స్టాండప్ కమేడియన్ అంకిత: ‘మీ పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ నన్ను డిజిటల్ అరెస్ట్ చేసి రూ.9 లక్షలు దోచుకున్నారు’

అంకిత శ్రీ వాస్తవ్, సైబర్ క్రైమ్, ఫెడెక్స్, సైబర్ ఫ్రాడ్, NCRB, పోలీసులు

ఫొటో సోర్స్, Ankita Shrivastav

    • రచయిత, చెర్లిన్‌ మొల్లాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

"హలో మామ్... నేను ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇరాక్‌కు పంపిస్తున్న కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు"

2024 అక్టోబర్‌లో ఓ రోజు మధ్యాహ్నం ముంబయికి చెందిన స్టాండప్ కమేడియన్ అంకిత శ్రీవాస్తవ్‌కు ఫోన్ చేసి అవతలి వ్యక్తి చెప్పిన మాటలివి.

ఇది తన జీవితంలో భయంకరమైన అనుభవంగా మిగిలిపోయిందని శ్రీవాస్తవ్ చెప్పారు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని స్టాండప్ కామెడీ కంటెంట్‌గా మార్చుకునే వరకు ఆమె దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు.

నాటి ఘటనను వివరిస్తూ ఆమె దాదాపు 30 నిముషాల వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అంకిత శ్రీ వాస్తవ్, సైబర్ క్రైమ్, ఫెడెక్స్, సైబర్ ఫ్రాడ్, NCRB, పోలీసులు

ఫొటో సోర్స్, facebook.com/filmychokri

ఫొటో క్యాప్షన్, 'మై డిజిటల్ అరెస్ట్' పేరుతో తనకు జరిగిన సైబర్ ఫ్రాడ్ గురించి కామెడీ షో చేసి తన చానల్‌లో పోస్ట్ చేశారు.

ఫోన్ చేసిన వ్యక్తి తనను వీడియో కాల్ చేయమని అడిగారని, పోలీసు యూనిఫాం ధరించిన ఇద్దరు వ్యక్తులతో ఆ కాల్‌ను కలిపారని శ్రీవాస్తవ్ చెప్పారు.

వాళ్లు తన గుర్తింపును ధృవీకరించి కొరియర్ పంపిన వ్యక్తి తాను కాదని నిర్ధరించే వరకు తనను "డిజిటల్ అరెస్ట్" చేశారని ఆమె వివరించారు.

తన ల్యాప్‌టాప్‌ నుంచి చేసిన వీడియో కాల్ ద్వారా ఆ 'పోలీసులు' తర్వాత 8 గంటల పాటు తనను పర్యవేక్షించారని ఆమె చెప్పారు. ఆమె తన కెమెరా ఆఫ్ చేసేందుకు కానీ, ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకుకానీ, వేరే ఎవరితోనైనా మాట్లాడేందుకు, కలిసేందుకు వాళ్లు ఒప్పుకోలేదని ఆమె చెప్పారు.

వాళ్లు ఆమెను అనేక ప్రశ్నలు అడిగారు. అందులో ఆమె బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల గురించి ప్రశ్నించారు. ఇదంతా జరుగుతుండగానే ఆ కేసు చాలా తీవ్రమైనదని, ఆమె పెద్ద ఇబ్బందిలో పడవచ్చని పదే పదే గుర్తు చేశారు.

"కాసేపటి తర్వాత వాళ్ల ఒత్తిడిలో తీవ్రత పెరిగింది. నేను అయోమయంలో పడిపోయాను. మానసికంగా అలసిపోయాను. ఎలాగోలా ఈ కష్టం నుంచి బయటపడితే చాలనుకున్నాను" అని శ్రీవాస్తవ్ బీబీసీకి వివరించారు.

ఆ తర్వాత ఆమె పోలీసులమని చెప్పుకున్నవాళ్లు అడిగిన 9 లక్షల రూపాయలు వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఆపరేషన్ మొత్తం పెద్ద మోసమని, తాను తన సొమ్ము కోల్పోయానని తర్వాత ఆమె గ్రహించారు.

"మీరు చదువుకున్నారు. ఎలా మోసపోయారు?" నా అనుభవం గురించి ఎవరికి చెప్పినా వాళ్లు ఇదే ప్రశ్న అడిగేవారని శ్రీవాస్తవ్ చెప్పారు.

"ఇదే ప్రశ్న నాకు నేను చాలాసార్లు వేసుకున్నాను" అని అన్నారు.

