లైవ్, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది: అభిజీత్ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్యర్యంలో జంతర్ మంతర్ దగ్గర నిరసనల్లో పాల్గొన్నవారందరికీ అభిజీత్ దీప్కే ధన్యవాదాలు చెప్పారు. ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఉద్యమంలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కాక్రోచ్ పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అన్నారు.

సారాంశం

  • జర్మనీ రాజధాని బెర్లిన్‌లో నిర్వహించిన ప్రైడ్ పరేడ్‌లో జనసమూహంపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో అనుమానితుణ్ని 21ఏళ్ల అబ్దుల్ బీగా బెర్లిన్‌ పోలీసులు గుర్తించారు. . అనుమానితుని ఫోటో విడుదల చేసిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆయన్ను గుర్తించి అరెస్టుచేయడంలో సాయపడాలని ప్రజలను కోరారు. శనివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం దాదాపు 10గంటల సమయంలో, బెర్లిన్‌లోని ప్రసిద్ధ బ్రాండెన్‌బర్గ్ గేట్ దగ్గర ఉన్న టియర్‌గార్డెన్ పార్కులో ఈ ఘటన జరిగింది.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రజా జీవితంలో బాధ్యతలు మారుతూ ఉంటాయని, కానీ దేశ ప్రయోజనాల కోసం చేసిన పని కాలక్రమంలో మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. "విద్య ఒక దేశ స్వభావాన్ని తీర్చిదిద్దుతుంది. చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. కేంద్ర విద్యా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ దృష్టితో పనిచేశారు'' అని యూపీ సీఎం అన్నారు.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ స్పందించారు. ఆలస్యమైనప్పటికీ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
  • డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించిందని నిరసనకారులంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కాక్రోచ్ జనతాపార్టీ కోరింది.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత చేసిన పోరాటం, వారి త్యాగాల విజయమే అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ

    రాహుల్ గాంధీ, అమిత్ షా, నిరసన

    ఫొటో సోర్స్, Arvind Yadav/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    దిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలగాలను ప్రయోగించిన ఘటనకు బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఓ లేఖ రాశారు.

    నిరసన చేస్తున్న ప్రజలను రక్షించడం, చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ అన్నారు.

    "మా విద్యార్థులు నిష్పక్షపాతమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారి మాట వినడానికి బదులుగా , భద్రతా దళాలు వారిపై బలప్రయోగం చేశాయి. ప్రాణాంతక ఆయుధాలు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళా విద్యార్థులపైనా దాడి చేశారు. వారి ప్రైవేట్ పార్టులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేశారు’’ అని ఆ లేఖలో రాహుల్ గాంధీ రాశారు.

    "ప్రాణాంతకమైన పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఒక జర్నలిస్టుతో సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. నేను 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్‌ను కలిశాను.పెల్లెట్ గన్‌తో కాల్చడంతో ఆయనిప్పుప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    లేఖలో రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలు అడిగారు.

    " విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో సహా ప్రాణాంతకమైన బలప్రయోగానికి హోం మంత్రిగా మీరు అనుమతిచ్చారా? ఒకవేళ మీరు కాకపోతే ఎవరు అనుమతిచ్చారు?

    సాధారణ దుస్తుల్లో విద్యార్థులను లాఠీలతో కొడుతున్నట్టు కనిపించిన వారు పోలీసులా లేక వాలంటీర్లా? వారిని మోహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు?"

    దేశ భవిష్యత్తు అయిన యువత, విద్యార్థులు ఈ ఘటనపై సమాధానాలు, జవాబుదారీతనం కోరుతున్నారని రాహుల్ గాంధీ లేఖలో రాశారు.

  2. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది: అభిజీత్ దీప్కే

    దిల్లీ, నిరసన

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కే

    కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ ఉదయం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

    "మీ అందరి మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జంతర్ మంతర్ దగ్గర చివరి వరకు ఉన్నవారికి నిన్న వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయాను. దీనిపై మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా" అని వీడియోలో అభిజీత్ దీప్కే చెప్పారు.

    "మీకు తెలిసినట్టే నాకు టైఫాయిడ్ వచ్చింది. నిన్న నాకు జ్వరం చాలా ఎక్కువ కావడంతో ఇంటికి వచ్చేశాను. 37 రోజుల పాటు జంతర్ మంతర్‌ దగ్గర పోరాటం కొనసాగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దేశం కోసం మీరు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను" అని చెప్పారు.

    ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా అభి.జీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.

    ‘‘ 'మీరు సీరియస్‌గా లేరు, ఎలా నిరసన చేయాలో మీకు తెలియదు' అని మమ్మల్ని విమర్శించిన వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మమ్మల్ని ప్రశ్నించకపోయి ఉంటే లోపాలను సరిదిద్దుకునే అవకాశం మాకు వచ్చేది కాదు" అని వీడియోలో మాట్లాడారు.

    ఇది ఆరంభం మాత్రమేనని,కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

  3. కార్గిల్ యుద్ధం: పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం ఎలా విరుచుకుపడింది? అమెరికాను నవాజ్ షరీఫ్ ఎందుకు శరణు కోరారు?

  4. జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే....

    దిల్లీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఖాళీగా కనిపిస్తున్న జంతర్ మంతర్ ప్రాంతం

    కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళన శనివారం రాత్రి ముగిసింది.

    నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఖాళీచేశారు. పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.

    అయితే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అక్కడ మోహరించిన పోలీసుల సంఖ్య బాగా తగ్గింది.

  5. సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..

  6. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?

  7. మనం మళ్లీ కలుస్తాం - ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి కొత్త విద్యాశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యలు

    నిరసనలు, రాజీనామా, దిల్లీ, జంతర్ మంతర్

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్ జోషి

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై ప్రధాని మోదీకి ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు చెప్పారు.

    ‘‘మోదీ ప్రభుత్వం గత పన్నెండేళ్లలో ఎన్నో చరిత్రత్మక విజయాలు సాధించింది. ప్రధాని మార్గదర్శకత్వంలో నా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రయత్నిస్తా’’అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

    ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అనేక దశాబ్దాలనుంచి సాగుతోంది. దేశాభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యావిధానాన్ని విజయవంతంగా అమలుచేశారు. విద్యారంగంలో వందకు పైగా చిన్నా,పెద్దా సంస్కరణలు ప్రవేశపెట్టారు. జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను అది మరుగునపడనివ్వదు. దేశ అభివృద్ధి మార్గంలో మనం మళ్లీ కలుస్తాం’’ అని ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

  8. బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం ముఖ్యం: అమిత్ షా

    ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, రాజీనామా

    ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, అమిత్ షా

    దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని శనివారం రాత్రి అమిత్ షా ‘ఎక్స్’లో రాశారు.

    బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం, యువత, విద్యార్థులే ముఖ్యమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికి నిదర్శనమని అమిత్ షా పోస్ట్ చేశారు.

    ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు బాధ్యులైనవారికి కఠిన శిక్ష పడేలా ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అమిత్ షా అన్నారు. ప్రధాని చర్యలు నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంపూర్ణ న్యాయం అందిస్తాయని తనకు నమ్మకముందని అమిత్ షా తెలిపారు.

    ‘‘తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, మాతృభాషలో పరీక్షలు నిర్వహించడం, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. పరీక్షా విధానాన్ని విద్యార్థి కేంద్రీకృతంగా, మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం’’ అని అమిత్ షా తన పోస్టులో రాశారు.

  9. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.