చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
రాధిక కుమారి తాను గతంలో చదువుకున్న ప్రాథమిక పాఠశాల ముందు నిలబడి, గోడపై రాసి ఉన్న ప్రభుత్వ సందేశాన్ని చదివేందుకు ప్రయత్నిస్తోంది. ఆ గోడపై 'అపరిశుభ్రత ప్రాణాంతకం, పరిశుభ్రతే సేవ' అని రాసి ఉంది.
అయితే, 16 ఏళ్ల రాధిక చాలా కష్టపడి కేవలం మొదటి పదాన్ని మాత్రమే చదవగలిగింది. మిగతా వాక్యాన్ని చదవడానికి బదులుగా చుట్టుపక్కల పడి ఉన్న చెత్తను చూపించింది.
ఐదేళ్ల కిందట మేం రాధికను కలిశాం. కోవిడ్ సమయంలో విద్యా ప్రమాణాల్లో వెనుకబడిన, దేశంలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాకు మేం వెళ్లాం. అక్కడి డుంబీ అనే చిన్న గ్రామంలో రాధిక నివసిస్తోంది.
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆమెను కలిసినప్పుడు, పై తరగతులకు చేరుకున్నప్పటికీ చదువులో మాత్రం వెనుకబడిపోయినట్లు అనిపించింది.
కోవిడ్ సమయంలో పాఠశాలల మూసివేత, వెనుకబడిన ప్రాంతాల్లో పరిమిత వనరులతో జీవిస్తున్న బాలికల చదువుపై ఎలాంటి ప్రభావం చూపిందో రాధిక ద్వారా తెలుసుకోవాలనుకున్నాం.
2024లో పాఠశాల విద్యపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సగటున పిల్లల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడినట్లు తేలింది. అయితే, పిల్లలందరి పరిస్థితి ఒకేలా లేదు.
కోవిడ్ సమయంలో పాఠశాలల మూసివేత పిల్లలపై చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఝార్ఖండ్‌లోని అనేక గ్రామాల్లో పర్యటించిన ఆర్థికవేత్త జాన్ డ్రేజ్ మాట్లాడుతూ, ''సగటు గణాంకాల వెనుక భారీ అసమానతలు దాగి ఉన్నాయి'' అని చెప్పారు.

2021లో మేం రాధికను కలిసినప్పుడు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా ఆమె పాఠశాలతో పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడి ఉన్నాయి. అవన్నీ ఏడాది తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. కానీ, రాధిక చదువుతున్న పాఠశాల మాత్రం రెండేళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది.
ఆ సమయంలో ప్రైవేటు పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల ద్వారా చదువులు కొనసాగాయి. కానీ, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నిలిచిపోయింది.
అప్పటికి రాధిక గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఆమె కుటుంబానికి స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. చదువు పూర్తిగా నిలిచిపోవడంతో రాధిక చదవడం, రాయడం వంటి సామర్థ్యాలను కోల్పోయింది. చివరకు అక్షరాలను గుర్తించడం కూడా మర్చిపోయింది.
దళిత, ఆదివాసీ గ్రామంలో పెరిగిన రాధిక కోవిడ్ సమయంలో చదువులో వెనుకబడిపోయింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఎదురైన అనేక సవాళ్ల కారణంగా చదువులో తిరిగి పుంజుకోవడం ఆమెకు కష్టంగా మారింది.

