రాట్కో మ్లాడిచ్‌: ఈయనను ‘బోస్నియా కసాయి’ అని ఎందుకు పిలిచేవారు?

రాట్కో మ్లాడిచ్

ఫొటో సోర్స్, Corbis/Getty Images

    • రచయిత, శామ్ ఉడ్‌హౌస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

జాతి హననంలో భాగంగా క్రూరమైన దాడులకు దిగి 'బోస్నియా కసాయి' అనిపించుకున్న రాట్కో మ్లాడిచ్‌ 84 ఏళ్ల వయసులో మరణించారు.

యుగోస్లావియా 1990లలో ముక్కలుగా విడిపోతున్న సమయంలో బోస్నియన్ సెర్బ్ సైన్యానికి కమాండర్‌గా ఉన్న మ్లాడిచ్, ‘జాతి నిర్మూలన’ దాడులకు నేతృత్వం వహించారు.

గ్రేటర్ సెర్బియా ఏర్పాటుతో తమ చారిత్రక లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉందని భావించిన మ్లాడిచ్, అందుకోసం జాతి నిర్మూలనకు పాల్పడ్డారు. పురుషులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా వేలమందిని ఊచకోత కోయడాన్ని తెలిపే భయంకరమైన పదప్రయోగమే 'జాతినిర్మూలన''

ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన మరోమాట లేకుండా, పద్ధతి ప్రకారం క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఫలితంగా హిట్లర్ నాజీ పాలన తర్వాత యూరప్ చూసిన అత్యంత రక్తపాత దారుణాలకు ఆయన బాధ్యుడు అయ్యారు.

మ్లాడిచ్ తీవ్ర జాతీయవాదం ఆయనను తన ప్రజల్లో హీరోగా మార్చింది. పొరుగున ఉండే ముస్లింలు.. " సెర్బ్‌లను శూలాలకు గుచ్చి, సజీవంగా కాల్చి, శిలువ వేసి, వారి కళ్లను తొలగించాల"ని చూస్తున్నారని ఆయన చెప్పేవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సరజెవో ముట్టడి

ఫొటో సోర్స్, Sygma via Getty Images

ఫొటో క్యాప్షన్, సరజెవో ముట్టడిలో మరణించిన పౌరుల మృతదేహాలను సమాధి చేస్తున్న కాటికాపరి

సరజెవో ( స్థానికంగా సరయెవో అని అంటారు)పై సాగిన సుదీర్ఘ, రక్తపాత ముట్టడికి ఆయన నాయకత్వం వహించారు. ప్రతిరోజూ షెల్లింగ్, స్నైపర్ కాల్పులతో అక్కడి ప్రజలను చంపుతూ, గాయపరుస్తూ ఉండేవారు. ఐక్యరాజ్యసమితి సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన స్రెబ్రెనిట్సాపై ఆయన దళాలు పట్టు సాధించినప్పుడు, అక్కడి ప్రజలు సురక్షితంగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత 8,000 మంది పురుషులు, బాలురను గుర్తుతెలియని ప్రాంతంలో పాతిపెట్టారు.

ఆయన, ఆయన రాజకీయ భాగస్వామి రాడోవాన్ కరాడ్జిచ్ కలిసి బోస్నియాను ఛిన్నాభిన్నం చేశారు. మారణహోమానికి, మానవత్వానికి వ్యతిరేకమైన అనేక క్రూర నేరాలకు పాల్పడ్డారు. కానీ, ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. చివరకు ది హేగ్‌లో ఆయనపై విచారణ జరిగినప్పుడు కూడా తన బాధితుల బంధువులవైపు సంతోషంగా బొటనవేలు పైకెత్తి (థంబ్స్ అప్) చూపించారు.

''రక్తంతో సరిహద్దుల గీతలు ఏర్పడతాయి, దేశాల సరిహద్దుల గుర్తింపుకు సమాధులే సూచికలు'' అని ఆయన అనేవారు.

మ్లాడిచ్ సరజెవో

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బోస్నియా రాజధాని సరజెవో‌పై మ్లాడిచ్ దళాల ముట్టడి 1425 రోజులపాటు కొనసాగింది

ఎవరీ రాట్కో మ్లాడిచ్?

