అబ్రహం అకార్డ్స్: ట్రంప్ డిమాండ్‌తో పాకిస్తాన్ ఇరకాటంలో పడిందా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక, ప్రపంచ దౌత్య రంగంలో పాకిస్తాన్ ఒక కీలక దేశంగా అవతరించింది.
నిరుడు మేలో పాకిస్తాన్‌పై భారత్ జరిపిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత, పాక్ అమెరికాకు మరింత చేరువైంది. అదే సమయంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ట్రంప్ చెప్పిందానికల్లా తలాడిస్తూ సాన్నిహిత్యం పెంచుకుంటే, అందులో ఎన్నో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయంటుంటారు.
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, ట్రంప్ పలుమార్లు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్‌ను ప్రశంసించారు కూడా. కానీ, సోమవారం ట్రంప్ చేసిన ఒక డిమాండ్.. పాకిస్తాన్‌కు ఒక రెడ్ లైన్ కావచ్చు.
‘‘ సంక్లిష్టమైన ఇరాన్ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ సహా అరబ్ దేశాలన్నీ కలిసి అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి కావాలి’’ అన్నారు ట్రంప్.
''ఒకటి లేదా రెండు దేశాలు ఇలా చేయకపోవడానికి ఏదైనా కారణం ఉండవచ్చు. ఆ కారణాలను అంగీకరించవచ్చు, కానీ మెజారిటీ దేశాలు దీనికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఇరాన్‌తో జరిగే ఈ ఒప్పందం సాధారణ ఒప్పందంగా కాకుండా ఎంతో చారిత్రాత్మకమైనదిగా మారుతుంది'' అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో రాశారు.


ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ పెట్టిన ఇరకాటం
''ఇది సౌదీ అరేబియా, ఖతార్‌ల తక్షణ సంతకాలతో ప్రారంభం కావాలి, మిగిలిన దేశాలు కూడా వాటిని అనుసరించాలి. ఒకవేళ వారు అలా చేయకపోతే, అది వారి దురుద్దేశాలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి,అందుకే నేను అన్ని దేశాలు వెంటనే 'అబ్రహం అకార్డ్స్'పై సంతకం చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాను'' అని ట్రంప్ ఆ పోస్టులో రాశారు.
''ఒకవేళ ఇరాన్ మాతో ఈ ఒప్పందం కుదుర్చుకుంటే, దాన్ని కూడా ఈ అంతర్జాతీయ కూటమిలో భాగస్వామిని చేయడం మాకు గౌరవంగా ఉంటుంది. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ ఎంత ఐక్యంగా, శక్తిమంతంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందంటే.. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతం కూడా అంతటి అభివృద్ధిని చూసి ఉండదు'' అని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు.
వాస్తవానికి, ఈ దేశాలు ఇజ్రాయెల్‌ను గుర్తించవు. వీటికి ఇజ్రాయెల్‌తో ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు.
డోనల్డ్ ట్రంప్ తన మొదటి దఫా పదవీకాలంలో, 2020లో 'అబ్రహం అకార్డ్స్' ద్వారా యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, కజకిస్తాన్, సూడాన్ దేశాలతో ఇజ్రాయెల్‌కు గుర్తింపు లభించేలా చేశారు. ఇప్పుడు ట్రంప్ దీని పరిధిని మరింతగా విస్తరించాలని భావిస్తున్నారు.
కానీ, ట్రంప్‌ను అసంతృప్తికి గురిచేయకుండా ఉండటం కోసం పాకిస్తాన్ అబ్రహం అకార్డ్స్‌ను అంగీకరిస్తుందా?
థింక్ ట్యాంక్ 'అట్లాంటిక్ కౌన్సిల్' సీనియర్ ఫెలో మైఖేల్ కుగెల్‌మన్ 'ఎక్స్' పోస్టులో, ''పాకిస్తాన్ గురించి గతంలోనే చెప్పాను.. ట్రంప్‌తో ఎంత ఎక్కువగా కలిసి పనిచేస్తే, రిస్క్ అంతగా పెరుగుతుంది. మీరు చేయకూడదనుకునే పనులను కూడా ఆయన డిమాండ్ చేస్తారు. ఉదాహరణకు అబ్రహం అకార్డ్స్‌లో చేరడం లాంటివి. ఆయన మెప్పు పొందాలంటే ఇలాంటి అనివార్యమైన రిస్క్‌లను ఎదుర్కోవాల్సిందే'' అని రాశారు.
