జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్ గురించి ఏముంది?

ఫొటో సోర్స్, ANI
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన సహోద్యోగి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ చేసిన ఆరోపణలే ఇందుకు కారణం.
త్వరలో విడుదల కాబోయే 'వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్' అనే పుస్తకంలో రాసి ఉన్న ఒక సంఘటన గురించి జస్టిస్ కౌల్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
ఇందులో, సుప్రీంకోర్టు కొలీజియంలో అధికారిక చర్చ జరగక ముందే, న్యాయమూర్తుల నియామకం కోసం ప్రతిపాదించిన పేర్లను మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రభుత్వంతో చర్చించేవారని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
ఈ పద్ధతి తనకు నచ్చలేదని, ఇది ప్రభుత్వం నుంచి ముందుగానే 'ఆమోదం' తీసుకోవడం లాంటిదని జస్టిస్ కౌల్ అన్నారు.
అయితే, తానింకా జస్టిస్ కౌల్ పుస్తకాన్ని చదవకపోవడంతో సంజయ్ కౌల్ ఏం చెప్పారో, ఏ సందర్భంలో చెప్పారో అనే దానిపై వ్యాఖ్యానించడం కష్టమని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో చంద్రచూడ్ అన్నారు.

జస్టిస్ కౌల్ ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్... మోదీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై జస్టిస్ కౌల్ పుస్తకం తీవ్రమైన అనుమానాలను లేవనెత్తిందని పేర్కొంది.
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తూ.. కేంద్ర ప్రభుత్వం దాన్ని బలహీనపరుస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఆరోపించారు.
జస్టిస్ కౌల్ తన పుస్తకం గురించి సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు .

ఫొటో సోర్స్, THE WIRE
"కొలీజియం సమావేశం సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నన్ను ఒక ప్రత్యేక సమావేశానికి తీసుకెళ్లి, ప్రతిపాదిత నియామకాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి తాను ప్రభుత్వాన్ని సంప్రదించాలా అని అడిగారు" అని ఈ ఇంటర్వ్యూలో జస్టిస్ కౌల్ చెప్పారు.
కొలీజియంలో పేర్లపై చర్చించేటప్పుడు ఇలా చేయకూడదని తాను అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు చెప్పినట్లు జస్టిస్ కౌల్ తెలిపారు.
కొలీజియం ఐదు పేర్లకు అంగీకరించిందని, అయితే చివరి నిమిషంలో ప్రతిపాదించిన ఆరో పేరును కూడా ఆమోదించాలని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కోరుకున్నారని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
జస్టిస్ కౌల్, కొలీజియంలోని ఇతర సభ్యులు దీనికి సమ్మతంగా లేరు.
"ఆరో పేరుతో సహా ఇతర పేర్ల కోసం వారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకమైన అనుమతి తీసుకుని ఉండవచ్చు" అని న్యాయమూర్తి కౌల్ అన్నారు.
మాజీ సీజేఐకి వ్యతిరేకంగా జస్టిస్ కౌల్ చేసిన ఆరోపణలేంటి?
కొలీజియం నిర్ణయానికి ముందు అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అని ఇంటర్వ్యూలో జస్టిస్ కౌల్‌ను థాపర్ ప్రశ్నించారు.
దానిపై స్పందించిన జస్టిస్ కౌల్, "దురదృష్టవశాత్తు, పేర్ల గురించి చర్చించడం, ప్రభుత్వంతో ముందుగా సంప్రదింపులు జరపడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇది జరుగుతూనే ఉంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ముందు, తర్వాత కూడా ఇది జరుగుతోందని నేను భావిస్తున్నాను. ఇదే నన్ను కలవరపెడుతోంది" అని అన్నారు.
ప్రభుత్వం నుంచి ముందస్తు 'ఆమోదం' తీసుకోవాలనే భావనతో విభేదిస్తూ, కొలీజియం నిర్ణయం తర్వాత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం వేరే విషయమని జస్టిస్ కౌల్ అన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా జస్టిస్ కౌల్ రాసి, విడుదల కాబోయే పుస్తకంలోని ఒక భాగాన్ని థాపర్ చదివి వినిపించారు.
