బీబీసీ ఇన్వెస్టిగేషన్: ‘కాగితం పార్టీలకు’ కోట్లాది రూపాయలు విరాళాలు.. వందల కోట్ల విరాళాల వెనుక మతలబు ఇదేనా

ఫొటో సోర్స్, Deepak Jasrotia
- రచయిత, శుభాంగి మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
గుజరాత్‌లోని ఆనంద్ సిటీలో ఉన్న సత్యవాది రక్షక్ పార్టీ కార్యాలయం వెలుపల గాఢమైన చీకటి అలుముకుని ఉంది. ఆ ఫ్లాట్ తలుపు తాళం వేసి ఉంది.
అది నిజంగానే ఆ పార్టీ రిజిస్టర్డ్ కార్యాలయం అని చెప్పడానికి ఎలాంటి బోర్డు కానీ, కనీసం పోస్టర్ కానీ లేదు.
ఆ పార్టీకి 2023-24 సంవత్సరంలో రూ. 330 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ, అక్కడి పరిస్థితి చూస్తే అలా లేదు.
ఆ పార్టీ అధికారిక రికార్డుల ప్రకారం.. అంత భారీ మొత్తంలో విరాళాలు వచ్చినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది.
ఆ పార్టీ ఆ వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం.. ఎన్నికల ప్రచారం కోసం రూ. 8.48 కోట్లు, "ప్రజా సంక్షేమం" నిమిత్తం అత్యధికంగా రూ. 316 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడైంది.

ఎక్కడైతే రిజిస్టర్డ్ ఆఫీసు ఉందో.. అదే కాంప్లెక్స్‌లోని ఫ్లాట్‌లో పార్టీ అధ్యక్షురాలు స్వాతి బెన్ నివసిస్తున్నట్లు బీబీసీ గుర్తించింది.
ఆమె పార్టీ పొందిన విరాళాలు, ఖర్చుపై ప్రశ్నించగా.. ''మేం సేవా కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేశాం. కానీ, దానికి సంబంధించిన రికార్డులను మాత్రం నిర్వహించలేదు'' అని స్వాతి బెన్ తెలిపారు.
గత లోక్‌సభ ఎన్నికలకు ముందున్న ఆర్థిక సంవత్సరం 2023-24లో అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన ఆరు ‘రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ’ (ఆర్‌యుపీపీ )లపై బీబీసీ పరిశోధన చేసింది.
ప్రధానంగా నిధుల విషయంలో పారదర్శకత లోపించిందనే అంశం ఈ పరిశోధనలో కనిపించింది.

భారత్‌లో 2,800 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే, వాటిలో కేవలం 73 పార్టీలను మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి జాతీయ లేదా రాష్ట్ర పార్టీలుగా గుర్తించింది.
మిగిలినవన్నీఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లే.
బీబీసీ ఇన్వెస్టిగేషన్ జూన్‌లో ప్రారంభమైంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో (ఎన్‌సీపీఐ)కి ఫిరాయించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎన్‌సీపీఐ కూడా ఒక ఆర్‌యూపీపీనే.
ఈ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు ఎన్‌సీపీఐకి చెందినవి కావు. అలాగే, అంతకుముందు ప్రస్తావించిన ఆరు పార్టీలు ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ సూచించడం లేదు.
అయితే, బీబీసీ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు, నిపుణులు వాటిపై చేసిన విశ్లేషణలు ఈ పార్టీల కార్యకలాపాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఉదాహరణకు, 2023-24లో ఈ పార్టీల మొత్తం ఆదాయం అధికార భారతీయ జనతా పార్టీ మినహా మిగతా ఐదు జాతీయ పార్టీల మొత్తం ఆదాయాన్ని మించి ఉంది.
అయినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికలలో అత్యంత సంపన్నమైన ఆరు ఆర్‌యూపీపీలు కేవలం 15 మంది అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించగా, ఆ ఐదు బీజేపీయేతర పార్టీలు 893 మంది అభ్యర్థులను నిలబెట్టాయని ఎలక్షన్ కమిషన్ డేటా వెల్లడిస్తోంది.
ఆరు ఆర్‌యూపీపీలలో అత్యధిక విరాళాన్ని పొందిన 'ఆమ్ జన్మత్ పార్టీ', ఎన్నికల్లో కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపింది.
ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన వివరాల ప్రకారం.. 2020లో పట్నాలో స్థాపించిన ఈ పార్టీకి రెండేళ్లపాటు రూ. 20,000 కంటే ఎక్కువ మొత్తంలో ఎటువంటి విరాళం అందలేదు.
రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన అన్ని విరాళాలకు సంబంధించిన వార్షిక నివేదికలను ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించడం రాజకీయ పార్టీలకు తప్పనిసరి.
అయితే, 2022-23లో 'ఆమ్ జన్మత్ పార్టీ' రూ. 216 కోట్లు స్వీకరించగా, 2023-24 నాటికి ఆ విరాళాలు రూ. 620 కోట్లకు పెరిగాయి.
పట్నాలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అనామిక పాసవాన్‌తో బీబీసీ మాట్లాడింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న పాసవాన్, తాను 2022లోనే 'ఆమ్ జన్మత్ పార్టీ'కి రాజీనామా చేశానని చెప్పారు.
ఆమె రాజీనామా లేఖను, అలాగే ఆ పార్టీ తన కార్యకలాపాల కేంద్రాన్ని అహ్మదాబాద్‌కు మార్చారని, ప్రస్తుతం గౌరవ్ మిశ్రా దాని అధ్యక్షుడిగా ఉన్నారని పేర్కొనే ఒక పత్రాన్ని అనామిక పాసవాన్ భర్త చూపించారు.
అయితే, అహ్మదాబాద్‌లోని పార్టీ రిజిష్టర్డ్ కార్యాలయం మూసివేసి ఉంది.
పార్టీ ట్రెజరర్ ధర్మేంద్ర వైష్ణవ్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. తాము కార్యకలాపాలను నిలిపివేశామని చెప్పారు. అయినప్పటికీ ఆ పార్టీ బ్యాంకు ఖాతాకు విరాళాలు పంపగలగడం సాధ్యమవుతున్నట్లు బీబీసీ గుర్తించింది.

పార్టీ ఆర్థిక వ్యవహారాల గురించి మరింత ఆరా తీయగా, తనకు ఆ విషయాలేవీ తెలియవని చెప్పిన ధర్మేంద్ర వైష్ణవ్, అన్ని ప్రశ్నలకూ మిశ్రాను సంప్రదించమని సూచించారు.
కానీ, పదేపదే ఫోన్ కాల్స్ చేసినా, మెసేజ్‌లు చేసినా మిశ్రా స్పందించలేదు.
రూ. 138 కోట్ల విరాళాలను పొంది, ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపిన 'గరీబ్ కళ్యాణ్ పార్టీ' విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది.
అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో, 'ఆమ్ జన్మత్ పార్టీ' కార్యాలయానికి సమీపంలోనే ఈ పార్టీ కార్యాలయం ఉంది.
ఆశ్చర్యకరంగా.. ఆరు ఆర్‌యూపీపీలకు చెందిన రిజిష్టర్డ్ కార్యాలయాలు దగ్గరదగ్గరగానే ఉన్నాయి. మరో రెండు కూడా గుజరాత్‌లోనే ఉన్నాయి.
గరీబ్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం కూడా తాళం వేసి ఉంది. పార్టీ అధ్యక్షుడు నీరజ్ కుమార్ క్షత్రియ నివాసంలో సంప్రదించగా.. ఆయన ఇంట్లో లేరని, పార్టీ కార్యకలాపాల గురించి తనకు ఏమీ తెలియదని ఆయన తల్లి ఆశా బెన్ బీబీసీతో చెప్పారు.
అయితే, ఆదాయపు పన్ను శాఖ తమ ఇంట్లో సోదాలు నిర్వహించిందని ఆమె అంగీకరించారు. ఆ సోదాలు ఎందుకు జరిగాయో తనకు తెలియదని ఆశా బెన్ చెప్పారు.
అయితే, ఈ పార్టీలకు అంత భారీ మొత్తంలో విరాళాలు ఎందుకు అందుతున్నాయో వివరించే సమాధానం తెలిసిన నిపుణులు, ఆదాయపు పన్ను అధికారులతో బీబీసీ మాట్లాడింది.
రాజకీయ పార్టీల ఆదాయాలకు పన్నుల నుంచి మినహాయింపునిచ్చే భారత పన్ను చట్టాలలోనే దీనికి సమాధానం ఉంది. అంతేకాకుండా, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు రుజువులను సమర్పించడం ద్వారా తమ ఆదాయాలపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
''రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందేందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు'' అని అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ మహేశ్ ఛాజెద్ అన్నారు.
ఈ రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల రశీదులను చూపించడం ద్వారా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేస్తారని ఛాజెద్ వివరించారు.