కోవిడ్ సమయంలో పాఠశాలలను సుదీర్ఘకాలం మూసివేయడం పిల్లల చదువుపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు అనేక సర్వేలు జరిగాయి.
దేశంలో విద్యారంగంలో పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన 'ప్రథమ్' 2022లో విడుదల చేసిన వార్షిక విద్యా రిపోర్ట్ 'అసర్' ప్రకారం, ''ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లల పఠన సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింది.'' దీన్ని విద్యారంగానికి పెద్ద ఎదురుదెబ్బగా రిపోర్ట్ అభివర్ణించింది.
ఆ రిపోర్ట్ ప్రకారం.. ''2014లో ఐదో తరగతి చదువుతున్న పిల్లల్లో 48 శాతం మంది రెండో తరగతి స్థాయి పాఠ్యాంశాలను చదవగలిగేవారు. 2018 నాటికి ఈ సంఖ్య 50.4 శాతానికి పెరిగింది. కానీ, 2022లో 42.8 శాతానికి పడిపోయింది. జాతీయ స్థాయిలో దాదాపు ఏడు శాతం పాయింట్ల తగ్గుదల చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ గణాంకాల్లో సాధారణంగా చాలా నెమ్మదిగా మార్పులు వస్తుంటాయి. కోవిడ్ సమయంలో పిల్లల చదువుకు తీవ్ర నష్టం జరిగిందన్న ఆందోళనలను కూడా ఈ గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి''.

అయినప్పటికీ పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తర్వాత రాధికను పై తరగతికి ప్రమోట్ చేశారు.
భారత విద్యాహక్కు చట్టం ప్రకారం, పిల్లలపై చదువు భారం ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఐదు, ఎనిమిదో తరగతుల్లోని వారిని తప్పనిసరిగా ఉత్తీర్ణులను చేయాలనే నిబంధన ఉండేది. అయితే, ఈ నిబంధన చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో 2024లో ఈ నిబంధనను తొలగించారు.
కానీ, అప్పటికే రాధిక తొమ్మిదో తరగతికి చేరుకుంది.
ఝార్ఖండ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా రాధికలాంటి పిల్లలకు పెద్ద సవాలుగా మారిందని ఆర్థికవేత్త జాన్ డ్రేజ్ చెప్పారు.
''కోవిడ్ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడటంతో, అంతంతమాత్రమే సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడి ద్వారా కొద్దిపాటి విద్యను పొందిన పిల్లలు, అప్పటివరకు నేర్చుకున్నది కూడా మర్చిపోయారు'' అని జాన్ డ్రేజ్ అన్నారు.

భారత్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటి నుంచో మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. అక్కడి విద్యాప్రమాణాలు తక్కువగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి.
అయితే, విద్యాప్రమాణాల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఝార్ఖండ్ ఒకటి కావడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యకు సంబంధించిన డేటాబేస్ 'యూడైస్ ప్లస్' ప్రకారం, ఝార్ఖండ్‌లోని 40 శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఒక్క ఉపాధ్యాయుడితో నడిచే పాఠశాలల సంఖ్య 2025–26 నాటికి లక్షకు తగ్గింది. కానీ, ఝార్ఖండ్‌లో మాత్రం అలాంటి పాఠశాలల సంఖ్య పెరుగుతోంది.

2021లో మేం రాధికను కలిసినప్పుడు ఆమె హిందీ వర్ణమాలలోని అనేక అక్షరాలను సరిగ్గా గుర్తించలేకపోయింది. వాటిని రాయడం కూడా ఆమెకు సాధ్యం కాలేదు.
ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె పదో తరగతి సర్టిఫికెట్‌ను మాకు చూపించింది. అయితే, ఇప్పటికీ రాధికకు హిందీ, ఇంగ్లిష్ చదవడం, సాధారణ గణిత సమస్యలను పరిష్కరించడం కష్టంగానే ఉంది. తాను ఏయే సబ్జెక్టులు చదువుతోందో గుర్తుచేసుకోవడంలోనూ ఇబ్బంది పడుతోంది రాధిక.
రాధిక మనికా బ్లాక్‌లోని 75 గ్రామాలకు అందుబాటులో ఉన్న ఏకైక హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుతోంది. ఆ పాఠశాలలో 2,000 మంది విద్యార్థులకు 20 మంది ఉపాధ్యాయులున్నారు. అంటే ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.
దేశవ్యాప్తంగా హయ్యర్ సెకండరీ స్థాయిలో సగటున ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ సగటుతో పోలిస్తే రాధిక పాఠశాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
తరగతుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల చదువులో వెనుకబడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఉపాధ్యాయులకు కష్టమవుతోందని పాఠశాల ప్రిన్సిపల్ మృగేంద్ర నారాయణ్ సింగ్ అంగీకరించారు.

