పాము కాటుకు, కీటకాల కాటుకు తేడా ఏమిటి, పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హర్మన్‌దీప్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఏటా వర్షాకాలంలో పాము కాటు ఘటనలు పెరుగుతుంటాయి.
తాజాగా పంజాబ్‌లోని లూధియానా జిల్లాలోని బాసియన్ గ్రామంలో పాముకాటుకు ఇద్దరు అన్నా చెల్లెళ్లు మృతి చెందారు.
రాఖీ పండుగ రోజున ఎనిమిదేళ్ల జోబన్‌ప్రీత్, అతని ఆరేళ్ల సోదరి జస్ప్రీత్ పాముకాటుతో మృతి చెందారు.
ఇద్దరు చిన్నారులు వారి నానమ్మ ఇంట్లో అకస్మాత్తుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనను ఏదో కుట్టిందని జోబన్‌ప్రీత్ తన నానమ్మకు చెప్పాడు. అది ఏ పురుగో, దోమో అయ్యుంటుందని కుటుంబ సభ్యులు భావించారు. కొంతసేపటి తర్వాత జస్ప్రీత్ కూడా తనను ఏదో కుట్టిందని చెప్పింది.
ఇంతలో చిన్నారుల పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఒక పాము కనిపించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రికి చేరుకునేలోపే జస్ప్రీత్ మృతి చెందగా, జోబన్‌ప్రీత్ లూధియానాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత్‌లో ఏటా సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాటు కేసులు నమోదవుతున్నాయి. వీటిలో దాదాపు 50 వేల మంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాముకాటుకు గురై మరణించే వారి సంఖ్యలో ఇది దాదాపు సగం.
ఈ నేపథ్యంలో పాము కాటేసిన తర్వాత ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
వైద్య సహాయం అందేలోపు ఏం చేయాలి?
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP), వైద్యుల సూచనల ప్రకారం ఈ కింది ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
• రోగిని ముందు ప్రశాంతంగా ఉంచాలి.
• ఆందోళనకు గురికాకుండా, రోగిని అతిగా కదిలించకుండా చూడాలి.
• రోగిని బలవంతంగా పరుగెత్తించకూడదు లేదా నడిపించకూడదు.
• పాము కరిచిన అవయవాన్ని సాధ్యమైనంత తక్కువగా కదిలించాలి.
• పాము కరిచిన చేయి లేదా కాలును కదపకూడదు.
• పాము కరిచిన శరీర భాగంలో ఉండే నగలు, ఉంగరాలు, గాజులు, బూట్లు, గడియారాలు, బిగుతైన దుస్తులను తొలగించాలి. ఆ ప్రాంతంలో తర్వాత వాపు ఏర్పడితే ఇవి పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు.
• గాయాన్ని కప్పకూడదు.
• రోగిని ఎడమ వైపున పడుకోబెట్టాలి. తలకు చేతితో ఆసరా ఇస్తూ, కుడి కాలును మడిచి ఉంచాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి తప్పులను నివారించాలి?
నేషనల్ హెల్త్ మిషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ప్రకారం, పాము కరిచిన ప్రాంతాన్ని తాడు లేదా వస్త్రంతో గట్టిగా కట్టకూడదు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి, ఆ అవయవం దెబ్బ తినచ్చు
గాయాన్ని బ్లేడ్, కత్తి లేదా మరేదైనా వస్తువుతో కోయకూడదు. విషాన్ని నోటితో పీల్చేందుకు కూడా ప్రయత్నించకూడదు. గాయంపై మంచు, వేడి, విద్యుత్ లేదా రసాయనాలను ఉపయోగించకూడదు. ఇలాంటి పద్ధతుల వల్ల నష్టం కలగచ్చు.
పాము విషానికి ఆసుపత్రిలోనే శాస్త్రీయ చికిత్స జరుగుతుంది. సంప్రదాయ చికిత్సా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, అందువల్ల తాంత్రికులు, బాబాలు లేదా వనమూలికల కోసం వెళ్లి సమయాన్ని వృథా చేయకూడదని సామ్నాలోని వైద్యాధికారి డాక్టర్ దీపక్ మోంగియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ లక్షణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి?