''పాకిస్తాన్‌కు ఈ డిమాండ్ ఇబ్బందికరమైనదే అయినప్పటికీ, దీనికి ఆ దేశం ఆశ్చర్యపోనక్కర్లేదు. భవిష్యత్తులో పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉందా? అదీ ఇంకా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడకముందే? అవును, మారవచ్చు. ఒకవేళ సౌదీ అరేబియా ఈ ఒప్పందంలో చేరితే, పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రజాగ్రహాన్ని, ప్రజాభిప్రాయాన్ని బట్టి చూస్తే.. ఏ పాకిస్తాన్ ప్రభుత్వమైనా ఈ ఒప్పందంలో చేరితే, అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది'' అని కుగెల్‌మన్ రాశారు.
''గతంలో పాకిస్తాన్‌కు చెందిన కొందరు పౌర, సైనిక అధికారులు ఇజ్రాయెల్‌తో అనధికారిక సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ, ఇస్లామాబాద్ ఎప్పుడూ ఇజ్రాయెల్‌కు గుర్తింపు ఇవ్వడాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుతోనే ముడిపెట్టింది. ఇది పాకిస్తాన్ తాలూకు అత్యంత కఠినమైన, స్థిరమైన విధానం. కాబట్టి ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఈ ఒప్పందంలో చేరడం దాదాపు అసాధ్యం’’ అని కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు పెరిగిన ప్రాధాన్యం...
ఇరాన్‌తో శాంతి చర్చలలో పాకిస్తాన్ పోషిస్తున్న కీలక పాత్ర, అణ్వాయుధాలు కలిగిన ఈ దక్షిణాసియా దేశానికి కొత్త దౌత్య ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది. అయితే, థింక్ ట్యాంక్ 'కౌన్సిల్ ఫారెన్ రిలేషన్స్'లో భారత్, పాకిస్తాన్, దక్షిణాసియా సీనియర్ ఫెలో సదానంద్ ధుమే అభిప్రాయం ప్రకారం.. పాకిస్తాన్ ఇజ్రాయెల్‌తో శత్రుత్వాన్ని కొనసాగిస్తూ ఎక్కువ కాలం అమెరికా నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు.
''పాకిస్తాన్‌కు సంబంధించి ఏ ఇతర అంశంలో కూడా దాని పట్టుదలను ఇజ్రాయెల్ పట్ల ఉన్న తీవ్ర శత్రుత్వమంత స్పష్టంగా చూపించదు. ముస్లిం ప్రపంచంలో ఇజ్రాయెల్‌తో విభేదించడం సాధారణ విషయమే కావచ్చు, కానీ పాకిస్తాన్‌లో అది కొన్నిసార్లు హింసాత్మక, అసాధారణ రూపాన్ని సంతరించుకుంటుంది'' అని అమెరికా వార్తాపత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్'లో ఏప్రిల్ 22న సదానంద్ ధుమే రాశారు.
''దాదాపు 80 ఏళ్లు గడుస్తున్నా పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను గుర్తించడం లేదు. ప్రతి పాకిస్తానీ పాస్‌పోర్ట్ పైనా, "ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇది చెల్లుతుంది" అని స్పష్టంగా రాసి ఉంటుంది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా 'పాన్-ఇస్లామిజం' వైపే మొగ్గు చూపింది'' అని సదానంద్ ధుమే పేర్కొన్నారు.
హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ స్కాలర్, అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ వ్యాఖ్యలను సదానంద్ ధుమే ప్రస్తావిస్తూ, ''మతం ప్రాతిపదికన భారతదేశ విభజన జరగాలనే డిమాండ్.. పాకిస్తాన్ వ్యవస్థాపక రాజకీయ వర్గాలను ప్రేరేపించింది. 'పవిత్రమైన భూమి' అనే అర్థం వచ్చే పాకిస్తాన్.. చాలా త్వరగానే ఇస్లామిస్టులకు, ముస్లిం ఆధిపత్యవాదులకు ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారింది'' అని ప్రస్తావించారు.
''ఈ శతాబ్దంలో రెండుసార్లు పాకిస్తానీ నాయకులు, విశ్లేషకులు ఇజ్రాయెల్‌ను గుర్తించాలనే అంశంపై చర్చించారు. మొదటిసారి సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ హయాంలో జరిగింది. ఆయన న్యూయార్క్‌లో యూదు సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడం వల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనాల గురించి మాట్లాడారు'' అని ఆయన గుర్తుచేశారు.
ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదనపై ప్రస్తుతం పాకిస్తాన్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన మలీహా లోధి పాక్ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక 'డాన్'తో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
''దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు. ఇరాన్‌తో కుదరబోయే ఒప్పందంపై రిపబ్లికన్ రైట్-వింగ్, ఇజ్రాయెల్ లాబీ నుంచి ఎదురవుతున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకే ట్రంప్ ఈ ప్రయత్నం చేస్తున్నారు'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోనూ చర్చ...