''చదువులో వెనుకబడుతున్న విద్యార్థులను గుర్తించేందుకు మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. అవసరమైనప్పుడు వారికి సహాయం అందించేందుకు తరగతి గదిలో ముందు వరుసల్లో కూర్చోబెడుతున్నాం'' అని నారాయణ్ సింగ్ చెప్పారు.
అయితే, రాధికకు ఈ ప్రయత్నాలు సరిపోలేదు.
తన పాఠశాలలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నావని మేం అడిగినప్పుడు, ''నాకు ఇంకా ఎక్కువ మంది టీచర్లు కావాలి'' అని ఆమె చెప్పారు.
తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఝార్ఖండ్‌లో లక్ష ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 2016 నుంచి కొత్త ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదు.
2025లో ఉపాధ్యాయుల కొరతపై జాన్ డ్రేజ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో 26 వేల మంది ఉపాధ్యాయులను నియమించాలని ఝార్ఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించిన న్యాయ వివాదం కారణంగానే నియామకాలు సుదీర్ఘకాలంగా నిలిచిపోయాయని ఝార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. నియామకాలను ''నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సకాలంలో'' చేపడతామని హామీ ఇచ్చింది.
పరిమిత వనరులతో జీవిస్తున్న, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం.

రాధిక తమ్ముడు విష్ణు ట్యూషన్‌కు వెళ్తున్నాడు. చదవడం, రాయడం, విషయాలను అర్థం చేసుకోవడంలో అతడు రాధిక కంటే ఎంతో ముందున్నాడు.
గ్రామంలోని చాలామంది పిల్లల్లాగే విష్ణు, అతడి ఐదుగురు అక్కాచెల్లెళ్లు తమ కుటుంబంలో పాఠశాలకు వెళ్తున్న తొలి తరం పిల్లలు. వారి తల్లిదండ్రులు చదువుకోలేదు. అందువల్ల పాఠశాల తర్వాత చదువులో సహాయం పొందాలంటే ట్యూషన్ ఒక్కటే మార్గం.
అయితే, అనేక భారతీయ కుటుంబాల్లో కనిపించే పరిస్థితిలాగే, ఆర్థిక వనరుల కొరత కారణంగా మగపిల్లల చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అందుకే ఆ కుటుంబంలో విష్ణుకు మాత్రమే ట్యూషన్ సౌకర్యం అందుతోంది.
కోవిడ్ లాక్డౌన్ సమయంలో మేం విష్ణును కలిసినప్పుడు కూడా అతడు ట్యూషన్‌కు వెళ్తున్నాడు. దీంతో పాఠశాలలు మూతపడటంతో చదువుపై పడిన ప్రభావం అతడిపై తక్కువగానే ఉంది.

