పాక్ ప్రధానికన్నా ఆ దేశ ఆర్మీ చీఫ్‌నే డోనల్డ్ ట్రంప్ ఎందుకు ఎక్కువ నమ్ముతున్నారు?

ఫొటో సోర్స్, BBC/Getty
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో ప్రశంసించారు.
పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత... ట్రంప్ పలు సందర్భాల్లో పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్‌ను గొప్ప పోరాట యోధుడని, అత్యంత ముఖ్యమైన, అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణించారు.
2025 జూన్‌లో వైట్‌హౌస్‌లో పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్‌తో తన మొదటి సమావేశం జరిగిన తర్వాత... పాకిస్తానీ సైన్యాధిపతిని కలవడం తనకు గర్వంగా ఉందని ట్రంప్ అన్నారు.
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత.. గత అక్టోబర్‌లో ఈజిప్ట్‌లోని షర్మ్ అల్-షేక్‌లో జరిగిన శాంతి సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు అత్యంత ముఖ్యమైన సంఘటన జరిగింది.
కాల్పుల విరమణ ప్రయత్నాలకు మద్దతిచ్చిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ.. తన వెనక నిల్చున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ను ట్రంప్ ప్రస్తావించారు. ఆ వెంటనే.. ఆసిమ్ మునీర్ వైపుకు తిరిగి, తనకు 'అత్యంత ఇష్టమైన ఫీల్డ్ మార్షల్' అని అన్నారు.

కేవలం ఈ ఒక్క ప్రశంస మాత్రమే కాదు. ముఖ్యమైన సందర్భాల్లో కూడా జనరల్ ఆసిమ్ మునీర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ట్రంప్.
అబ్రహం ఒప్పందాలలో చేరాలని పలు ముస్లిం మెజారిటీ దేశాలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం కోరారు.
ఒప్పందంలో చేరని దేశాలు ఇకపై శాంతి ప్రక్రియలో భాగం కావని ఆయన అన్నారు.
అదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, తుర్కియే, జోర్డాన్, పాకిస్తాన్ నేతలతో శనివారం ఫోన్‌లో ట్రంప్ మాట్లాడారు.
అయితే, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌కు బదులుగా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేరును ట్రంప్ ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ అంతరంగికుడిగా ఆసిమ్ మునీర్ ఎలా మారారు?
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌ను, తుర్కియే అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్దొవాన్‌లను వారి అధికారిక హోదాలతో ట్రంప్ పేర్కొన్నారు.
కానీ, పాకిస్తాన్ తరఫున మాత్రం ఫీల్డ్ మార్షల్ సయ్యిద్ ఆసిమ్ మునీర్ పేరును రాశారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పేరు లేకపోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆసిమ్ మునీర్ ఎన్నికైన పదవిలో లేనప్పటికీ, ఆ దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయన్ను పరిగణిస్తున్నారు.
దేశ రాజకీయాలను, విదేశాంగ విధానాన్ని నిర్ణయించడంలో పాకిస్తాన్ సైన్యం చారిత్రాత్మకంగా ప్రధాన పాత్ర పోషించింది.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత ఎన్నోయేళ్లుగా దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో, ఆసిమ్ మునీర్ నేరుగా ట్రంప్‌కు, ఆయన సన్నిహిత వర్గానికి చేరువయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్ సంబంధిత దౌత్యంలో కూడా ఆసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆయన గతవారం తెహ్రాన్‌ను సందర్శించి, యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో మధ్యవర్తిగా వ్యవహరించారు.
తెహ్రాన్ తర్వాత.. చైనాకు వెళ్లారు. అప్పుడు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన తరచూ ముఖ్యమైన విదేశీ పర్యటనలకు షాబాజ్ షరీఫ్‌తో పాటు వెళ్తున్నారు.
ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపడంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా కనిపిస్తున్నప్పటికీ, చైనా కూడా తెర వెనుక పనిచేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
పాకిస్తాన్‌లో సైన్యాధిపతి అత్యంత శక్తివంతంగా ఉండటం అసాధారణం కానప్పటికీ.. 2025 మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణ, ఆసిమ్ మునీర్ సైనిక వృత్తిలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.
ఈ ఘర్షణ అనంతరం, ఫీల్డ్ మార్షల్‌గా ఆసిమ్ మునీర్ ప్రమోషన్ పొందారు. ఈ ఘర్షణలో భారత్, పాకిస్తాన్‌లు రెండూ విజయం తమదేనని ప్రకటించుకున్నాయి.
