హుమిడిటీ: ఇది ఎందుకంత ప్రమాదకరం? జాగ్రత్తలు ఎలా ఉండాలి?

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

పది పదిహేనేళ్ల కిందట హైదరాబాద్ వాతావరణానికి, ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉందని వాతావరణ శాఖ నిపుణులూ అంటున్నారు.

హైదరాబాద్‌లో పదేళ్లలో ఉక్కపోతలు బాగా పెరిగినట్లు చెబుతున్నారు.

క్లైమేట్ డైనమిక్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. హుమిడ్ హీట్ భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన వాతావరణ ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొంది.

అత్యధిక ఉష్ణోగ్రత, అధిక తేమ (హై హుమిడిటీ) వాతావరణం కలయిక వల్ల శరీరం తనను తాను చల్లబర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని తెలిపింది.

భారత్ ఎదుర్కొంటున్న హీట్ క్రైసిస్ ఇకపై కేవలం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మాత్రమే పరిమితం కాదని, గాలిలో తేమ శాతం (హుమిడిటీ) విపరీతంగా పెరగడం కూడా ఒక ప్రధాన కారణమని ఈ అధ్యయనం హెచ్చరించింది.

అత్యధిక ఉష్ణోగ్రతతో పాటు అధిక తేమ వాతావరణం.. ప్రజలకు అసౌకర్యంగా మారుతోంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, అసలు హుమిడిటీ అంటే ఏమిటి? అది ఎందుకంత ప్రమాదకరమో తెలుసుకుందాం..

హుమిడిటీ అంటే ?

గాలిలో ఉండే నీటి ఆవిరి పరిమాణాన్నే హుమిడిటీ (తేమ లేదా ఆర్థ్రత) అంటారు.

నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటే.. చల్లని గాలి కంటే వేడి గాలి ఎక్కువ నీటి ఆవిరిని పట్టి ఉంచగలదు. ఉష్ణమండల ప్రాంతాలు చాలా వేడిగా, తేమగా ఉంటాయి.

అందువల్ల అక్కడి గాలిలో నీటి ఆవిరి అధికంగా ఉంటుంది.

దీనికి విరుద్ధంగా, అత్యంత శీతలంగా ఉండే ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలలో లేదా సహారా వంటి ఎడారులలో నీటి ఆవిరి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ తేమ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

హుమిడిటీ మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తుందా?

తక్కువ హుమిడిటీ ఉంటే చర్మం పొడిగా మారిపోవడం, కళ్లు దురద పెట్టడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లే.. అత్యధిక హుమిడిటీని తట్టుకోవడం కూడా మరింత కష్టం.

తక్కువ హుమిడిటీ ఉన్నప్పుడు శరీరాలు విడుదల చేసే చెమట త్వరగా ఆవిరి అవుతుంది. శరీరం త్వరగా చల్లబడుతుంది.

కానీ, అధిక హుమిడిటీ ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు. ఉక్కపోతగా, చిరాకుగా అనిపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

అయితే, అత్యధిక తేమ, అత్యధిక ఉష్ణోగ్రతలు కలిసి ఉన్నప్పుడు.. కొంతమందికి విపరీతంగా వేడి అయి, హీట్ స్ట్రెస్‌ ప్రమాదకర స్థాయిలకు పెరుగుతుంది.

ఎంత ఉష్ణోగ్రత ప్రాణానికి ప్రమాదం?

ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ వాతావరణ కేంద్రాలు రెండు థర్మామీటర్ల ద్వారా ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి.

వీటిలో ఒకటి డ్రై బల్బ్ పరికరం. దీనితో గాలిలో ఉష్ణోగ్రతను గుర్తించవచ్చు. మీరు టీవీలో చూసే ఉష్ణోగ్రత వివరాలను ఈ గణాంకాల ద్వారానే సేకరిస్తారు.

ఇక రెండోది వెట్ బల్బ్ థర్మామీటర్. ఈ పరికరం గాలిలో తేమను రికార్డ్ చేస్తుంది.

దీనిలో ఒక థర్మామీటర్‌ను గుడ్డలో చుట్టి ఉష్ణోగ్రత తీసుకుంటారు. సాధారణంగా ఈ ఉష్ణోగ్రత బయట గాలిలో ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది.

అధిక తేమతో కూడిన వేడి మనుషులకు ప్రాణాంతకం కావచ్చు. దానివల్ల వెట్ బల్బ్ నుంచి తీసిన రీడింగును 'ఫీల్స్ లైక్' అని చెబుతారు. దీని రీడింగ్ చాలా కీలకం.

మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రకరకాల ఉష్ణోగ్రతలు మనకు చెమటలు పట్టేలా చేసి శరీరం చల్లబడ్డానికి సాయం చేస్తాయి.

శరీరం నుంచి బయటికొచ్చిన చెమట ఆవిరి అయిపోతూ తనతో వేడిని కూడా తీసుకెళ్తుంది.

