సమాధిలోని వృద్ధుడి శవాన్ని ఆయన కొడుకులతోనే బయటకు తీయించిన సెటిలర్లు.. వెస్ట్ బ్యాంకులో ఏం జరుగుతోంది?

- రచయిత, వైర్ డేవీస్
- హోదా, మధ్య ప్రాచ్య ప్రతినిధి, అససా, వెస్ట్ బ్యాంకు
- చదివే సమయం: 4 నిమిషాలు
(ఈ కథనంలో అంశాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయవచ్చు)
మొహమ్మద్ అససా చనిపోయిన తన 80 ఏళ్ల తండ్రి హుస్సేన్‌ను ఖననం చేసి అప్పుడే ఇంటికి వచ్చారు. కొద్దిసేపటికే.. కొంతమంది పిల్లలు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, 'సెటిలర్లు సమాధిని తవ్వుతున్నారు' అని అరుచుకుంటూ చెప్పారు.
వెస్ట్‌బ్యాంక్‌లో జెనిన్‌కు దగ్గర్లో ఉన్న ఒక చిన్న గ్రామం అససా. ఈ గ్రామం పేరునే ఆ కుటుంబ పెద్ద తమ పేరులో జతచేర్చుకున్నారు.
మొహమ్మద్ తండ్రి హుస్సేన్ వృద్ధాప్య సమస్యలతో గత శుక్రవారం మరణించారు. గ్రామంలో ఆయనకు గౌరవనీయమైన వ్యక్తిగా పేరుంది.
ఇస్లాం సంప్రదాయాలకు అనుగుణంగా, హుస్సేన్‌ను తమ ఇల్లు ఉన్న గ్రామానికి అవతల వైపున చిన్న కొండపైనున్న శ్మశానవాటికలో ఖననం చేశారు.
హుస్సేన్ పశువుల వ్యాపారం చేసేవారు, ఆయనకు పదిమంది పిల్లలు.

సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో... మొహమ్మద్ ముందుగానే తన తండ్రి అంత్యక్రియల కోసం సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరం నుంచి అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు.
అయితే, ఖననం చేసిన తర్వాత అరగంట కూడా గడవకముందే, మొహమ్మద్, ఆయన సోదరులు మళ్లీ తండ్రి సమాధి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొంతమంది యూదు సెటిలర్లు (కొంతమంది చేతిలో ఆయుధాలూ ఉన్నాయి) పనిముట్లతో అప్పుడే వేసిన సమాధిని తవ్వే ప్రయత్నాలను చూసి హుస్సేన్ కొడుకులు నిర్ఘాంతపోయారు.
ముందు ఆ సెటిలర్లకు నచ్చచెప్పాలని ప్రయత్నించారు మొహమ్మద్. కానీ, సెటిలర్లు తన తండ్రి సమాధికి మరింత సమీపించగానే మొహమ్మద్ ఆ సమాధి దగ్గరకు పరుగెత్తారు.
‘‘వారు అప్పుడే మృతదేహం వద్దకు చేరుకుంటున్నారు. సమాధిలోంచి మృతదేహాన్ని బయటకు తీస్తారని నాకు అర్ధమైంది. అందుకే మేం అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని అన్నారు మొహమ్మద్.

ఆ సెటిలర్లు శ్మశానవాటిక పైన ఉన్న కొండపై ఇటీవలే పునరుద్ధరించిన సా-నూర్ అనే సెటిల్మెంట్కు చెందిన వారు.
పాలస్తీనా భూభాగంపై ఈ సెటిల్మెంట్లన్నీ అంతర్జాతీయ చట్టం కింద చట్టవిరుద్ధమైనా .. ఆక్రమిత పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లో కొత్త సెటిల్మెంట్లను విస్తరించడానికి, సృష్టించడానికి తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయంలో భాగంగా.. బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఇటీవల సా-నూర్‌ను తిరిగి ఆక్రమించుకోవడానికి అనుమతించింది.
''మృతదేహాన్ని మీరే వెలికితీయాలి లేదంటే మేం తీస్తాం'' అంటూ ఆటోమేటిక్ రైఫిల్స్‌ను చేతిలో పట్టుకున్న సెటిలర్లు మొహమ్మద్‌ను బెదిరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులే హుస్సేన్ సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీస్తున్నట్లు మొబైల్ ఫోన్ ఫుటేజీ చూపించింది.
వారి సెటిల్మెంట్కు ఈ సమాధి చాలా దగ్గరగా ఉందని సెటిలర్లు అన్నారు.
చనిపోయిన తమ తండ్రి మృతదేహాన్ని సెటిలర్ల పర్యవేక్షణలో మొహమ్మద్, ఆయన సోదరులు సమాధి నుంచి వెలికి తీసి, కొండ కిందకు తీసుకొచ్చినట్లు పలు ఫోటోల్లో కనిపిస్తోంది.
సెటిలర్ల నుంచి సమాధిని తవ్వి తీసే పరికరాలను స్వాధీనం చేసుకుని, మరింత ఉద్రిక్తత తలెత్తకుండా చూశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
కానీ, తమ తండ్రి అంత్యక్రియల కోసం అప్పుడే తవ్విన సమాధిని అవమానకరంగా ఖాళీ చేయించేందుకు సెటిలర్లు తమల్ని బలవంతం చేస్తున్నప్పుడు సైనికులు ఏం మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర పోషించారని హుస్సేన్ కుటుంబం ఆరోపించింది.
''ప్రజల శాంతి భద్రతలకు, చట్ట నిబంధనలకు, బతికి ఉన్న వారి, చనిపోయిన వారి గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి చర్య అయినా మేం ఖండిస్తాం'' అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బీబీసీకి తెలిపింది.