అంకిత శ్రీ వాస్తవ్, సైబర్ క్రైమ్, ఫెడెక్స్, సైబర్ ఫ్రాడ్, NCRB, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024లో భారతీయులు సైబర్ స్కాముల వల్ల రూ. 2.20 లక్షల కోట్లు నష్టపోయారు.

పెరుగుతున్న సైబర్ నేరాలు

ఇలా మోసపోయింది ఆమె ఒక్కరే కాదు.

2023-2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం భారత్‌లో సైబర్ నేరాలు ఏటా 18 శాతం పెరుగుతున్నాయి. డిజిటల్ మోసాల కారణంగా భారతీయులు 2.20 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.

2024లో లక్షకు పైగా సైబర్ నేరాలు రిజిస్టర్ అయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 50 శాతం పెరిగింది.

ఈ మోసాల్లో నేరస్తులు చట్టాన్ని అమలు చేసే పోలీసులు లేదా ప్రభుత్వ అధికారుల మాదిరిగా నటిస్తూ, బాధితులను తప్పుడు నేర ఆరోపణలతో భయపెట్టి "డిజిటల్ అరెస్ట్" చేశామని చెబుతూ వారిని వీడియోకాల్‌లోనే ఉంచి బెదిరిస్తారు. దేశంలో ఇలాంటి నేరాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.

మోసగాళ్లు నకిలీ పెట్టుబడి యాప్‌లు, మోసపూరిత ఈ మెయిళ్లు లేదా మెసేజ్‌లు పంపంచి.. బాధితులను బ్యాంక్ ఖాతా వివరాలు, కార్డుల వివరాలు, పాస్‌కోడ్లు అడుగుతారు. కృత్రిమ మేథను ఉపయోగించి గొంతు మార్చి మాట్లాడుతూ వ్యక్తుల్ని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతారు.

సైబర్ కేసులు పెరుగుతున్న తీరు, వీటి గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారనే దానితో పాటు మారుతున్న నేరాల స్వభావాన్ని సూచిస్తోంది.

"నగరీకరణ, ఆర్థిక మార్పు, సాంకేతికత వల్ల సమాజంలో పెరుగుతున్న ఆందోళనలు కొత్త రూపు దిద్దుకుంటున్న తీరు" కు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ అద్దం పడుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక గురించి టెలిగ్రాఫ్ పత్రిక రాసిన ఒక ఎడిటోరియల్‌ చెబుతోంది. ఈ కొత్త రకాల నేరాలు భారతీయ నేర న్యాయ వ్యవస్థను సవాలు చేస్తున్నాయని ఆ కథనం తెలిపింది.

ఈ విషయాన్ని శ్రీవాస్తవ్ కూడా అంగీకరిస్తున్నారు. మోసగాళ్ల నుంచి తన డబ్బులు తిరిగి పొందేందుకు పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆమె చెప్పారు.

"పోలీసులు, బ్యాంక్ అధికారుల కంటే మోసగాళ్లు ఒకడుగు ముందు ఉంటున్నారు" అని ఆమె అన్నారు.

అంకిత శ్రీ వాస్తవ్, సైబర్ క్రైమ్, ఫెడెక్స్, సైబర్ ఫ్రాడ్, NCRB, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగినంత వేగంగా డిజిటల్ జ్ఞానం పెరగడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

2024 చివరి నాటికి లక్షకు పైగా సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. 75వేల కేసులు ఇంకా కోర్టు దాకా రాలేదని ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక చెబుతోంది.

దీనర్థం భారతదేశం ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఏమీ చేయడం లేదని కాదు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సీ)ని ప్రారంభించింది. ఇది దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంది.

సైబర్ మోసాల మీద రిపోర్ట్ చేసేందుకు ప్రభుతం 1930 నెంబర్‌, ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించింది. డీప్‌ఫేక్, ఏఐ వాయిస్ మోసాలను అరికట్టేందుకు, సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచారాన్ని చేపట్టింది. కొత్త సాంకేతిక, డేటా రక్షణ చట్టాలను అమల్లోకి తెచ్చింది.

సైబర్ నేరగాళ్లు అక్రమంగా సంపాదించిన నిధులను వాడుకోవడం, వాటిని వేరే అకౌంట్లకు బదిలీ చేయడం, మనీ లాండరింగ్ చేయడానికి వీల్లేకుండా వారి బ్యాంక్ ఖాతాలను గుర్తించి నిర్మూలించడానికి ఏఐని ఉపయోగించుకునేందుకు 14సీ, రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

డిజిటల్ స్కామర్లను అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ కూడా కొన్ని చర్యలను పరిశీలిస్తోంది.