"చర్చకు, నేను ముందస్తు ఆమోదంగా పరిగణించిన ప్రక్రియకు మధ్య తేడా ఉంది. అంటే, కొలీజియంలో అధికారిక చర్చ జరగడానికి ముందే ప్రభుత్వ సమ్మతిని పొందడం. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది" అని ఆ పుస్తకంలో ఉంది.
"నియామకాల విషయంలో చంద్రచూడ్ ప్రభుత్వం పట్ల చాలా మెతకగా వ్యవహరించారు" అని ఆ పుస్తకంలో రాసిన జస్టిస్ కౌల్ చేసిన వ్యాఖ్యను కూడా థాపర్ ప్రస్తావించారు.
అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అనుసరించిన విధానం కొలీజియం వ్యవస్థను బలహీనపరుస్తోందా అని జస్టిస్ కౌల్‌ను ప్రశ్నించారు థాపర్.
దీనిపై స్పందించిన కౌల్.. "ఈ ప్రక్రియ చాలా కాలంగా ఇదే పద్ధతిలో కొనసాగుతోందని ఆయన నమ్మారు. రెండేళ్ల పదవీకాలం ఉన్న ప్రధాన న్యాయమూర్తి ఇలా చేస్తే, తర్వాతి ప్రధాన న్యాయమూర్తి ఈ పద్ధతిని అనుసరించకుండా ఉండటం కష్టమని నేను భావించాను. వారి పదవీకాలాలు తక్కువగా ఉంటాయి. సుప్రీంకోర్టుకు నియామకాలు చేసే ముందు ప్రభుత్వం ఒక నిర్దిష్ట పద్ధతికి అలవాటు పడిపోతుంది. అందుకే ప్రభుత్వంతో ముందుగానే అన్ని విషయాలు చర్చించకుండా నేను ఆయనను ఆపాను" అని చెప్పారు.
"మీరు మొత్తం జాబితాను ముందుగానే చర్చిస్తే, అది దానికదే సమస్యలను సృష్టిస్తుంది" అని సూచించినట్లు జస్టిస్ కౌల్ చెప్పారు.
"చర్చ అనే విషయం తప్పు అని నేను అనుకోవడం లేదు. అసలు సమస్య అది ఏ దశలో, ఏ పద్ధతిలో జరుగుతుంది అన్నదే" అని జస్టిస్ కౌల్ అన్నారు.
ఆరో పేరును కొలీజియం ఆమోదించకపోవడంపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అసంతృప్తికరంగా ఉన్నట్లు తాను భావించినట్లు జస్టిస్ కౌల్ అన్నారు.
''అది ఆయన్ను కలవరపరిచిందని నాకనిపించింది'' అని తెలిపారు.
చంద్రచూడ్‌ను బలహీనమైన చీఫ్ జస్టిస్ అని భావిస్తారా అని అడిగినప్పుడు, ''ప్రధాన న్యాయమూర్తికి రెండు బాధ్యతలు ఉంటాయి. ఒకటి న్యాయపరమైన బాధ్యతలు, మరొకటి పరిపాలనపరమైన బాధ్యతలు. ఆయన న్యాయపరమైన బాధ్యతల విషయంలో నాకెలాంటి బాధ లేదు. ఎందుకంటే, దానికి అవసరమైన మేధో సామర్థ్యం, నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వం ఆయనకు ఉన్నాయని నేను నమ్ముతాను. కానీ ప్రభుత్వంతో సంప్రదింపుల విషయాలలో, ఆయన చాలా ఉదాసీనంగా ఉన్నారని నాకు అనిపించింది. పరిపాలనా విషయాలపై ప్రభుత్వంతో చాలా ఎక్కువ చర్చలు జరిగాయి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మాజీ సీజేఐ చంద్రచూడ్ దీనిపై ఏమన్నారు?
జస్టిస్ కౌల్ చేసి వాదనల గురించి చంద్రచూడ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. తాను ఆ పుస్తకాన్ని ఇంకా చదవలేదని చెప్పారు.
