ఒడిశా అడవుల్లో ఒరాంగుటాన్‌‌లు.. ఇండియాకు చెందని ఈ జంతువులు ఇక్కడికెలా వచ్చాయి?

Baby orangutans

ఫొటో సోర్స్, Nandankanan, Bhubaneswar

    • రచయిత, నికితా యాదవ్, సుబ్రత్ కుమార్ పతి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఇటీవల ఒడిశాలోని ఒక అడవిలో ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించాయి. అవి సహజంగా నివసించే ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో కనిపించడంతో, అక్కడికి ఎలా చేరుకున్నాయన్న దానిపై దర్యాప్తు ప్రారంభమైంది.

ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఫోటోలు, వీడియోల్లో ఈ చిన్న ఒరాంగుటాన్లు నేలపై ఒకేచోట కూర్చుని అరటి పండ్లు తింటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవి సహజంగా నివసించే ఉష్ణమండల రెయిన్ ఫారెస్ట్‌కి వేల కిలోమీటర్ల దూరంలో ఇవి కనిపించాయి.

ఒరాంగుటాన్లు భారతదేశానికి చెందిన జంతువులు కావు. అంతరించిపోవడానికి చేరువలో ఉన్న జంతువుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఇండోనేసియా, మలేసియాల్లోని అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి.

ఏవైనా అంతర్జాతీయ అక్రమ రవాణా ముఠాలు వీటిని భారత్‌కు తరలించి, ఆ తర్వాత రహదారి సమీపంలో వదిలివేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఒడిశా అటవీ శాఖ మంత్రి తెలిపారు.

స్థానికులు ఈ ఒరాంగుటాన్లను గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున బాలాసోర్ జిల్లాలో వాటిని కాపాడారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. ప్రస్తుతం వాటిని క్వారంటైన్‌లో ఉంచి, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ జంతువులు సహజంగా ఒడిశాకు చేరుకునే అవకాశం లేదని, వాటిని రోడ్డు మార్గంలో అక్కడికి తరలించి ఉండవచ్చని బాలాసోర్ జిల్లా అటవీ అధికారి ప్రతీక్ ప్రకాశ్ ఇందల్కర్ బీబీసీతో చెప్పారు.

"పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని భోగరాయ్ బ్లాక్‌లో ప్రతిపాదిత రిజర్వ్ ఫారెస్ట్ అయిన రణకట ప్రాంతంలో ఈ ఐదు పిల్ల ఒరాంగుటాన్‌లు కనిపించాయి" అని ఆయన చెప్పారు.

orangutans

ఫొటో సోర్స్, ANI

"ఈ ప్రాంతంలో ప్రధానంగా సరుగుడు (కాజువరీనా) చెట్లు ఉన్నాయి. ఇది దట్టమైన అడవి కాదు. రాష్ట్ర రహదారికి కూడా ఇది సమీపంలోనే ఉంది" అని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోను ఒడిశా ప్రభుత్వం కోరినట్లు సమాచారం.

పోలీసులు, అటవీ అధికారులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి.

ఆ ఒరాంగుటాన్లు ఈ ప్రాంతంలో రెండు లేదా మూడు రోజులుగా మాత్రమే ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు.

అడవిలో మరే ఇతర ఒరాంగుటాన్లు కనిపించలేదని, అవి అక్కడికి ఎలా చేరుకున్నాయనే దానిపై ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదని ఇందల్కర్ తెలిపారు.

అధికారులు ఇవి పిల్ల ఒరాంగుటాన్లని బీబీసీతో చెప్పారు. అయితే కొన్ని స్థానిక వార్తా కథనాల్లో వాటి వయసు ఒకటి నుంచి రెండేళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.

వాటి చిన్న వయసే ఈ ఘటనను మరింత ఆందోళనకరంగా మారుస్తోందని వైల్డ్‌లైఫ్ నిపుణులు బిశ్వజిత్ మొహంతి తెలిపారు.

పిల్ల ఒరాంగుటాన్లు సాధారణంగా తమ తల్లులతో కలిసి అనేక సంవత్సరాలు ఉంటాయి. స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ సమయంలో నేర్చుకుంటాయి. ఆడ ఒరాంగుటాన్లు సాధారణంగా ఎనిమిదేళ్లకు ఒకసారి మాత్రమే పిల్లలకు జన్మనిస్తాయి.

అందువల్ల సహజ నివాస ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో, సమీపంలో ఒక్క పెద్దవయసు ఒరాంగుటాన్ కూడా లేకుండా ఐదు చిన్న ఒరాంగుటాన్లు ఒకేసారి కనిపించడం, అవి ఒడిశాకు ఎలా చేరుకున్నాయనే దానిపై ఆందోళనలను పెంచింది.

The orangutan is found in rainforests of Indonesia and Malaysia

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ప్రస్తుతం ప్రపంచంలో మూడు ఒరాంగుటాన్ జాతులు ఉన్నట్లు గుర్తించారు. అవి బోర్నియన్, సుమత్రన్, తపనులి ఒరాంగుటాన్లు. వీటన్నింటినీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లేదా ఐయూసీఎన్ క్రిటికల్లీ ఎండేజర్డ్ జాతులుగా వర్గీకరించింది.

అటవీ నిర్మూలన, సహజ ఆవాసాల నష్టం, వేట కారణంగా ఎన్నో ఏళ్లుగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

అంతరించిపోతున్న వన్యప్రాణుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రపంచ ఒప్పందమైన సైట్స్ ప్రకారం ఒరాంగుటాన్ల అంతర్జాతీయ వాణిజ్యం నిషేధం. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కూడా వీటికి రక్షణ ఉంది.

అయినప్పటికీ, అరుదైన పెంపుడు జంతువులుగా విక్రయించేందుకు, ప్రైవేటు మధ్యవర్తులకు విక్రయించేందుకు ఒరాంగుటాన్ల అక్రమ రవాణా కొనసాగుతోంది.

భారత్‌లో చిన్న ఒరాంగుటాన్లు కనిపించడం ఇదే తొలిసారి కాదు.

2022లో అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు సమీపంలోని ఒక చెక్‌పోస్ట్ వద్ద రెండు పిల్ల ఒరాంగుటాన్లను గుర్తించారు. పొరుగు దేశమైన మియన్మార్ మీదుగా వాటిని భారత్‌లోకి తీసుకొచ్చి ఉండచ్చని అధికారులు భావించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)