్కెట్‌లో ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి" అని ఆయన చెప్పారు.

జెన్ జెడ్ వర్గానికి చెందిన కొనుగోలుదారులు, సోషల్ మీడియా ప్రభావంతో నడుస్తున్న మార్కెట్‌లో ఇలాంటి రద్దీ సాధారణమేనని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో కన్స్యూమర్ బిహేవియర్ అండ్ రిటైల్ విభాగంలో సీనియర్ లెక్చరర్ అమ్నా ఖాన్ చెప్పారు.

"ఈ హైప్ చూసి, ఈ వాచ్‌కున్న క్రేజ్ చూసి ఇంకా అనేక మంది దీనిని కొనేందుకు వస్తారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనది. విలాసవంతమైనది. అలాగే ఇది ఒడొమా పిగే అనే బ్రాండ్ నుంచి వస్తోంది. మీకది అంత తేలిగ్గా దొరకదు. అందుకే ప్రజలు దీన్ని పోటీ పడి కొంటున్నారు" అని ఆమె చెప్పారు.

అయితే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాదని.. ఇంకా మరిన్ని వాచ్‌లు మార్కెట్‌లోకి వస్తాయని ప్రజలు తెలుసుకున్నారని ఆమె వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)