వరల్డ్ మ్యాప్‌లో మార్పు రానుందా? అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా ఖండం పరిమాణాన్ని మరింత కచ్చితంగా చూపించేలా ప్రస్తుత ప్రపంచ పటాన్ని మార్చేందుకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఓటింగ్ నిర్వహించింది.
ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏకైక దేశం అమెరికా. ఫ్రాన్స్, యూకే సహా 164 దేశాలు దీనికి మద్దతు తెలపగా, ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఈ ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి పనిని, లక్ష్యాలను అపహాస్యం చేసేలా ఉందని ఓటింగ్‌ను వ్యతిరేకించిన అమెరికా ప్రతినిధి అన్నారు.
ఈ ప్రతిపాదనకు టోగో మద్దతిచ్చింది. ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు కూడా దీనికి మద్దతుతెలిపాయి.
ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఈ ఓటింగ్ తప్పనిసరిగా అమలుచేయాల్సింది కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఉపయోగించే ప్రపంచ పటాల్లో మార్పులు జరిగే అవకాశముంది.


గ్రీన్లాండ్, ఆఫ్రికా దాదాపు సమాన పరిమాణంలో ఎందుకు కనిపిస్తాయి?
16వ శతాబ్దం నుంచి ఉపయోగిస్తున్న ప్రపంచ మ్యాప్‌పై విమర్శలున్నాయి. ఈ మ్యాప్‌లో ఆఫ్రికాఖండం గ్రీన్‌లాండ్‌తో దాదాపు సమాన పరిమాణంలో కనిపిస్తుంటుంది. కానీ వాస్తవానికి గ్రీన్లాండ్ కంటే ఆఫ్రికా 14 రెట్లు పెద్దది.
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను, సామర్థ్యాన్ని, అవకాశాలను ఈ మ్యాప్ తక్కువగా అంచనా వేస్తుందన్న విమర్శలున్నాయి. మర్కేటర్ మ్యాప్‌ను 1569లో ఫ్లెమిష్ మ్యాప్ నిపుణులు గెరార్డస్ మర్కేటర్ రూపొందించారు. యూరప్ యాత్రికులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడానికి సాయం కోసం దీనిని తయారు చేశారు.
గెరార్డస్ మర్కేటర్ రూపొందించిన మ్యాప్‌లో కొన్ని తప్పులున్నాయి. గుండ్రంగా ఉండే భూమి ఉపరితలాన్ని టూ డైమెన్షియల్ చార్ట్‌పై కచ్చితంగా చూపించడం సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా ఎంత పెద్దదంటే...
ప్రపంచ పటాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని విషయాల్లో రాజీపడకతప్పదు.
మర్కేటర్ మ్యాప్ భూమి వక్రతను చూపిస్తుంది. దీని వల్ల భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న దేశాలు వాటి వాస్తవ పరిమాణం కంటే చిన్నవిగా కనిపిస్తాయి. అయితే ధ్రువాలకు దగ్గరగా ఉన్న దేశాలు మాత్రం అసలైన పరిమాణం కంటే పెద్దవిగా కనిపిస్తాయి.
ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మ్యాప్ నిపుణుల బృందం 2018లో ఒక కొత్త మ్యాప్‌ను రూపొందించింది. ఇందులో భూభాగాల పరిమాణాలను వీలైనంతవరకు కచ్చితంగా చూపించారు. దానికి ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అని పేరు పెట్టారు.

