అమెరికా దాడిలో కాలిపోయిన ట్యాంకర్ నుంచి 24 మంది భారతీయులను రక్షించిన అధికారులు

ఫొటో సోర్స్, Forward Seamen's Union of India/x.com/FSUIINDIA
- రచయిత, అభిషేక్ డే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఒమన్ తీరానికి సమీపంలో అమెరికన్ బలగాల వైమానిక దాడికి గురై మంటల్లో కాలిపోతున్న ఒక చమురు ట్యాంకర్లో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు భారత అధికారులు తెలిపారు.
నౌకలో మంటలు చెలరేగాయని, అది మునిగిపోతుందని అత్యవసర సహాయం కోరుతూ ట్యాంకర్‌లోని సిబ్బంది సంకేతాలను పంపారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఉద్రిక్తతలు సముద్ర రవాణా మార్గాలను దెబ్బతీయడమే కాకుండా, ఒమన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను కూడా పెంచాయి.

భారత నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓపేశ్ కుమార్ శర్మ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఎమ్టీ మారివెక్స్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం సంభవించిందని, ఆ సమయంలో నౌకలో 24 మంది భారతీయ సీ మెన్ ఉన్నారని తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం వారంతా ఇప్పుడు క్షేమంగా ఉన్నారని, వారి భద్రత కోసం వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం కొనసాగుతోందని శర్మ చెప్పారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఒమన్ అధికారులు హెలికాప్టర్లతో సహాయ చర్యలు చేపట్టి సిబ్బందిని రక్షించి మసీరా ద్వీపానికి తరలించారని భారతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. మారివెక్స్ నౌకకు గతంలో ఇరాన్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధించింది.
ఆల్ ఇండియా సీఫేరర్స్ యూనియన్ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్‌లోని ఒక సభ్యుడు అత్యవసర సహాయం కోరుతూ సమాచారాన్ని పంపారు. రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు యూనియన్.. సిబ్బంది, అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించిందని పేర్కొంది.
మరో నావికుల సంఘం ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను కలిగించినట్లు తెలిపంది. సిబ్బంది భద్రత, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం, అలాగే నావికుల రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ రెండు సంఘాలు కూడా సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు ధ్రువీకరించాయి.
తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో "దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తూ జూన్ 8న ఒమన్ గల్ఫ్‌లో ఖాళీ చమురు ట్యాంకర్ ఒకటి ఇరాన్‌లోని ఒక నౌకాశ్రయానికి ప్రయాణించేందుకు చేసిన ప్రయత్నాలను అమెరికా బలగాలు విఫలం చేశాయి" అని పేర్కొంది.
"అమెరికా బలగాల ఆదేశాలను సిబ్బంది పాటించకపోవడంతో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ (CVN-72) యుద్ధనౌకపై నుంచి ప్రయాణించిన ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ యుద్ధవిమానం, నౌకలోని ఇంజినీరింగ్, స్టీరింగ్ విభాగాలపై కచ్చిత లక్ష్యంతో ఆయుధాన్ని ప్రయోగించింది" అని ఆ ప్రకటన తెలిపింది.
"మారివెక్స్ ఇక ఇరాన్ వైపు ప్రయాణించడం లేదు" అని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
మీడియా కథనాల ప్రకారం, ఘటన జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిగా ఖాళీగా ఉంది. అది హార్ముజ్ జలసంధికి దక్షిణంగా ప్రయాణిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























