‘నలుగురిపై దాడిచేసిన ఎలుగుబంటి ఫ్యాక్టరీలో దూరింది.. పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కిటికీ తెరిచి పారిపోయింది’

ఎలుగుబంటి, జపాన్, పోలీసులు, ఫ్యాక్టరీ
    • రచయిత, జోయల్ గ్వింటో
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

జపాన్‌లోని ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో దాక్కున్న ఒక ఎలుగుబంటి రాత్రి సమయంలో తనంతట తానే కిటికీ తెరిచి బయటకు పారిపోయిందని అధికారులు తెలిపారు.

ఫ్యాక్టరీలో దూరడానికి ముందు ఆ ఎలుగుబంటి నలుగురిపై దాడి చేసింది.

స్థానిక అధికారులు చెబుతున్న ప్రకారం.. ఆ ఎలుగుబంటి కిటికీ గడియను తీసిన ఆనవాళ్లు కనిపించాయి.

బుధవారం అది తప్పించుకోవడానికి ముందు, తన ముందరి కాళ్లతో ట్యాప్‌ను తిప్పి నీళ్లు తాగినట్లు చూశారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఇది చాలా తెలివైన ఎలుగుబంటి’ అని ఫుకుషిమా మేయర్ యూకీ బాబా ‘క్యోడో న్యూస్ ఏజెన్సీ’కి తెలిపారు.

ఆ ఎలుగుబంటి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఫుకుషిమాలోని ఒక ఉక్కు ఫ్యాక్టరీలోకి ప్రవేశించి నలుగురిపై దాడి చేసింది. అనంతరం సమీపంలోని ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలోకి వెళ్లింది. అక్కడ దాన్ని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నించారు.

అయితే దానిపై మత్తుమందున్న బాణం వేసి అదుపులోకి తేవాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆహారంతో ఉంచిన ఉచ్చులు కూడా పనిచేయలేదు.

ఎలుగుబంటి పండ్లు, తేనె వంటి ఎరలను ఉచ్చులో చిక్కుకోకుండా తినగలిగిందని జపాన్ మీడియా తెలిపింది.

బుధవారం రాత్రి ఎలుగుబంటిని ఉచ్చుల వైపు రప్పించేందుకు అధికారులు లైట్లు ఆర్పివేసినట్లు తెలిపారు.

చీకట్లో అది కిటికీ గడియను తిప్పి బయటకు పారిపోయినట్లు భావిస్తున్నారు.

దానిపై కాల్పులు జరిపేందుకు అధికారులు అనుమతి ఇచ్చినా, ఫ్యాక్టరీలో నిప్పంటుకునే పదార్థాలు ఉండటంతో పోలీసులు కాల్పులు జరపలేదు.

2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జపాన్‌లో ఎలుగుబంట్ల దాడుల్లో రికార్డు స్థాయిలో 13 మంది మరణించారు.

ఈ ఎలుగుబంటి తప్పించుకోవడంతో ఫుకుషిమా అధికారులు గురువారం నుంచి డ్రోన్‌లతో గాలిస్తున్నారు. పాఠశాలలు కూడా గురువారం ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాయి.

‘మేం సరిగ్గా స్పందించడంలో నిర్లక్ష్యం చేశామని కాదు, కానీ అది తప్పించుకోవడం కాస్త బాధగానే ఉంది’ అని మేయర్ బాబా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)