‘‘పెట్రోల్ ధరలు కాదు, ముందు ధాన్యం సంగతి చూడండి’’ అన్నందుకు ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌ను తొలగించారా? వివాదం ఏంటి, ఎవరేమన్నారు...

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
తెలంగాణ ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్‌ను విధుల నుండి తొలగించాలన్న తెలంగాణ అధికారుల ఉత్తర్వు వివాదం రాజేసింది.
''పెరిగిన ఇంధన ధరల సంగతి తర్వాత చూడొచ్చు. ముందుగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పట్టించుకోండి" అంటూ బస్సు డ్రైవర్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది.
ఈ ఘటనలో జగిత్యాల డిపోలో అద్దెబస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న బి.అశోక్‌ను విధుల నుంచి తొలగించాలని ఆ అద్దె బస్సు యజమానికి జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ నోటీసులు పంపారు.
అద్దె బస్సు డ్రైవర్ వీడియోలోని వ్యాఖ్యలు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయని నోటీసులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.
కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది.


ఫొటో సోర్స్, Laxman Kumar Adluri
వివాదం ఎక్కడ మొదలైంది?
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు మే 25న జగిత్యాలలో నిరసన చేపట్టారు.
పాత బస్టాండ్ నుంచి తహసిల్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించారు.
దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి, వాహనాలు కాసేపు నిలిచిపోయాయి.
ఆ సమయంలో బస్సు నడుపుతూ అటుగా వెళుతున్న ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలను అక్కడున్న వ్యక్తి ఒకరు రికార్డు చేశారు.
"వడ్లు, మక్కల (మొక్కజొన్న) గురించి పట్టించుకో, పెట్రోల్ అనేది ఎప్పుడైనా చూసుకోవచ్చు" అంటూ ఓ వ్యక్తిని ఉద్దేశించి అశోక్ మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది.
ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనను తొలగించాలని బస్సు యజమానికి ఆర్టీసీ అధికారులు నోటీసిచ్చారు.
ఈ సంఘటన గురించి అశోక్ స్థానిక మీడియాకు వివరణ ఇచ్చారు.
"ర్యాలీ సందర్భంగా కాసేపు నా బస్సును రోడ్డుపై నిలిపాను. ఆ సమయంలో ర్యాలీలో కనిపించిన మా ఊరు వ్యక్తితో మాట్లాడుతూ... వడ్లు, మక్కల గురించి ముందుగా మాట్లాడండి, రైతులు పరేషాన్ అవుతున్నారు అని నేను నా బస్సుతో వెళ్లిపోయాను. నేను ఏ రాజకీయ నాయకుడు, పార్టీ గురించి మాట్లాడలేదు. రోహిణి వస్తోంది, అకాల వర్షాలు కురిసి పంటలు పాడవుతాయన్న ఉద్దేశ్యంతోనే ఆ వ్యాఖ్యలు చేశాను" అని అశోక్ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
సోషల్ మీడియాలో కనిపించిన నోటీసులో ఏముంది?
జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం నుండి అద్దె బస్సు యజమాని చుక్క వేణుగోపాల్‌కు ఈ నోటీసులు వెళ్లినట్లు నోటీసులో ఉంది.
"విధుల్లో భాగంగా జగిత్యాల నుండి ధర్మపురికి వెళ్తున్న సమయంలో, ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను డ్రైవర్ అశోక్ విమర్శించారు. ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సి.లక్ష్మణ్ ఆ అంశంపైన వాట్సప్‌లో ఫిర్యాదు చేశారు. కాబట్టి వెంటనే డ్రైవర్ అశోక్ ను అద్దె బస్సు డ్రైవర్ విధుల నుండి ఉపసంహరించుకోవాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే, ఆ నోటీసు సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప, అధికారులు దానిని ధ్రువీకరించ లేదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న నోటీసులు నిజమేనా అని నిర్ధరించుకునేందుకు బీబీసీ ప్రతినిధి జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనకు రెండుసార్లు ఫోన్ చేశారు. కానీ, ఆమె స్పందించ లేదు. ఆమె స్పందన వస్తే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
ఈ వ్యవహారంపై డ్రైవర్ అశోక్ మంగళవారం మధ్యాహ్నం బీబీసీతో మాట్లాడారు.
‘‘రెండు రోజుల తర్వాత విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ నాతో చెప్పారు. ఇప్పటికిప్పుడే డ్యూటీ ఇవ్వలేమని అన్నారు’’ అని అశోక్ అన్నారు.

ఫొటో సోర్స్, Gangula Kamanalakar
ప్రతిపక్షాల ఆందోళన
'రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాధను వ్యక్త పరిస్తే విధుల్లో నుండి తొలగించడం ఎమర్జెన్సీ చర్యను తలపిస్తోందని' బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
డ్రైవర్ అశోక్ ఘటనపై కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డిలు నిరసనకు దిగారు.
డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"ప్రభుత్వాన్ని తిట్టలేదు. అతను ఏ పార్టీ కార్యకర్తా కాదు. పార్టీ కండువాలు కప్పుకోలేదు. రైతుల ఆవేదన తెలియజేశాడు. నోటీసులు వెంటనే వెనక్కి తీసుకుని విధుల్లోకి తిరిగి తీసుకోవాలి" అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
''అధికార పార్టీవారు రోడ్డెక్కి ఆందోళన చేయడం వింతగా ఉంది. పెట్రోల్, డీజీల్ ధరల పెంపులో బీజేపీది ఎంత బాధ్యతో, కాంగ్రెస్‌ది కూడా అంతే బాధ్యత. ప్రజలపై భారం తగ్గించాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అయితే పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్రం విధిస్తున్న పన్నులు పది శాతం తగ్గించాలి. నియంతృత్వ ధోరణితో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను పరిష్కరించాలి" అని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Ponnam Prabhakar
ప్రభుత్వం ఏం చెప్పింది?
డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించిన మాట అవాస్తవం అని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.
"ధాన్యం కొనుగోళ్ల గురించి అద్దె బస్సు డ్రైవర్ మాట్లాడితే మేము స్వాగతించడం తప్ప అతని మీద చర్య తీసుకోవాలని మా యాజమాన్యం చెప్పలేదు. నేను అధికారులు, బస్సు యజమానితో మాట్లాడాను. అతనిని తొలగించే ప్రశ్నే లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరుతున్నాం" అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