‘‘పాకిస్తాన్ సైన్యాధిపతి అంతర్జాతీయ ప్రతిష్ఠను పెంచిన నిర్ణయాత్మక అంశం భారత్‌తో జరిగిన ఈ ఘర్షణే ’’ అని పాకిస్తాన్ మాజీ విదేశాంగ, రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ గత ఏడాది డిసెంబర్‌లో ఖతార్ న్యూస్ చానెల్ అల్ జజీరాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్, అమెరికా రెండింటి నమ్మకాన్ని పొందడం
వాషింగ్టన్, తెహ్రాన్‌కు మధ్య ఎన్నో నెలలుగా అనధికారిక మధ్యవర్తిగా ఆసిమ్ మునీర్ వ్యవహరిస్తున్నారని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫాక్స్ న్యూస్ డిజిటల్‌కు పాకిస్తానీ ఆర్మీ జనరల్ స్టాఫ్ మాజీ చీఫ్, లెఫ్టినెట్ జనరల్ (రిటైర్డ్) అహ్మద్ సయీద్ చెప్పారు.
''ట్రంప్‌తోనూ, ఇరాన్ సైనిక వ్యవస్థతోనూ ఇంత సన్నిహిత సంబంధాలున్న విదేశీ ప్రముఖులను చూడటం చాలా అరుదు'' అని సయీద్ అన్నారు.
ఒక వ్యక్తి ట్రంప్‌కు అంత సన్నిహితంగా ఎలా మారారు? ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన సైనిక కమాండర్లతో అంత బలమైన సంబంధాలను ఎలా పెంచుకున్నారు? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
''2016-17లోనే ఇరాన్‌తో సంబంధాలను పెంచుకోవడం ఆసిమ్ మునీర్ ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన పాకిస్తాన్ మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్. ఆయన అక్కడి నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు" అని ఫాక్స్ న్యూస్‌తో సయీద్ చెప్పారు.
''నిఘా సంస్థలతో ఆయన పనిచేస్తూ వచ్చారు. ఐఆర్‌జీసీతో కూడా ఆయనకు సంబంధాలు ఉండేవి. కేవలం ఐఆర్‌జీసీతోనే కాకుండా.. ఇరాన్ సైనిక, నిఘా సంస్థలతో కూడా మునీర్ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ మాజీ కమాండర్ కాసిం సులేమానీతో కూడా మునీర్‌కు సుదీర్ఘ కాలంగా సంబంధాలు ఉండేవి'' అని తెలిపారు.
ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ ఇంత సన్నిహితంగా ఉండటం తనకు ఆశ్చర్యకరంగా లేదని ఫాక్స్ న్యూస్‌తో పాకిస్తానీ విశ్లేషకుడు రజా రుమీ అన్నారు.
"ట్రంప్ ఎప్పటి నుంచో బలమైన, నిర్ణయాత్మక నాయకులను అభిమానిస్తారు. ఆసిమ్ మునీర్ ఆ కోవకు చెందిన వారే. ఫలితాలను అందించగల ఒక శక్తివంతమైన వ్యక్తి. బయటికి ఆకర్షణీయంగా కనిపించే సైనిక నాయకుల్లా కాకుండా.. ఆయన శైలి చాలా ప్రశాంతంగా, సంయమనంతో ఉంటుంది. ఆయన పని విధానం బహిరంగ రాజకీయ వాక్చాతుర్యం కంటే ఇంటెలిజెన్స్ వర్క్ (గూఢచర్య పని), ఆపరేషనల్ ఎక్స్‌పీరియెన్స్ (కార్యాచరణ అనుభవం) ద్వారానే ఏర్పడింది. మునీర్ నేపథ్యం ఆయన పని చేసే విధానాన్ని, పెరుగుతున్న ఆయన ప్రభావాన్ని వివరిస్తుంది" అని రుమీ చెప్పారు.
''అమెరికా, ఇరాన్ నాయకత్వం మధ్య నేరుగా ఫోన్ సంభాషణలు జరిపించగల సామర్థ్యం ఉన్న కొద్దిమంది వ్యక్తులలో పాకిస్తాన్ సైన్యాధిపతి ఒకరు. ఆయన ఇరుపక్షాల మధ్య సందేశాలను చేరవేస్తూ, ఒక నమ్మకమైన మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ చర్చల అసలు సమన్వయం ఇస్లామాబాద్‌లో కాకుండా రావల్పిండిలో జరిగిందని ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు. అంటే, పార్లమెంటులో కాకుండా సైనిక ప్రధాన కార్యాలయంలో ఈ ప్రక్రియంతా సాగినట్లు భావిస్తున్నారు'' అని బ్రిటీష్ వార్తా పత్రిక ది గార్డియన్ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
'అసలైన శక్తి'
"ఈ మొత్తం ప్రక్రియను వెనుకుండి నడిపిస్తున్న అసలైన శక్తి ఫీల్డ్ మార్షల్ మునీరే. ఆయన లేకుండా.. ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. విదేశాంగ శాఖ కేవలం ఒక జూనియర్ భాగస్వామి మాత్రమే. ఇరాన్, అమెరికా వంటి దేశాలు ఆసిమ్ మునీర్‌ను నమ్ముతాయి. మన ప్రభుత్వ మంత్రులు నిజానికి కేవలం సహాయక పాత్రధారులు (సపోర్టింగ్ యాక్టర్స్) మాత్రమే" అని ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్‌లకు పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి గత నెలలో 'ది గార్డియన్'తో అన్నారు.