''పాకిస్తాన్, సౌదీ అరేబియా లేదా మరే ఇతర ముస్లిం దేశమైనా ఇజ్రాయెల్‌ను గుర్తించి, అబ్రహం అకార్డ్స్‌లో చేరే అవకాశమే లేదు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తోంది, వెస్ట్ బ్యాంక్‌ను దాదాపుగా ఆక్రమించుకుంది, గాజాలో 70 వేల మందికి పైగా పాలస్తీనియన్ల మరణానికి కారణమైంది" అని మలీహా లోధి అన్నారు.
''యూఏఈ, బహ్రెయిన్‌లు ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్న 2020 నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పటి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం'' అని ఆమె పేర్కొన్నారు.
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్తాన్, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల నాయకులతో శనివారం ట్రంప్ మాట్లాడారు. ఆయా దేశాల నాయకులను అబ్రహం అకార్డ్స్‌లో చేరాల్సిందిగా కోరారు.
''ఈ సంభాషణకు సంబంధించిన వివరాలు తెలిసిన ఒక అమెరికా అధికారి ప్రకారం.. ట్రంప్ ఆయా నాయకులతో మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేయబోతున్నానని, సమీప భవిష్యత్తులో ఇజ్రాయెల్ నాయకుడు కూడా ఈ కాల్‌లో భాగస్వామి అవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు'' అని అమెరికా న్యూస్ వెబ్‌సైట్ 'ఆక్సియోస్' రాసింది.
ఆక్సియోస్ కథనం ప్రకారం, ''ఇరాన్ యుద్ధం తర్వాత, ఇప్పటివరకు అబ్రహం అకార్డ్స్‌లో భాగం కాని దేశాలు లేదా ఇజ్రాయెల్‌తో సంబంధాలు లేని దేశాలన్నీ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ ఆయా దేశాల నాయకులకు స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ డిమాండ్‌తో ఫోన్ కాల్‌లో ఉన్న నాయకులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక అమెరికా అధికారి మాట్లాడుతూ, 'ఫోన్ లైన్‌లో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత ట్రంప్ సరదాగా 'మీరంతా ఇంకా లైన్లోనే ఉన్నారా?' అని అడిగారు. ఆ తర్వాత, రాబోయే వారాల్లో తన ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌లు ఈ అంశంపై తదుపరి చర్చలు జరుపుతారని ట్రంప్ ఆ నాయకులకు తెలిపారు'' అని ఆక్సియోస్ పేర్కొంది.
ట్రంప్ చేసిన ఈ డిమాండ్‌ను రిపబ్లికన్ ఎంపీ లిండ్సే గ్రాహం సమర్థించారు.
గ్రాహం 'ఎక్స్' వేదికగా ఇలా రాశారు...
''ఇరాన్ ఘర్షణల పరిష్కారంలో భాగంగా 'అబ్రహం అకార్డ్స్' విస్తరణను కూడా చేర్చాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఇది అత్యంత వ్యూహాత్మకమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయం. ఇది గనుక విజయవంతమైతే, గత వేలాది సంవత్సరాలలో మిడిల్ ఈస్ట్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచిపోతుంది.
ఒకవేళ సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలను ఏర్పరచుకుంటే.. భవిష్యత్తులో ఇది ప్రాంతీయ సమైక్యతకు మార్గం సుగమం చేస్తుంది. దీనివల్ల మిడిల్ ఈస్ట్ నిరంతర ఘర్షణలు, అస్థిరతలతో 'మందుగుండు గిడ్డంగి'గా మిగిలిపోకుండా.. ఆర్థిక అవకాశాలకు, అభివృద్ధికి ఒక అంతర్జాతీయ శక్తి కేంద్రంగా ఎదుగుతుంది. మన అరబ్ మిత్రదేశాలు, ఇజ్రాయెల్‌లోని మన స్నేహితులు ఈ చొరవను స్వీకరిస్తారని, దీన్ని విజయవంతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే, ఇక్కడ వైఫల్యానికి ఆస్కారం లేదు.'' అని గ్రాహం రాశారు.
ట్రంప్ తాజా ప్రతిపాదనపై సౌదీ అరేబియా వైఖరి ఎలా ఉండబోతోందనే అంశమూ చర్చనీయాంశమైంది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు మైక్ ఇవాన్స్ సోమవారం ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా 'ది జెరూసలేం పోస్ట్'తో మాట్లాడుతూ, "నేను సౌదీ అరేబియా యువరాజుతో మాట్లాడినప్పుడు, తాను ఈ రోజే ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ తన తండ్రి అందుకు అంగీకరించడం లేదని చెప్పార"ని అన్నారు.
''యువరాజుతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యాను. అందులో ఆయన సోదరుడు, సౌదీ విదేశాంగ మంత్రి కూడా పాల్గొన్నారు. యువరాజు సోదరుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు'' అని ఇజ్రాయెల్ మద్దతుదారుడైన ఇవాన్స్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























