దక్షిణ ఇరాన్‌పై దాడులు చేశామన్న అమెరికా సైన్యం, శాంతి ఒప్పందం సంగతేంటి?

ఇరాన్, అమెరికా, ట్రంప్, శాంతి ఒప్పందం, దాడులు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టాబీ మాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి స్థావరాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడులు చేసినట్టు అమెరికా సైన్యం చెప్పింది

ఇరాన్ బలగాల కారణంగా తమ దళాలకు పొంచి ఉన్న ముప్పు నుంచి ఆత్మరక్షణ కోసం ఈ దాడులు జరిపినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో అమెరికా సైన్యం సంయమనం పాటిస్తూనే బలగాలను రక్షించుకునే ప్రయత్నాలను చేస్తుందని సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఒప్పందం కుదరడానికి మరికొన్నిరోజులు పట్టొచ్చు’

అమెరికాతో చర్చల్లో పురోగతి ఉందని, కానీ సంక్షోభాన్ని ముగించే ఒప్పందం తక్షణమే కుదిరే అవకాశం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ ప్రకటించిన తరువాత ఈ దాడులు జరిగాయి.

హార్ముజ్ జలసంధి సమీపాన ఉన్న దక్షిణ ఇరాన్ పోర్ట్ సిటీ, నౌకాదళ కేంద్రమైన బందర్ అబ్బాస్ సమీప ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు కెప్టెన్ హాకిన్స్ తెలిపారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్‌లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అంతకుముందు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

అమెరికా దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది అస్పష్టంగా ఉంది.

ఒప్పందం కుదరడానికి ఇప్పటికీ అవకాశం ఉందని అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియో చెప్పారు. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి, విదేశాంగమంత్రి, ఖతార్ ప్రధానమంత్రి మధ్య చర్చలు జరుగుతాయని తెలిపారు.

'''మనమేదైనా కొంత పురోగతి సాధిస్తామేమో చూడాలి. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాలోని నిర్దుష్టభాషపై ఇంకా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అందుకే ఇది మరికొన్నిరోజులు పట్టొచ్చు'' అని అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్న రుబియో చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఒప్పందం కావాలని కోరుకుంటున్నారని రుబియో తెలిపారు. ''ఆయన మంచి ఒప్పందం కుదుర్చుతారు. లేదంటే అసలు ఒప్పందమే ఉండదు''అని చెప్పారు.

ఇరాన్, అమెరికా, ట్రంప్, శాంతి ఒప్పందం, దాడులు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌తో ఒప్పందం కుదరాలని ట్రంప్ భావిస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి చెప్పారు.

అంతకుముందు వారాంతంలో ఇరుపక్షాలు ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని ట్రంప్ చూచాయగా చెప్పినప్పటికీ, ఆ తర్వాత చర్చలకు తొందరపడొద్దని ఆదేశించారు. మరోపక్క సోమవారం నాటికి ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని రుబియో కూడా పేర్కొన్నారు.

''చర్చల్లో ఉన్న అంశాల్లో చాలా వాటిపై ఓ ముగింపుకు చేరుకున్నామని చెప్పొచ్చు. అంటే దానర్ధం వెంటనే ఒప్పందం కుదురుతుందని కాదు. ఎవరూ అలాంటి ప్రకటన చేయలేరు'' అని బకాయ్ తెలిపారు.

అవగాహనా పత్రంలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పొడిగింపు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం.

ఇరాన్, అమెరికా, ట్రంప్, శాంతి ఒప్పందం, దాడులు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొజ్తబా ఖమేనీ(ఫైల్ ఫోటో)

కీలక అంశాలపై చర్చ ఎప్పుడు?

యుద్ధం మొదటి రోజున ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ అజ్ఞాతంలో ఉండటం వల్ల ఆయనతో మాట్లాడడం కష్టంగా మారిందని, అందువల్లే శాంతి చర్చలు ఆలస్యమవుతున్నట్టు అమెరికా నిఘా విభాగం భావిస్తోందని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.

యుద్ధం ప్రారంభ సమయానికి ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన దాదాపు 440 కిలోల యురేనియం ఉందని భావిస్తున్నారు. ఇది మరికొంత శుద్ధి చేస్తే అణుబాంబు తయారీకి అవసరమైన 90శాతం స్థాయికి చేరుతుంది. అప్పుడు సైద్ధాంతికంగా ఇరాన్‌కు అణుబాంబు తయారుచేసే సామర్థ్యం ఉన్నట్టే.

శుద్ధి చేసిన యురేనియాన్ని తక్షణమే అమెరికాకు అప్పగించాలి లేదా అక్కడికక్కడే నాశనం చేయాలని సోమవారం రాత్రి ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ పాటిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా గల్ఫ్ నౌకాయానంపై ఇరాన్ నియంత్రణను కొనసాగిస్తుండగా, అమెరికా నౌకాదళం ఇరాన్ రేవులను దిగ్బంధించడానికి ప్రయత్నించింది.

అంతకుముందు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ విస్తృతమైన దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలపై ఇరాన్ దాడులు చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)