'ఎవర్నీ వదలదు'
ఆక్రమిత భూభాగాల్లో జరిగిన ఈ ఘటన చాలా భయంకరమైనది, పాలస్తీనియన్లను అవమానించేలా ఉందని పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం దీన్ని ఖండించింది.
''బతికున్నా, చనిపోయినా ఎవర్నీ ఇది వదలదు'' అని మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం స్థానిక అధినేత అజిత్ సంఘై చెప్పారు.
సా-నూర్ పునరుద్ధరించిన తర్వాత.. ఈ కమ్యూనిటీలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఈ ఘటన ఒక సూచికని స్థానికులు చెప్పారు.
''ఇది చాలా దారుణం. ప్రస్తుతం వారు తిరిగి వచ్చిన తర్వాత మొత్తం ప్రాంతం తమ సొంతమేనని అనుకుంటున్నారు'' అని హుస్సేన్ అససా సంతాప కార్యక్రమంలో పాల్గొన్న ఒక అతిథి అన్నారు.
''ఇటీవలే, మా బంధువుల్లో ఒకరి భూమిని ఆర్మీ, సెటిలర్లు ఆక్రమించుకుని, అన్ని ఆలివ్ చెట్లను నరికేశారు'' అని ఒకరు చెప్పారు.
ఐడీఎఫ్ సైనిక స్థావరానికి ఆనుకుని ఉన్న సా-నూర్‌కు తమ మొబైల్ హోమ్‌లను తెచ్చుకునేందుకు, సెటిల్మెంట్ పునరుద్ధరణకు సెటిలర్లకు అనుమతించిన తర్వాత.. ఈ ప్రాంతం చాలా వరకు ''క్లోజ్డ్ మిలటరీ ఏరియా''గా మారింది..
దీని అర్ధం ఏంటంటే.. ఆలివ్ తోటలు, పంట పొలాలు, శ్మశానవాటికలు కూడా ఇప్పుడు ఆ గ్రామంలోని ప్రజల చేతిలో లేవు.
ఐడీఎఫ్ సాయంతో ఒకవేళ ఆ ప్రాంతంలోకి వెళ్లగలిగినా సెటిలర్లు చాలా దూకుడు, బెదిరింపు ధోరణితో ఉంటున్నారని, చాలామంది బహిరంగంగానే గన్లు పట్టుకుని తిరుగుతున్నారని గ్రామస్థులు చెప్పారు.

వెస్ట్‌బ్యాంక్ వ్యాప్తంగా సెటిలర్లకు సంబంధించిన హింసాత్మక ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సెటిలర్ల దాడుల్లో 13 మంది పాలస్తీనియన్లు చనిపోగా, వందలమంది గాయపడ్డారని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. చాలామంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారని పేర్కొంది.
నెతన్యాహు ప్రభుత్వంలోని అతివాదులైన మంత్రుల మద్దతుతో సాధికారత సాధించి, తమ ఆయుధాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సెటిలర్లు, ఆక్రమిత భూభాగాల్లోని పాలస్తీనియన్ల భద్రతకు, జీవనోపాధికి పెరుగుతున్న ముప్పుగా పరిణమిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
చివరకు హుస్సేన్ అససాకు సమీప గ్రామంలోని చిన్న శ్మశాన వాటికలో ఆయన కొడుకులు అంత్యక్రియలు నిర్వహించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































