‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’

ఫొటో సోర్స్, Getty Images
గత దశాబ్ద కాలంలో ఆర్థిక, ఆర్థికేతర అంశాల్లో పేదరికాన్ని తగ్గించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా పేదరికాన్ని తగ్గిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆ నివేదిక పేర్కొంది.
'భారత్‌లో పేదరికం, సమానత్వం' పేరుతో ప్రపంచ బ్యాంక్ శుక్రవారం(అక్టోబర్ 30) ఈ నివేదిక విడుదల చేసింది.
దారిద్య్ర రేఖకు దిగువన అంటే రోజుకు 4.2డాలర్ల (సుమారు రూ. 399) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న జనాభా శాతం 2011 నుంచి 2023 మధ్య 57.7 శాతం నుంచి 16.1 శాతానికి తగ్గింది" అని నివేదికలో ప్రపంచబ్యాంక్ తెలిపింది.
"ఈ కాలంలో 49.6 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. అదే సమయంలో తీవ్ర పేదరికంలో అంటే రోజుకు 3 డాలర్ల ( సుమారు రూ. 285)కంటే తక్కువ ఆదాయంతో నివసిస్తున్న జనాభా 27.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది" అని వెల్లడించింది.

భారత్‌లో పేదరికం తగ్గడం కొనసాగుతుందని, అయితే ఈ తగ్గుదల వేగం కొంత నెమ్మదించవచ్చని అంచనావేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
రోజుకు రూ. 399 ఆదాయాన్నిదారిద్య్ర రేఖగా గుర్తిస్తే 2026లో 14.2 శాతంగా ఉన్నపేదరికం రేటు 2028 నాటికి 12.1 శాతానికి తగ్గవచ్చని అంచనావేసింది.
"ఆర్థికేతర ప్రమాణాల ఆధారంగా పేదరికాన్ని అంచనావేయడానికి ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్ఐ) రూపొందించిన మల్టిడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ఆధారంగా అంచనా వేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అది చాలా తీవ్రమైన సమస్య’
2005-06లో పేదరికం రేటు 53.8 శాతంగా ఉండగా అది 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది. 2022-23లో ఈ రేటు 15.5 శాతంగా ఉందని ప్రపంచ బ్యాంకు బహుముఖ పేదరిక సూచీ తెలిపింది.
భారత్‌లో పేదరికం తగ్గుతున్నప్పటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్న సమస్య మాత్రం అలాగే ఉంది.
"నిజానికి ప్రజలెంత ఖర్చుచేస్తున్నారనేదాని ఆధారంగా అసమానతలను లెక్కిస్తే అవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆదాయాలను పోల్చిచూస్తే అసమానత చాలా ఎక్కువగా ఉంటుంది'' అని ఇండియాటుడే నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థికవేత్త సంతోష్ మెహ్రోత్రా చెప్పారు.
"భారత్‌లో ప్రజల ఆదాయాలకు సంబంధించి అసలు సర్వేలే నిర్వహించడం లేదు. మన దేశంలో ఆర్థిక అసమానతలు చాలా తీవ్రమైన సమస్య. అది మరింత తీవ్రమైంది. మనం దీనిని నిర్లక్ష్యం చేయకూడదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పేదరికం ఎలా తగ్గిందంటే...’
ప్రపంచబ్యాంక్ నివేదికలోని అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. నివేదిక గణాంకాల్లోని సానుకూల అంశాలను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో ఆమె ప్రస్తావించారు.
"ప్రజల వినియోగం గణనీయంగా పెరగడం, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం, ఆహార సబ్సిడీతో పాటు సామాజిక సంక్షేమ పథకాల విస్తరణ వంటివి పేదరికం తగ్గడానికి ప్రధాన కారణాలని ప్రపంచ బ్యాంకు గుర్తించింది" అని నిర్మాలా సీతారామన్ అన్నారు.
''ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం అమలుచేస్తున్న విధానపరమైన ప్రయత్నాలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో అందరికీ అభివృద్ధి ఫలాలు అందించే సమ్మిళిత వృద్ధికి, ప్రజలకు మరిన్ని ఆర్థిక అవకాశాలు కల్పించడానికి బలమైన పునాది ఏర్పడుతోంది'' అని ఆమె విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ANI
వేతనాల్లో అసమానత
పేదరికం తగ్గినప్పటికీ కొన్ని వర్గాల కుటుంబాల్లో ఇప్పుడది ఎక్కువగా కనిపిస్తోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది.
విద్యాస్థాయి తక్కువగా ఉన్నవాళ్లు, ఆస్తులు తక్కువగా ఉన్నవాళ్లు, స్థిరమైన ఉపాధి పొందే అవకాశాలు పరిమితంగా ఉన్నవాళ్లు, కుటుంబపోషణ భారం ఎక్కువగా ఉన్నవాళ్ల కుటుంబాల్లో పేదరికం ఎక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.
కూలీల వేతనాల మధ్య అసమానతలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 2023లో అత్యధిక వేతనాలు పొందుతున్న పది శాతం కార్మికుల సగటు వేతనం, అతి తక్కువ వేతనాలు పొందుతున్న 10 శాతం కార్మికుల సగటు వేతనం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువగా ఉంది" అని నివేదిక పేర్కొంది.
"కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉందని కూడా నివేదిక పేర్కొంది.
చాలా రాష్ట్రాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ దేశంలోని మొత్తం పేద జనాభాలో సుమారు 57 శాతం జనాభా ఉత్తర ప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు వరుసగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తోంది" అని నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
యువతలో నిరుద్యోగ సమస్య
2017 నుంచి 2023 మధ్యకాలంలో ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నవాళ్ల సంఖ్య సుమారు 13.4 కోట్లు పెరిగిందని కూడా నివేదిక పేర్కొంది. పని చేసే వయసులో ఉన్న జనాభా పెరుగుదలతో పోలిస్తే ఉపాధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు రెట్టింపు పెరిగింది. ఈ ఉపాధి పెరుగుదలలో ఎక్కువ భాగం గ్రామీణప్రాంతాల్లో మహిళలు జీతం వచ్చే పనుల్లో చేరడం వల్లే సాధ్యమైంది. దీనివల్ల కుటుంబంలో సంపాదించే సభ్యుల సంఖ్య పెరిగింది.
అయితే యువతలో నిరుద్యోగం పెరిగిన విషయాన్ని కూడా ప్రపంచ బ్యాంక్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం మధ్య యువతలో నిరుద్యోగ రేటు 14.6 శాతం నుంచి 15.9 శాతానికి పెరిగింది. ఈ ప్రభావం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతులపై ఎక్కువగా పడిందని నివేదిక తెలిపింది.
అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నతర్వాత లెక్కించే వాస్తవ వేతనాల్లో పెద్దగా మార్పులేదని నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఉపాధి పెరిగినప్పటికీ ఎక్కువ ఉత్పాదకత లేని పనుల్లోనే ఈ పెరుగుదల ప్రధానంగా కనిపించిందని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