"సంజయ్ కౌల్ ఆయన పుస్తకంలో ఏమి రాశారో దానిపై వ్యాఖ్యానించడం నాకు చాలా కష్టం. ఎందుకంటే నేను ఆ పుస్తకాన్ని చదవలేదు. ఆయన ఏమి రాశారో, ఏ సందర్భంలో రాశారో చూసేంత వరకు నేను దానిపై వివరంగా స్పందించలేను" అని చంద్రచూడ్ అన్నారు.
"అయినప్పటికీ, భారత ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) కొలీజియం సమావేశాలతో నా అనుభవం చాలా బాగుంది. కొలీజియం సభ్యునిగా సంజయ్ కౌల్‌తో నా సంబంధం ఎల్లప్పుడూ చాలా గౌరవప్రదంగా ఉండేది. మేం అర్థవంతమైన చర్చలు, హేతుబద్ధమైన సంభాషణలు జరిపాం. కొలీజియం సమావేశాలలో మేం స్నేహపూర్వక వాతావరణంలో కలిసి ఉన్నాం" అని చెప్పారు.
"మీరు వాకౌట్లు, విభేదాల గురించి మాట్లాడుతున్నారు. కొలీజియం సమావేశం నుంచి సంజయ్ కౌల్ వాకౌట్ చేసిన సందర్భం నాకు గుర్తులేదు" అని అన్నారు.
"అంతేకాకుండా, ప్రతి కొలీజియం సమావేశం తర్వాత ఒక తీర్మానాన్ని ఆమోదించే సంప్రదాయాన్ని నేను నెలకొల్పాను. ఏ తీర్మానంలోనూ ఎలాంటి వ్యతిరేకత నమోదైనట్లు నాకు గుర్తులేదు. ప్రభుత్వంతో సీజేఐ సంప్రదింపులు జరిపారని జస్టిస్ కౌల్ పేర్కొన్నారని మీరు చెబుతున్నట్లయితే, ఆయన సరిగ్గా ఏం రాశారో నేను ముందుగా చదవాల్సి ఉంది. కానీ, ఇందులో ప్రభుత్వానికి కూడా ప్రమేయం ఉంటుంది. ఏది ఏమైనా, న్యాయమూర్తుల నియామకాల ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేస్తారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ ఏం చెప్పింది?
"మోదీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వాతంత్య్రంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ రాసిన పుస్తకం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది" అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ అన్నారు.
న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం, కొలీజియం సమావేశానికి ముందే ప్రభుత్వ ఆమోదం పొందే ప్రయత్నాలు, మైనారిటీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కులంపై ప్రభుత్వం సంధించే అసంబద్ధమైన ప్రశ్నలు వంటి సంఘటనలను జస్టిస్ కౌల్ ప్రస్తావించారు.
ప్రజలు బహిరంగంగా చెప్పడానికి సంకోచించిన విషయాలను జస్టిస్ కౌల్ చాలా సంయమనంతో కూడిన పదజాలంతో రాశారని పేర్కొన్నారు.
''ఇది న్యాయవ్యవస్థపై ఒత్తిడి, దాని స్వాతంత్య్రాన్ని బలహీనపరచడం కాకపోతే మరేమిటి? రాజ్యాంగాన్ని పరిరక్షించే ఈ సంస్థ అధికార ఒత్తిడికి అతీతంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం అనేది ఒక ఐచ్ఛికం కాదు, అది ఒక ఆవశ్యకత'' అని జైరాం రమేశ్ అన్నారు.
సంజయ్ కిషన్ కౌల్ ఎవరు?
సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం , కౌల్ 1979లో దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
ఆ తర్వాత, 1982లో దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్బి డిగ్రీని పొంది, 1982 జూలై 15న దిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా 1987 నుంచి 1999 వరకు పనిచేశారు. డిసెంబర్ 1999లో సీనియర్ అడ్వకేట్ అయ్యారు. మే 3, 2001న దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, మే 2, 2003న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
2017 ఫిబ్రవరి 17న, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