దానికి ప్రతిగా, ఆ పార్టీలు తమ కమీషన్ ఉంచుకున్న తర్వాత, ఆ డబ్బును పన్ను చెల్లింపుదారులకు నగదు రూపంలో తిరిగి చెల్లిస్తాయి.

ఫొటో సోర్స్, Facebook_Anamika Paswan
డిసెంబర్ 2025లో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో.. ఆర్‌యూపీపీలకు అందిన నకిలీ విరాళాలు, ఇతర ఆర్థిక అవకతవకల సమస్యను ఆదాయపు పన్ను శాఖ కూడా ఎత్తి చూపింది.
''ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల ద్వారా సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం.. ఈ ఆర్‌యూపీపీలు పన్ను దాఖలు చేయనివిగా, తమ నమోదిత చిరునామాలలో కార్యకలాపాలు నిర్వహించనివిగా, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నం కానివిగా ఉన్నప్పటికీ, వాటిని నిధుల మళ్లింపు, హవాలా లావాదేవీలు, సరిహద్దుల మీదుగా జరిగే చెల్లింపులు, విరాళాల కోసం నకిలీ రశీదులు జారీ చేయడానికి మాధ్యమాలుగా ఉపయోగించుకుంటున్నట్లు తేలింది" అని ఆ పత్రికా ప్రకటన పేర్కొంది.
ఈ పార్టీలలో చాలా వరకు తరచుగా "మనీ లాండరింగ్‌కు, పన్ను ఎగవేతకు ముసుగుగా" పనిచేస్తాయని ఎన్నికల పర్యవేక్షణ సంస్థ అయిన 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్'లో పరిశోధకురాలిగా ఉంటూ, ఆర్‌యూపీపీల ఆదాయాలపై అధ్యయనం చేసే షెల్లీ మహాజన్ బీబీసీకి తెలిపారు.
"ఈ పార్టీలు ఎన్నికలలో చురుగ్గా లేవు. అయినప్పటికీ వాటికి అంత భారీ నిధులు అందుతున్నాయి. అంతేకాకుండా అవి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాయి కూడా. కాబట్టి, ఇవి నిజంగా రాజకీయ పార్టీలా, లేక డబ్బును దారి మళ్లించడానికి (మనీ లాండరింగ్) షెల్ కంపెనీలకు పనిచేస్తున్నాయా?" అని ఆమె ప్రశ్నించారు.
ఇన్వెస్టిగేషన్ సమయంలో, అహ్మదాబాద్, దిల్లీ, పట్నాలలో ముగ్గురు పన్ను అధికారులను కూడా బీబీసీ కలిసింది. వారి పేరు బయటికి వెల్లడించకూడదనే షరతుపై వారు, అనేక ఆర్‌యూపీపీలు స్వతంత్రంగా లేదా సాధారణ రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా పనిచేస్తున్నాయని అంగీకరించారు.
బదులుగా, వాటి కార్యకలాపాలు పరస్పరం ముడిపడి ఉంటాయని, వాటికి, పన్ను చెల్లించే వారి మధ్య మధ్యవర్తులుగా పనిచేస్తున్న సీఏల నియంత్రణలో అవి నడుస్తాయని ఆ అధికారులు తెలిపారు.
బీబీసీ పరిశీలించిన మరో సంస్థ 'స్వతంత్ర అభివ్యక్తి పార్టీ' అధ్యక్షుడు సురేందర్ తివారీ ఈ వాదనను ధ్రువీకరించారు.
తమ పార్టీకి 2023-24లో రూ. 219 కోట్లు అందాయి. అయితే, ఆ డబ్బును వినియోగించుకునే అవకాశం తనకు లేదని ఆయన చెబుతున్నారు.
"ఎన్నికల ప్రచారం కోసం ఆ పార్టీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నాకు కొంత డబ్బు ఇచ్చారు. విరాళాల ద్వారా పన్ను మినహాయింపు పొందాలనుకునే తమ క్లయింట్లకు (పన్ను చెల్లింపుదారులు) ఆయన ఆ ప్రచారానికి సంబంధించిన వీడియోలను చూపించేవారు" అని తివారీ వీడియో కాల్‌లో చెప్పారు.
జులై 2026లో ఆదాయపు పన్ను శాఖ నుంచి తమ పార్టీకి నోటీసు వచ్చిందని తివారీ తెలిపారు. పార్టీ వ్యవహారాల పగ్గాలు తన చేతిలోనే ఉన్నప్పటికీ, తనకు విషయాలు తెలియకుండా దాచినందుకు పార్టీ చార్టర్డ్ అకౌంటెంట్ మయూర్ సింగ్‌దే బాధ్యత అని ఆయన ఆరోపించారు.
