లైవ్, జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు. ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులు ఉన్నారు.

సారాంశం

  • కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు.
  • న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.
  • రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
  • డీజిల్ దిగుమతి ఒప్పందం పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీ అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

  1. జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
    ఫొటో క్యాప్షన్, కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.

    సీజేపీ నిరసనను దృష్టిలో ఉంచుకుని దిల్లీ రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులను, హోటళ్లలో బస చేస్తున్నవారిని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనడానికి దిల్లీకి చేరుకుంటున్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

    జంతర్-మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు ముందే ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

    నిరసన పిలుపు నేపథ్యంలో దక్షిణ జిల్లాతో పాటు మొత్తం దిల్లీలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. అనధికార వ్యక్తులు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

    డీసీపీ అనంత్ మిట్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరసన సమయంలో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసం వివిధ సరిహద్దుల్లో దాదాపు 12 పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా అనేక చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు.

    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
  2. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    యూట్యూబర్ ధ్రువ్ రాఠీ
    ఫొటో క్యాప్షన్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ

    సీజేపీ నిరసన నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

    బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు, అలాగే గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన సన్నిహితుడు తెలిపారు. పీటీఐ వార్తా సంస్థ కూడా రాఠీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చింది.

    అంతకుముందు, ధ్రువ్ రాఠీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇండియా గేట్ ఎదురుగా తిరుగుతూ కనిపించారు.

    “నేను దిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రి 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులను రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు” అని ఆ వీడియోలో ధ్రువ్ రాఠీ అన్నారు.

    “మోదీజీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా నిరసనలో జనసంచారం ఉండదని ఒకవైపు మీ ఐటీ సెల్ చెబుతోంది. ఒకవేళ జనం రాకపోతే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడ్డారని భావిస్తున్నాను. నిజానికి ప్రజలందరూ మేల్కొన్నారు” అన్నారు.

    ఈ నిరసనలో పాల్గొనడానికి జంతర్ మంతర్ చేరుకుంటున్న పలువురు ఆందోళనకారులను కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  3. దిల్లీ: జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, కఠిన ఆంక్షలు

    జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సీజేపీ ర్యాలీ
    ఫొటో క్యాప్షన్, అనేక చిత్రాలలో బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు అలాగే పోలీసు వ్యాన్‌లు కూడా కనిపిస్తున్నాయి

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలను కఠినతరం చేశారు.

    పోలీసు బలగాలు, సెక్యూరిటీ ఫోర్సులు, పోలీసు వ్యాన్‌లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

    సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు అనుమతి లభించలేదు. అయినా తాము జంతర్-మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నాయకులు చెబుతున్నారు. చరిత్ర సృష్టిస్తామని పార్టీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా శుక్రవారం రాత్రి పేర్కొన్నారు.

    "ప్రియమైన కాక్రోచ్‌లు.. మనం ఇప్పటివరకు ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే గర్వంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం" అని అశుతోష్ రాంకా ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే, "ఒకటే గుర్తుంచుకోండి - చేతిలో రాజ్యాంగం, గుండెల్లో గాంధీ. ఏం జరిగినా మన చేయి ఎత్తరాదు. భారత్ మాతా కీ జై" అని రాశారు.

    ఆయనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సామాజిక రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
  4. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో 250కి పైగా రైళ్లు రద్దు

    రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)

    కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన నేపథ్యంలో, న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.

    పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్ రైళ్లను రైల్వేబోర్డు ఆదేశాల మేరకు రద్దు చేశారు.

    అంతేకాకుండా, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి.

    రైల్వే మాజీ అధికారులు, ప్రయాణికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ చర్యను తప్పుబట్టాయి.

    "ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఆందోళనకారుల ముందు తలవంచడమే" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇంజనీరింగ్) సుబోధ్ జైన్ పేర్కొన్నారు.

    దేశంలోని ఏదైనా ప్రాంతంలో నిరసనలు లేదా ఉద్యమాల కారణంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం తన అనుభవంలో లేదని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా పీటీఐతో అన్నారు.

    అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

    మరోవైపు, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది.

  5. రష్యాతో డీజిల్ దిగుమతికి అమెరికా ఒప్పందం

    డోనల్డ్ ట్రంప్, అమెరికా, రష్యా, డీజిల్
    ఫొటో క్యాప్షన్, అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని ట్రంప్ అన్నారు.

    ఇంధన ధరలను తగ్గించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ప్రకటించారు.

    అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నుల డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో మిలియన్ టన్నులు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

    శుక్రవారం నాటి ఈ నిర్ణయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా అభివర్ణించారు.

    ఈ ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ ఏప్రిల్ 7 వరకు ఎత్తివేసింది. అయితే, అమెరికా బ్యాంకుల్లో ఉన్న మిగతా రష్యన్ ఆస్తులపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.

    యుక్రెయిన్ దాడుల కారణంగా దెబ్బతిన్న రిఫైనరీల పనితీరును బట్టి, త్వరలోనే మరో 3 మిలియన్ టన్నుల రష్యన్ డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  6. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.