దిల్లీ: శుక్రవారం రాత్రి నుంచే 57 మెట్రో స్టేషన్లు బంద్, ఆందోళనల నేపథ్యంలో మెట్రో స్టేషన్ల మూసివేతకు అవకాశం

ఫొటో సోర్స్, Getty Images
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సహా వివిధ పక్షాలు ఈ నెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఆందోళనల నేపథ్యంలో, దిల్లీ నగరంలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేసే అవకాశం ఉన్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు పంపిన ఒక లేఖలో దిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఈ లేఖలో పేర్కొన్నదాని ప్రకారం దిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న అనేక మెట్రో స్టేషన్లతోపాటు చుట్టుపక్కల పలు స్టేషన్లు కూడా ఉన్నాయి.
‘‘ప్రతిపాదిత నిరసన కార్యక్రమాల కారణంగా అరాచక మూకల కదలికలు ఉండే అవకాశం ఉన్నందున, శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్లు మూసేసే అవకాశం ఉంది. అక్టోబర్ 10 నాటికి పరిస్థితులు చక్కబడే వరకు ఈ మూసివేత ఉండొచ్చు’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.







