‘ఈ శతాబ్దపు విడాకులు’: ఈ కేసులో ఆ బిజినెస్ దిగ్గజం తన మాజీ భార్యకు ఎన్ని వేల కోట్లు చెల్లించాలంటే...

విడాకులు

ఫొటో సోర్స్, Getty Images/Reuters

ఫొటో క్యాప్షన్, చోయ్ తే-వోన్, రో సో-యోంగ్‌
    • రచయిత, జేక్ కెవాన్, ఆస్మండ్ చియా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

దక్షిణ కొరియా కార్పొరేట్ దిగ్గజం ఎస్‌కే గ్రూప్ చైర్మన్ తన మాజీ భార్యకు 944 బిలియన్ వాన్‌లు (దాదాపు 6,000కోట్ల రూపాయలు) చెల్లించాలని ఆ దేశపు కోర్టు ఆదేశించింది. ఈ కేసును దక్షిణ కొరియా మీడియా ''డైవోర్స్ ఆఫ్ ది సెంచరీ’’ (ఈ శతాబ్దపు విడాకులు) గా అభివర్ణించింది.

అయితే ఈ మొత్తంపై తుదినిర్ణయం ఇంకా రావాల్సిఉంది.

ఎస్‌కే గ్రూప్ చైర్మన్ చోయ్ తే-వోన్ తన మాజీ భార్య రో సో-యోంగ్‌కు 1.38 ట్రిలియన్ వాన్‌లు చెల్లించాలని 2024లో మొదట కోర్టు ఆదేశించింది. ఆ మొత్తం ఇప్పుడు తగ్గింది.

చోయ్ తే, సో-యోంగ్‌ల వివాహబంధం విచ్ఛిన్నమై దశాబ్దానికి పైగా కాలం గడిచిన తర్వాత ఈ తీర్పు వచ్చింది. చోయ్‌ మరో మహిళతో బిడ్డకు తండ్రయ్యాడని తెలిశాక భర్త నుంచి సో-యోంగ్ విడిపోయారు. సో-యోంగ్ ఆ దేశ మాజీ అధ్యక్షుని కూతురు.

ఎస్‌కే గ్రూప్‌కు చెందిన ఎస్‌కే హైనిక్స్ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ. ఈ సెమీ కండకర్ట్ దిగ్గజ కంపెనీ ఎన్‌విడియాకు చిప్‌లను సరఫరా చేస్తుంది. ఇటీవల అమెరికా స్టాక్ మార్కెట్‌లో తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విడాకులకు కారణం?

''విడాకుల వ్యవహారం చాలామందికి ఆందోళన కలిగించినందకు చైర్మన్ చోయ్ తే-వోన్ తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్పందిస్తాం'' అని చోయ్ లాయర్లు చెప్పారు.

ఎస్‌కే గ్రూప్ దక్షిణ కొరియా కుటుంబ యాజమాన్య వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటి. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సో-యోంగ్, చోయ్ 35 ఏళ్ల పాటు కలిసున్నారు.

వారి ఆస్తుల పంపకంపై కోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు వచ్చింది.

2024లో జరిగిన విచారణలో సో-యోంగ్ తరఫు లాయర్లు ఓ ముఖ్యమైన వాదన వినిపించారు.

సో-యోంగ్ తండ్రి రో తే-వూ నుంచి చోయ్ విస్తృత సాయం పొందారని లాయర్లు వాదించారు. 1988 నుంచి 1993 మధ్య రో తే-వూ దేశ అధ్యక్షునిగా ఉన్నారు.

1991లో అధ్యక్షుడు తన రహస్య నిధుల నుంచి చోయ్‌కు 30 బిలియన్ల కొరియన్ వాన్లు ఇచ్చారని కోర్టు అప్పుడు నిర్ధరించింది. చోయ్ తన మాజీ భార్యకు 1.38 ట్రిలియన్ వాన్లు చెల్లించాలని ఆదేశించింది.

ఈ తీర్పును సుప్రీంకోర్టు గత ఏడాదికొట్టివేసింది. రహస్య నిధులు అక్రమమైనవని, వాటిని దంపతుల ఉమ్మడి ఆస్తిలో భాగంగా పరిగణించలేమని స్పష్టంచేసింది.

దక్షిణకొరియా, ఏఐ, కంపెనీ, విడాకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చోయ్-రో విడాకుల కేసుపై దక్షిణకొరియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

‘కొరియా ప్రజల హీరోలు’

దక్షిణకొరియాలో ఈ కేసుపై అందరి దృష్టి నెలకొంది.

ఎస్‌కే గ్రూప్ 1953లో ఒక టెక్స్‌టైల్ కంపెనీలా ప్రారంభమైంది. తర్వాత వేగంగా విస్తరించి అనేక పరిశ్రమలతో దక్షిణకొరియా పారిశ్రామిక దిగ్గజ గ్రూపుల్లో ఒకటిగా మారింది.

శామ్‌సంగ్ గ్రూప్ తర్వాత ఇప్పుడు దేశంలో రెండో అతిపెద్ద కుటుంబ పారిశ్రామిక సంస్థ అదే. ఎస్‌కే గ్రూపు సంస్థల నుంచి దక్షిణ కొరియా ప్రజలు ఫోన్ ప్లాన్‌ల నుంచి పెట్రోలు వరకు కొనుక్కుంటుంటారు.

ఈ గ్రూప్‌కు చెందిన ఎస్‌కే హైనిక్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రంగా మారిన తర్వాత ఈ సంస్థ అంతర్జాతీయంగా మరింత ప్రాముఖ్యత పొందింది. మేలో ఈ కంపెనీ దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్‌లో ఒక ట్రిలియన్ డాలర్లను దాటింది.

ఎస్‌కే హైనిక్స్ విలువ పెరిగే కొద్దీ ఎస్‌కే గ్రూప్, దాని చైర్మన్ చెయ్ ఖ్యాతి కూడా పెరిగింది.

గత నెలలో కీలక ఏఐ పెట్టుబడుల ప్రణాళిక ప్రకటన సమయంలో, శామ్‌సంగ్ చైర్మన్ జేవై లీని, చోయ్ తే-వోన్‌ను కొరియా ప్రజల హీరోలుగా దక్షిణకొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ అభివర్ణించారు.

న్యూయార్క్‌లో షేర్ల విక్రయం ద్వారా కూడా కంపెనీ 26.5బిలియన్ డాలర్లు సమీకరించుకుంది. అమెరికాలో ఓ విదేశీసంస్థ చేసిన అతిపెద్ద లిస్టింగ్ ఇదే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)