అంకిత శ్రీ వాస్తవ్, సైబర్ క్రైమ్, ఫెడెక్స్, సైబర్ ఫ్రాడ్, NCRB, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో 86 శాతం ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

‘‘ప్రజల అత్యాశే మోసగాళ్లకు ఆసరా’’

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సైబర్ నేరాలు తగ్గడం లేదని డేటా సూచిస్తోంది.

భారత్‌లో ఇంటర్నెట్ కనెక్షన్లు, స్మార్ట్‌ఫోన్ల పెరుగుదల ప్రజలను డిజిటల్ మోసాలకు గురయ్యే ప్రమాదాన్ని పెంచిందని ‘‘భారత్ బ్లఫ్: ఇన్‌సైడ్ ది కాన్స్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నెట్ రివల్యూషన్’’ అనే పుస్తక రచయిత్రి సౌమ్య గుప్తా చెప్పారు.

దేశంలో 86శాతానికి పైగా ఇళ్లు ఇప్పుడు ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

డిజిటల్ అక్షరాస్యత వేగంగా అభివృద్ధి చెందలేదని ఆమె చెప్పారు. ప్రజల్లో అవగాహన కలిగించే ప్రచారం, మీడియా కథనాల కారణంగా పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయని ఆమె చెప్పారు.

"అంతిమంగా చూస్తే, మోసం చేసే కళ సాంకేతికమైన దాని కన్నా మానసికమైనదే" అని సౌమ్య గుప్తా చెప్పారు.

మన భయం, దురాశ లేదా నమ్మకాలు, భావజాలాన్ని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తారని, ఒకసారి సైబర్ క్రైమ్‌లో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్న తర్వాత దాని గురించి మాట్లాడితే పరువు పోతుందని ప్రజలు భయపడతారని ఆమె తన పుస్తకంలో రాశారు.

మోసగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రజల ప్రవర్తనను గమనించి, ఆ సమాచారాన్ని ఉపయోగించి బాధితులను ఎంపిక చేసుకుని వారిని వలలో వేసుకునేలా మోసాలు చేస్తారని గుప్తా చెబుతున్నారు.

అంకిత శ్రీ వాస్తవ్, సైబర్ క్రైమ్, ఫెడెక్స్, సైబర్ ఫ్రాడ్, NCRB, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సైబర్ మోసాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల వీటిని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

భయపెట్టి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

పోలీసులంటే ఉన్న భయాన్ని, స్టాండప్ కమేడియన్‌గా తనకున్న ప్రజాదరణను స్కామర్లు తమకు అనుకూలంగా వాడుకున్నారని శ్రీ వాస్తవ్ చెప్పారు.

"పోలీసులకు భయపడాలని చిన్నప్పటి నుంచే మనకు నేర్పిస్తారు. నాలో పాతుకుపోయిన ఆ భయమే నా మెదడులో మోగుతున్న ప్రమాద ఘంటికలను అణచివేసింది" అని ఆమె చెప్పారు.

తన అనుభవం ఆధారంగా కామెడీ షో చేయడం తనను కలవరపరిచిందని, ప్రేక్షకులు తనను తెలివితక్కువ మహిళగా పిలుస్తారని భయపడ్డానని శ్రీవాస్తవ్ చెప్పారు.

"నగరంలో నివసిస్తున్న, చదువుకున్న, లోకజ్ఞానం ఉందని భావించే నాలాంటి వ్యక్తే మోసపోయినప్పుడు, ఎలా ఎవరికైనా జరగచ్చని చెప్పాలనుకున్నాను" అని శ్రీవాస్తవ్ అన్నారు.

ఆన్‌లైన్‌లో పంచుకునే విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం, బలమైన పాస్‌వర్డ్‌లతో తమ డేటాను భద్రపరచుకోవడం ముఖ్యమని గుప్తా చెబుతున్నారు.

"దీంతో పాటు, ముఖ్యమైన విషయం ఏంటంట, ఏదైనా నమ్మలేనంత బావుందంటే అది నిజం కాకపోవచ్చు. ఏదైనా సరిగ్గా అనిపించకపోతే అక్కడ ఆగండి. సాయం కోసం అడగండి" అని ఆమె సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)