పాము కరిచిన చోట నొప్పి, క్రమంగా పెరుగుతున్నా, వాపు, రక్తస్రావం, పొక్కులు రావడం. కనురెప్పలు వాలిపోవడం, చూపు మసకబారడం లేదా అన్నీ రెండుగా కనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత, ముక్కు, చిగుళ్లు లేదా ఇతర ప్రాంతాల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయోమో గమనించాలని డాక్టర్ మోంగియా చెప్పారు.
"ఏదేమైనా, పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి. పాము విషపూరితమైంది అయినా కాకపోయినా ఆసుపత్రికి వెళ్లాలి. రోగికి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు, ఆసుపత్రి నిర్ణయించాలి. అయితే ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారిందని అర్థం" అని ఆయన చెప్పారు.
"కొన్ని విషపాముల కాటుకు సంబంధించిన లక్షణాలు ఆలస్యంగా కనిపించవచ్చు. అందువల్ల మొదట్లో రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆసుపత్రికి వెళ్లడం ముఖ్యం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రిలో ఏం జరుగుతుంది?
"ఆసుపత్రికి చేరుకున్న వెంటనే రోగిని ముందుగా అత్యవసర విభాగంలో చేర్చుకుంటారు. అక్కడే చికిత్స ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పాము కాటు విషపూరితమైనదా కాదా అనేది నిర్ధరించి, ఆ తర్వాత దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు" అని లూధియానా సివిల్ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల్ సరీన్ చెప్పారు.
"పాముకాటు చికిత్సకు ఉపయోగించే యాంటీ-వీనమ్ వ్యాక్సిన్ అత్యవసర విభాగం ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుంది" అని ఆయన తెలిపారు.
పాము కాటు విషపూరితమైనదా కాదా అని తెలుసుకునేందుకు వైద్యులు రోగిని పరీక్షిస్తారు. కాటు విషపూరితమైనదైతే యాంటీ-స్నేక్ వీనమ్ (ఏఎస్‌వీ) ఇస్తారు. పాము విషం వల్ల కలిగే తీవ్రమైన ప్రభావాలకు చికిత్స చేసేందుకు ఉపయోగించే ప్రత్యేక చికిత్స ఇది. ఈ ఇంజెక్షన్‌తో రోగి కోలుకోకపోతే, లైఫ్ సపోర్ట్ వ్యవస్థపై ఉంచి, విషం ప్రభావం వల్ల కనిపించే లక్షణాలకు చికిత్స చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పురుగు కాటుకు, పాముకాటుకు తేడా ఏమిటి?
"పాముకాటు గుర్తులు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి. కొన్నిసార్లు నాలుగు గాట్లు ఉంటాయి. కొన్నిసార్లు రెండు గాట్లు, మరికొన్నిసార్లు ఒకే గాటు ఉంటుంది. ఏ జాతి పాము కరిచిందో సామాన్యులు గుర్తించలేరు. ఈ తేడాను నిపుణులు మాత్రమే గుర్తించగలరు" అని డాక్టర్ మోంగియా చెప్పారు.
"కట్లపాము కాటును తరచూ దోమ లేదా పురుగు కాటుగా భావిస్తారు. దీని గాటు చాలా సన్నగా ఉంటుంది. కొన్నిసార్లు కాటును గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి అది గీతలాగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అసలు స్పష్టంగా కనిపించదు" అని ఆయన చెప్పారు.
వర్షాకాలంలో పాముకాటు ఘటనలు ఎందుకు పెరుగుతాయి?
వర్షాకాలంలో పాముకాటు ఘటనలు పెరగడానికి కారణం భారీ వర్షాలు, వరదలతో పాములు దాక్కునే ప్రదేశాలు నీటితో నిండిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. తడి నేలల నుంచి అవి పొడి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇళ్లు, ఇతర భవనాల్లోకి కూడా చేరుతాయి.
"వర్షాకాలం పాములకు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో వాటి సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పురుగులు కూడా ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అందుకే పురుగులను వెంటాడుతూ పాములు నివాస ప్రాంతాలకు కూడా వచ్చేస్తుంటాయి" అని వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