ఈ ప్రక్రియ ఎడారి ప్రాంతాల్లో పక్కాగా జరుగుతుంది. కానీ తేమ ఉన్నచోట అది సరిగా జరగదు. ఎందుకంటే గాలిలో అంతకు ముందే తేమ ఉండడంతో, మన చెమట ఆవిరి కాదు.

దాంతో గాల్లో తేమ పెరిగితే, వెట్ బల్బ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు అంతకంటే ఎక్కువకు చేరితే చెమటలు ఆవిరయ్యే ప్రక్రియ మందగిస్తుంది. దానివల్ల వేడిని తట్టుకునే మన సామర్థ్యంపై ప్రభావం పడుతుంది.

కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోవడం కూడా జరగవచ్చు. అలాంటప్పుడు ఎవరైనా ఏసీ గదిలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే శరీర అంతర్గత ఉష్ణోగ్రత ఆ వేడిని తట్టుకోగల స్థాయిని దాటేస్తుంది. దాంతో శరీర అవయవాలు పనిచేయకుండా పోవచ్చు.

అలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా దాదాపు ఆరు గంటల్లో మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది.

హుమిడిటీ వల్ల పెద్దవారు, బీపీ పేషెంట్లు, ఆస్తమా ఉన్న వాళ్లు, చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతారని హైదరాబాద్‌కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ రేవతి దేవీ రెడ్డి చెప్పారు. హుమిడిటీ పరిస్థితులను తట్టుకోలేక కొన్నిసార్లు చనిపోవచ్చని కూడా ఆమె తెలిపారు.

గర్భిణీలు హుమిడిటీ వల్ల ఇబ్బంది పడతారు. తీవ్రమైన వేడి షాక్ ప్రొటీన్లు అని పిలిచే కొన్ని నిర్దిష్ట ప్రొటీన్ల స్థాయలను పెంచుతాయి. ఈ ప్రొటీన్లు శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ప్లాసెంటాకు (మాయకు) రక్త సరఫరాను కూడా తగ్గిస్తాయి. కడుపులో బేబీకి అందే ఆక్సీజన్, పోషకాలను కూడా పరిమితం చేస్తాయి.

హుమిడిటీ ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గాలిలో తేమ ఉంటే, చెమట అంత తేలిగ్గా ఆవిరి కాదు. దీంతో, శరీరం చల్లబడటం కష్టమవుతుంది. ఇది గర్భిణులపై అదనపు ఒత్తిడిని పెంచి, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే ప్రమాదం, అలాగే కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశాన్ని పెంచుతుంది’’ అని డాక్టర్ రేవతి దేవి రెడ్డి వివరించారు.

‘‘హీట్‌లో శరీరాన్ని చల్లబరిచేందుకు రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. దీన్నే వైద్య పరిభాషలో వాసోడైలేషన్ అంటారు. దానివల్ల బీపీ తగ్గుతుంది. అప్పుడు మైకం వచ్చినట్లు అనిపించడం, నీరసంగా అనిపించడం, స్పృహ తప్పడంలాంటివి జరుగుతాయి. దీనికి హుమిడిటీ కలిస్తే.. చెమట ఆవిరికాక, శరీరంలోనే వేడి ఉండిపోతుంది. దీంతో గుండె ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. గుండెపై ఒత్తిడి పెరిగి, కొన్ని కేసుల్లో బీపీ హెచ్చుతగ్గులు అవుతుంటుంది. అంటే అకస్మాతుగా తగ్గిపోవడం, ఒక్కసారిగా పెరిగిపోవడం జరుగుతుంటుంది’’ అని చెప్పారు డాక్టర్ రేవతి దేవి రెడ్డి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

హుమిడిటీ బారిన పడకుండా డాక్టర్ రేవతి దేవి రెడ్డి సూచిస్తున్న జాగ్రత్తలు

  • పిల్లలు, పెద్దవాళ్లు ఎండలో బయటికి రాకుండా ఉండేలా చూసుకోవాలి.
  • నీళ్ల బాటిల్‌లో సబ్జా గింజలు కలుపుకుని తాగుతుండాలి.
  • కాటన్ దుస్తులు వేసుకోవాలి.
  • తగినంత నీరు తీసుకోవాలి.
  • గొడుగు వాడటం మంచిది
  • తలకు నూనె పెట్టుకుంటే, వేడి ప్రభావం కాస్త తగ్గుతుంది.
  • ఈ సమయంలో టీ, కాఫీ తక్కువగా తాగితే మంచిది.
  • ఇళ్లల్లో చిన్నచిన్న మొక్కలు పెంచుకోవాలి.
  • పిల్లలకి గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన కల్పించాలి.

(ఈ కథనంలో ఆరోగ్య సమస్యల గురించి వివరించినవారు వైద్య నిపుణులు. ఈ సలహాలు సూచనలు అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యనిపుణులను స్వయంగా సంప్రదించండి.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)