అయితే, మయూర్ సింగ్ మాత్రం ఎటువంటి అక్రమాలకూ పాల్పడలేదని ఖండించారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్‌కు తప్పనిసరిగా సమర్పించాల్సిన ఆడిట్ నివేదికలను మాత్రమే తాను దాఖలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
''న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ (బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో కవర్ చేసిన మరో పార్టీ) వంటి చాలా పార్టీలకు నేను పనిచేశాను. భారతీయ జన్ పరిషత్‌కు అంతకుముందు పనిచేశాను. అర్థం చేసుకోండి, ఈ పార్టీల వెనుకాల ఉన్నది ఒకే రకమైన వ్యక్తులు'' అని ఫోన్ కాల్‌లో సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Deepak Jasrotia
కానీ, ఈ పార్టీలకు వ్యతిరేకంగా ఏదైనా చర్యలు తీసుకున్నారా?
పేరు వెల్లడించకూడనే షరతుపై ఒక పన్ను అధికారి బీబీసీకి చూపించిన అంతర్గత పత్రాల ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ 2022 నుంచి ‘దురుద్దేశపూర్వక ఆర్‌యూపీపీ’లపై దర్యాప్తు చేస్తోంది.
పన్ను మినహాయింపు పొందేందుకు పన్ను చెల్లింపుదారులు ఆర్‌యూపీపీలకు సమర్పించిన రూ. 5,591 కోట్ల విలువైన నకిలీ విరాళాలను సంబంధిత శాఖ గుర్తించిందని ఆ పత్రాలు పేర్కొన్నాయి.
ఇందులో రూ. 2,749 కోట్లను ఆ శాఖ వసూలు చేయగలిగింది. అంతేకాకుండా, రాజకీయ పార్టీలకు సంబంధించిన రూ. 665 కోట్ల విలువైన విదేశీ లావాదేవీలను కూడా గుర్తించినట్లు ఆ పత్రాలు తెలిపాయి.
ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు.. అలాగే దోషులుగా అనుమానిస్తున్న పక్షాలపై శాఖ సోదాలు, స్వాధీనం చేసుకునే కార్యకలాపాలు చేపట్టినట్లు అవి పేర్కొన్నాయి.
ఆ పత్రంలోని వివరాలను ధ్రువీకరించాలని కోరుతూ.. బీహార్, గుజరాత్, న్యూదిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలకు, అలాగే 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్'కు బీబీసీ ప్రశ్నలు పంపింది.
ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్న ఆ ఆరు పార్టీలు, సోదాలు, స్వాధీన చర్యలు జరిపిన వాటిల్లో ఉన్నాయా అని కూడా బీబీసీ అడిగింది.
అయితే, బీబీసీకి ఇంకా ఎటువంటి సమాధానం అందలేదు.

ఫొటో సోర్స్, Deepak Jasrotia
అటువంటి సందర్భాల్లో ఇతర ప్రభుత్వ సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ "సమగ్ర ప్రభుత్వ విధానాన్ని" అనుసరించాలని ఆ శాఖ మాన్యువల్ చెబుతోందని పన్నుల వ్యవహారాల న్యాయవాది విభు జైన్ బీబీసీతో చెప్పారు.
సాధారణంగా ఆర్‌యూపీపీలు, ప్రత్యేకించి ఆరు నిర్దిష్ట పార్టీల ద్వారా జరిగిన ఆర్థిక అక్రమాల గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏదైనా సమాచారం అందిందా అని అడుగుతూ ఎలక్షన్ కమిషన్‌కు కూడా బీబీసీ ప్రశ్నలు పంపింది. దీనిపై కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందనా రాలేదు.
గత ఏడాది ఎలక్షన్ కమిషన్ 800కు పైగా ఆర్‌యూపీపీల పేర్లను జాబితా నుంచి తొలగించింది.
అయితే, గత ఆరేళ్లలో ఏ ఎన్నికల్లోనూ ఈ పార్టీలు ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేదని ఎలక్షన్ కమిషన్ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఆర్థికపరమైన అక్రమాలు కూడా ఈ చర్యకు కారణమయ్యాయా లేదా అనేది స్పష్టంగా లేదు. ఎలక్షన్ కమిషన్‌కు పంపిన ప్రశ్నల జాబితాలో బీబీసీ దీనిపైనా వివరణ కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































