కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.
‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.
శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.