అసర్ 2022 రిపోర్ట్ ప్రకారం, దేశవ్యాప్తంగా ట్యూషన్‌కు వెళ్లే పిల్లల సగటు శాతం 2018లో 25 శాతంగా ఉండగా, 2022 నాటికి 30 శాతానికి పెరిగింది. ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇది 45 శాతానికి చేరుకుంది.
ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా ఉన్న సింగ్, అప్పట్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ, ''ఎంత ప్రయత్నించినా మేం కేవలం 10 శాతం మంది పిల్లలను మాత్రమే చేరుకోగలిగాం. దీంతో చదువులో వెనుకబడిన కొందరు పిల్లలపై తీవ్ర ప్రభావం పడింది'' అని చెప్పారు.
''కరోనాకు సంబంధించిన విధుల్లోనూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను నియమించారు. బయట ప్రాంతాల నుంచి వస్తున్నవారి వివరాలను సేకరించేందుకు నేను కూడా మూడు నెలలపాటు ఒక చెట్టు కింద కూర్చుని పనిచేశాను'' అని సింగ్ వివరించారు.
అసర్ 2024 రిపోర్ట్ ప్రకారం, కాలక్రమేణా పిల్లల అభ్యసన సామర్థ్యాలు మళ్లీ మెరుగుపడ్డాయి. దీనికి 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం కూడా ఒక కారణం.
కేంద్ర విద్యాశాఖ రూపొందించిన ఈ విధానం ప్రకారం, ''2025 నాటికి ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలందరికీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ – ఎఫ్ఎల్ఎన్) అందించడం మా అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యం''.
2024 డిసెంబర్లో కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా మూడు, ఆరు, తొమ్మిదో తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా అంచనా వేసింది. ఈ సర్వేలో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి.
ప్రాథమిక అభ్యసన సామర్థ్యాల్లో ఝార్ఖండ్ చివరి స్థానంలో నిలిచింది. పై తరగతుల్లోనూ అత్యంత వెనుకబడిన రాష్ట్రాల జాబితాలోనే ఉంది.
''ప్రాథమిక తరగతుల్లో మంచి ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు తర్వాతి తరగతుల్లోనూ ఆ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రారంభ దశలోనే వెనుకబడిన రాష్ట్రాల్లో విద్యార్థులు పై తరగతులకు వెళ్లిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అని రిపోర్ట్ పేర్కొంది.

ఇప్పుడు రాధిక ముందు మరిన్ని సవాళ్లు ఉన్నాయి. ఆమె గ్రామం నుంచి హయ్యర్ సెకండరీ పాఠశాలకు నడిచి వెళ్లాలంటే గంట సమయం పడుతుంది. తోడుగా స్నేహితురాళ్లు ఎవరూ లేకపోతే ఆ దారిలో ఒంటరిగా వెళ్లదు. అంటే ఆ రోజు పాఠశాలకు వెళ్లడం మానేస్తుంది.
పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే టెంపోకు ఛార్జీలు చెల్లించేందుకు రాధిక తల్లి కుంతీ దేవి ఇష్టపడటం లేదు.
''ఇలాంటి వాటికి ఖర్చు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. రాధికకు నిజంగా పాఠశాలకు వెళ్లాలని ఉంటే నడిచి వెళ్లొచ్చు'' అని ఆమె చెప్పారు.
ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఝార్ఖండ్‌లో హయ్యర్ సెకండరీ తరగతుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. రాష్ట్రంలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 2014–15లో 37.5 శాతంగా ఉండగా, 2025–26 నాటికి దాదాపు 20 శాతం పాయింట్లు పెరిగి 55 శాతానికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా కూడా విద్యార్థుల ప్రవేశాల్లో ఇలాంటి ధోరణే కనిపిస్తోంది. అయితే, పిల్లలు పాఠశాలకు వెళ్లడం ఒక్కటే సరిపోదు.
''సరైన విద్య అందకపోవడం వల్ల ఈ పిల్లలు పెద్దగా ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. పెద్దయ్యాక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. వారిలో నైపుణ్యాలు ఉన్నప్పటికీ, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు సంపాదించేందుకు అవసరమైన నైపుణ్యాలు కావు'' అని జాన్ డ్రేజ్ చెప్పారు.
జీవితంలో ఏం కావాలనుకుంటున్నావని రాధికను అడిగినప్పుడు, ఆమె చిరునవ్వు నవ్వుతూ తల దించుకుంది.
''నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి నా కుటుంబానికి సహాయం చేయాలనుకుంటున్నాను'' అని చెప్పింది.
అయితే, అది ఎలా సాధించాలో తనకు ఇంకా తెలియదని కూడా రాధిక చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































