రేవంత్ రెడ్డితో మోదీ ఏమన్నారు? కలసి పనిచేద్దామన్నారా? తమతో కలసిపొమ్మని కోరారా?

ఫొటో సోర్స్, telangana CMO
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కోరగా, అందుకు తమతో కలవాలన్న అర్థం వచ్చేలా విధంగా మోదీ స్పందించడం చర్చకు దారి తీసింది.
మే 10న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.
''నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారు. పదేళ్ళలో ఆయన దేశం కోసం గుజరాత్ మోడల్ నిర్మించారు. ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కూడా అలాంటి ఆశతోనే ఉన్నారు'' అని రేవంత్ ప్రధానిని ఉద్దేశించి అన్నారు.
ఈ విషయంపై అదే వేదికపై నుంచి స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మన్మోహన్ ఇచ్చినంత అయితే తెలంగాణకు సగమే వస్తుంది అన్నారు.
''నేను రేవంత్ గారికి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే పదేళ్ళ పాలనా కాలంలో భారత ప్రభుత్వం గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో అది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకున్న సమాచారం మేరకు చెబుతున్నాను. నేను అలా చేస్తే మీకు ఇప్పుడు ఎంత లభిస్తుందో అది సగమైపోతుంది (నిధుల గురించి). మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోలేరు. అందుకే మీరు నాతో కలవండి'' అన్నారు మోదీ.
దీంతో ఈ వ్యాఖ్యాలు చర్చనీయమయ్యాయి. ఒక ప్రధాన మంత్రి.. విపక్షానికి చెందిన ముఖ్యమంత్రితో, అధికారిక వేదికపై మీరు నిధుల కోసం మాతో కలవండి అన్నారనీ, అలా అనడం సరైనదని కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.


ఫొటో సోర్స్, Dasoju Sravan
కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందనేంటి?
''అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడను అంటూనే మాట్లాడారు ప్రధాని. మన్మోహన్ సింగ్ ఇచ్చినట్లు ఇస్తే ఇప్పుడు ఇచ్చే దాంట్లో సగం కూడా రావు అని మోదీ అనడం విడ్డూరంగా ఉంది. మీరు అనుకున్నది సాధించాలంటే నాతో కలువు అని రేవంత్ రెడ్డిని అడిగారు మోదీ. దేశంలో ప్రతిపక్ష పార్టీలకు బలమైన నాయకులు ఉండవద్దు అని మోదీ ఉద్దేశం. మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా? మోదీ దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి. రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల వాటాలను తిరిగి కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. అభివృద్ధికి సహకరించాలని రేవంత్ అడిగితే, మోదీ రాజకీయాలు మాట్లాడారు'' అని విమర్శించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
''మా పార్టీలోకి వస్తే, నిధులు ఇస్తాం అనడం అత్యంత దిగజారుడుతనం. తెలంగాణగడ్డ మీదకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని లొంగిపొమ్మనడం తెలంగాణ బిడ్డలుగా మాకు బాధగా ఉంది. ఇంకోసారి ప్రధాని నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావని ఆశిస్తున్నాం'' అని కాంగ్రెస్ నాయకులు మల్లాది పవన్ వ్యాఖ్యానించారు.
అసలు గుజరాత్ మోడల్ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ.
''12 ఏళ్లుగా రాహుల్ గాంధీ "గుజరాత్ మోడల్" అంటేనే అది కొద్దిమంది కార్పొరేట్ శక్తుల దోపిడీ అని, సామాజిక విభజన అని దేశవ్యాప్తంగా పోరాడుతున్నారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం అదే గుజరాత్ నమూనాను బెంచ్ మార్క్‌గా తీసుకోవడం గమనార్హం. తన నాయకుడు 'పీడకల' అని పిలిచే విధానాన్ని, ముఖ్యమంత్రి 'స్వప్నం' అని ఎలా అంటారు? దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ సిద్ధాంతాలను పక్కన పెట్టి, ఒక ప్రైవేటు ఫ్రాంచైజీలా కాంగ్రెస్‌ను నడుపుతున్నారు రేవంత్. ప్రధాని మోదీ పట్ల ముఖ్యమంత్రి చూపిస్తున్న భక్తి ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది'' అని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్.