ఆఫ్రికన్ యూనియన్‌లోని 54 సభ్య దేశాలు ఫిబ్రవరిలో దీనిని ఆమోదించాయి. ఇది అన్ని ఖండాల పరిమాణాలను, ముఖ్యంగా ఆఫ్రికా పరిమాణాన్ని మరింత కచ్చితంగా ప్రతిబింబిస్తుందని ఆ దేశాలు చెప్పాయి.
"ఆఫ్రికా ఖండంలో భారత్, చైనా, అమెరికా, జపాన్, మెక్సికోతోపాటు యూరప్‌లోని చాలా ప్రాంతాలను కూడా ఉంచొచ్చు. అయినా ఇంకా కొంత భూభాగం మిగిలేంత పెద్దది ఆఫ్రికా'' అని #కరెక్ట్ ద మ్యాప్ అనే ఆన్లైన్ ప్రచార సంస్థ తెలిపింది.
"న్యాయమైన మ్యాప్‌తోనే న్యాయమైన ప్రపంచం మొదలవుతుంది" అని శుక్రవారం నాటి ఓటింగ్‌కు ముందు టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ డ్యూసీ రాయిటర్స్‌తో అన్నారు.
అంతకుముందు ఆయన ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడారు.
"మ్యాప్ ఎప్పుడూ తటస్థంగా ఉండదు. అది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలో ప్రజలు, ఖండాల స్థానాన్ని మనం అర్థం చేసుకునే విధానంపై అది ప్రభావం చూపుతుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘తప్పును సరిచేయాల్సిందే’
రాబర్ట్ డ్యూసీ వ్యాఖ్యలకు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ మద్దతు తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ మర్కేటర్ మ్యాప్‌ను ఉపయోగించడం ఆపేస్తుందని ఆయన చెప్పారు.
"మ్యాప్‌ను మార్చడం వల్ల ప్రపంచం మారదు. కానీ తప్పులతో ఉన్న పటాన్ని సరిచేయడం మాత్రం జరగాలి" అని ఆయన అన్నారు.
ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి యారినా ఫెరెన్సెవిచ్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పని, లక్ష్యాలను అపహాస్యం చేసేలా ఉందని ఆమె అన్నారు.
"అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి లేదా సత్సంబంధాల వంటి నిజమైన సమస్యలపై దృష్టి పెట్టడానికి బదులుగా ఈ సంస్థ 16వ శతాబ్దపు మ్యాప్ ప్రాజెక్టులు, నష్టపరిహారాలు, జ్ఞానాత్మక న్యాయం వంటి అంశాలపై చర్చిస్తోంది'' అని విమర్శించారు.
ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల రవాణాను "మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన అత్యంత తీవ్రమైన నేరం"గా ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని మార్చిలో ఆమోదించినప్పుడు కూడా అమెరికా ఇలాంటి విమర్శలే చేసింది..

ఫొటో సోర్స్, Getty Images
‘మ్యాప్ వల్ల ఆఫ్రికాకు నష్టం జరిగిందా?’
"ప్రపంచ మ్యాప్‌లో ఆఫ్రికాను చిన్నదిగా చూపించడం కేవలం మ్యాప్ నిర్మాణ లోపం మాత్రమే కాదు. ఇది ఒక ప్రత్యేకమైన భావనను ప్రపంచంలోకి తీసుకెళ్లే విషయం'' అని మర్కేటర్ పటాన్ని తొలగించాలని ప్రచారం చేస్తున్న బృందాల్లో ఒకటైన 'ఆఫ్రికా నో ఫిల్టర్'కు చెందిన లెరోటో మోగోయెత్లే అనే ప్రచారకర్త బీబీసీతో చెప్పారు.
ఆఫ్రికాపై ప్రపంచం సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న తప్పుడు సమాచారం, దుష్ప్రచారాన్ని అరికట్టే ప్రయత్నాలలో ఇది ఒక భాగమని ఆమె అన్నారు.
''మర్కేటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండంలోని అపారమైన సహజ వనరులను, జనాభాను, పెట్టుబడి అవకాశాలను పరోక్షంగా తక్కువగా అంచనా వేయడానికి కారణమైంది. మ్యాప్‌లు ప్రయాణికులకు దారి చూపించే సాధనాలు మాత్రమే కాదు. ఒక ప్రాంతాన్ని రాజకీయంగా, ఆర్థికంగా ఎలా చూడాలో కూడా అవి ప్రభావితం చేస్తాయి'' అని బీబీసీతో కెన్యాకు చెందిన భూగోళశాస్త్రవేత్త కియోకో ముయెందో అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