అయితే, మునీర్ అన్ని సమయాల్లో అంతర్జాతీయ దౌత్యవేత్త కాదని నిపుణులు అంటున్నారు.
2022లో సైన్యాధిపతి అయిన తర్వాత.. ఆయన ప్రధాన దృష్టంతా దేశ రాజకీయలపైనే ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కొత్త ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఇమ్రాన్ మద్దతుదారులను చాలా చాకచక్యంతో ఎదుర్కొన్నారు ఆసిమ్ మునీర్.
కానీ, గత ఏడాదిన్నరగా పాకిస్తాన్ విదేశాంగ విధానంలో ఆసిమ్ మునీర్ ప్రభావం పెరిగింది. పాకిస్తాన్ సైన్యాధిపతి అన్ని సమయాల్లో సౌదీ అరేబియా నమ్మకాన్ని పొందేవారు. కానీ, ఇతర సైన్యాధిపతులతో పోలిస్తే హౌస్ ఆఫ్ సౌద్‌లతో (సౌద్ రాజవంశస్తులతో) ఎక్కువ యాక్సెస్ పెంచుకుంది ఆసిమ్ మునీరే అని చెబుతారు.
అమెరికా, పాకిస్తాన్ మధ్యలో క్రిప్టో, మైనింగ్ ఒప్పందాలను ఆసిమ్ మునీర్ పర్యవేక్షించేవారు. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు.
''ఇతర దేశాల్లో తరచూ పర్యటించడం, ఆ దేశాల నాయకులతో నేరుగా సంప్రదింపులు జరపడం ద్వారా సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆయన చాలా చురుకుగా ఉండేవారు" అని మలీహా లోధి ' ది గార్డియన్' పత్రికకు తెలిపారు.
"ఎవరో ఫోన్ చేస్తారని ఎదురుచూసే వ్యక్తి కాదు. ఆయన దౌత్యపరమైన చొరవను చూస్తేనే అర్థమవుతుంది. అవసరమైతే ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెండోసారి పదవీ కాలంలో, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలను తిరిగి బలోపేతం చేయడంలో మునీర్ పోషించిన పాత్ర.. ఆయన్ను నమ్మకమైన మధ్యవర్తిగా నిలబెట్టింది.
2024 జనవరిలో పాకిస్తాన్, ఇరాన్‌లు రెండూ తమ భూభాగాలపై వైమానిక దాడులు చేసుకున్నాయి. అయితే, ఈ దాడులు వాటి మధ్య సంబంధాలను దెబ్బతీయలేదు.
గాజాలో ఇజ్రాయెల్ చర్యలను, ఆ తర్వాత జరిగిన 'పది రోజుల యుద్ధం' సమయంలో ఇరాన్‌పై జరిగిన బాంబు దాడులను పాకిస్తాన్ బహిరంగంగానే ఖండించింది.
పాకిస్తాన్ సున్నీ ముస్లిం మెజారిటీ దేశమైనప్పటికీ.. ఇక్కడి ప్రజలకు ఇరాన్(షియా మెజారిటీ దేశం) పట్ల సానుభూతి స్పష్టంగా కనిపిస్తుంది.
"ఆసిమ్ మునీర్‌కు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన దానిని అద్భుతమైన నైపుణ్యంతో మేనేజ్ చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో ఆయన వ్యవహరించిన విధానం, అవతలి వ్యక్తి మనస్తత్వానికి తగ్గట్టుగా దౌత్యం నడపడంలో ఆయనకున్న అవగాహనలో ఇది మరింత స్పష్టమైంది" అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ అవినాష్ పాలివాల్ చెప్పారు.
అయితే, పాకిస్తాన్ విస్తృతమైన దౌత్య ప్రచారానికి సంబంధించి పూర్తి ఘనతను ఒకే వ్యక్తికి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన నిపుణుల్లో పాలివాల్ ఒకరు.
పాకిస్తాన్‌లో సైన్యాధిపతిని చాలాకాలంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తున్నారు.
2022లో ప్రధాని షాబాజ్ షరీఫ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆసిమ్ మునీర్‌ను సైన్యాధిపతిగా నియమించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