ఫొటో సోర్స్, telangana CMO
బీజేపీ నాయకులు..
మోదీ వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదంటున్నారు బీజేపీ నాయకులు.
''రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, కోపరేటివ్ ఫెడరలిజం అనేది బీజేపీ వైఖరి. అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వికసిత తెలంగాణ లేకుండా వికసిత భారత్ ఉండదు కదా. అందుకే ఆ ప్రగతి పథంలో తమతో చేయి కలపమన్నారు ప్రధాని. భారత ప్రధాని హోదాలో, తెలంగాణ ముఖ్యమంత్రిని అభివృద్ధి పథంలో చేరమని మాత్రమే చెప్పారు. అంతే కానీ, అవి రాజకీయంగా చెప్పిన మాటలు కాదు'' అన్నారు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి.
అటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా ఉందని అంటున్నారు కిషోర్ రెడ్డి.
''తెలంగాణ గత ముఖ్యమంత్రి కేసీఆర్ అలా ప్రగతి పథంలోకి రాలేదు. తన దారి వేరు అనుకుంటూ, ప్రధానమంత్రి కార్యక్రమాలను, అధికారిక కార్యక్రమాలను కూడా బహిష్కరిస్తూ, గైర్హాజరవుతూ వచ్చారు. దాని నేపథ్యంలో ప్రధాని ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, ప్రభుత్వాలుగా కలసి పనిచేద్దాం అని చెప్పిన మాట అది. అది గవర్నెన్స్ నేపథ్యం తప్ప పాలిటిక్స్ నేపథ్యంలో అన్నది కాదు'' అన్నారు కిషోర్ రెడ్డి.
రేవంత్ రెడ్డి సంఘ్ నేపథ్యాన్ని, తాజా ప్రధాని వ్యాఖ్యలను కూడా ముడిపెడుతూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు.

ఫొటో సోర్స్, telangana CMO
విశ్లేషకుల మాటేంటి?
''రేవంత్ రెడ్డి సంఘ్ సంస్థల్లో పనిచేసి ఉండొచ్చు కానీ, ఆ సిద్ధాంతం కోసం పనిచేయలేదు అనవచ్చు. అలాగే తాజా వ్యాఖ్యలను కూడా అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. ఒక్క మాట ఇక్కడ చెప్పాలి. ఆ వ్యక్తి లక్షలు తీసుకున్నాడంటూ బెంగాల్లో ప్రధాని ఎవర్ని ఘాటుగా విమర్శించారో, అతణ్ణే ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు రాజకీయం అంతా ఎవరితో జతకడితే గెలుస్తాం, బలపడతాం, పెరుగుతాం అనుకుంటారో వారితోనే జత కడతారు. ఏ క్షణమైనా, ఏదైనా జరగవచ్చు. ఎవరైనా రంగులు మార్చవచ్చు. దానికి సిద్ధాంతాలు లేవు. అయితే ఇప్పటికిప్పుడు ఆ మాటలను అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అని బీబీసీతో అన్నారు సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్.
ప్రధాని మాటలను పాజిటివ్‌గా చూడాలంటున్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.
''మాతో పనిచేయమన్నారు. అందరం డెవలెప్ అవుతాం అని సందేశం ఇచ్చారు. రేవంత్ బాగా మాట్లాడారు, మోదీ బాగా మాట్లాడారు. ఈ మధ్య మన దేశంలో రాజకీయ వైరం, వ్యక్తిగతంగా మారిపోయింది. సీఎం, పీఎంతో మాట్లాడకపోవడం, పీఎం కొందరు సీఎంలను సరిగా చూడకపోవడం ఇదంతా.. ప్రజాస్వామ్యానికీ, అభివృద్ధికీ నష్టం. ఈ పరిస్థితుల్లో పీఎం అన్న అర్థం మాతో కలసి పనిచేయమనే. దానికి సీఎం కూడా చక్కగానే రియాక్ట్ అయ్యారు. ఇది రాజీకయంగా సైన్. పొలిటికల్‌గా తీసుకోవాల్సింది కాదు'' అన్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






