రాట్కో మ్లాడిచ్ 1942 మార్చి 12న సరజెవో సమీపంలోని ఒక చిన్న కొండ ప్రాంత గ్రామంలో జన్మించారు. అప్పట్లో ఆ ప్రాంతం జర్మనీ నియంత్రణలో ఉన్న స్వతంత్ర క్రొయేషియాలో భాగంగా ఉండేది.

రెండేళ్ల తర్వాత, నాజీ మద్దతు ఉన్న క్రొయేషియా జాతీయవాదులకు వ్యతిరేకంగా టిటో పార్టిజన్‌ల తరఫున పోరాడుతున్న సమయంలో ఆయన తండ్రి మరణించారు.

యుద్ధానంతరం ఏర్పడిన యుగోస్లావియాలో మ్లాడిచ్ పెరిగారు. కొంతకాలం టిన్ పనివాడిగా శిక్షణ పొందిన తర్వాత, తర్వాత సైన్యంలోకి వెళ్లారు.

ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుంచి 1965లో పట్టభద్రుడయ్యాడు. సమర్థుడైన సైనికుడిగా తనను తాను నిరూపించుకున్నఆయన త్వరగా పదోన్నతులు పొందారు. మాసిడోనియా, కొసోవోల్లో సైనిక విభాగాలకు కమాండర్‌గా వ్యవహరించారు.

బోస్నియా, యుద్ధం, సెర్బులు,

ఫొటో సోర్స్, Corbis/Getty Images

ఫొటో క్యాప్షన్, సరజెవోలో తన కుమారుడి సమాధి వద్ద ఓ తండ్రి నివాళి

‘ముస్లిం ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోండి’

టిటో 1980లో చనిపోవడం యుగోస్లావియా పతనానికి నాంది పలికింది. పరస్పర విరుద్ధ వర్గాలు, జాతీయవాదుల మధ్య పోటీ, అంతర్గతంగా రగులుతున్న ద్వేషంతో కూడిన అస్థిర సమాఖ్యగా యుగోస్లావియా ఎప్పటినుంచో ఉండేది.

క్రొయేషియా 1991 జూన్‌లో స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో, క్రొయేషియాపై నియంత్రణను తిరిగి సాధించడంలో భాగంగా మ్లాడిచ్‌ను యుగోస్లావ్ సైన్యంతోపాటు అక్కడకు పంపించారు.

ఆయన ప్రాణాలను లెక్క చేయని సాహసాలకు ముందుండేవారు. ఎప్పుడూ కందకాల వద్ద ముందు వరుసలో కనిపించేవారు. మందుపాతరల తొలగింపునకు కూడా స్వయంగా నాయకత్వం వహించేవారు.

అందుకే ఆయనను సైనికులు ఎంతో అభిమానించేవారు. ఆ అభిమానం దాదాపు దేవుడిలా ఆరాధించే స్థాయికి చేరింది.

యుద్ధం బోస్నియాకు విస్తరించడంతో, ఆయన దళాలు తమ యూనిఫారాలను మార్చుకుని, విడిపోయిన రిపబ్లికా సర్పస్కా మద్దతు ప్రకటించాయి.

ముస్లింలను పురాతన కాలంలో ఒట్టోమన్ తుర్కులు జరిపిన ఆక్రమణ ఫలితంగా వచ్చిన ఆక్రమణదారులుగా ఆయన భావించేవారు.

జనలర్ మ్లాడిచ్ దళాలు

ఫొటో సోర్స్, Sygma via Getty Images

ఫొటో క్యాప్షన్, 8వేలకు పైగా పురుషులను, బాలురను జనరల్ మ్లాడిచ్ ఆధ్వర్యంలోని దళాలు హతమార్చాయి

సరజెవో ముట్టడి

చారిత్రక అన్యాయంగా తాను భావించిన దాన్ని సరిదిద్దుతానని, ఆ "ఆక్రమణదారులను" వెళ్లగొట్టి, జాతిపరంగా తాను కలలుగన్న స్వచ్ఛమైన దేశాన్ని నిర్మిస్తానని మ్లాడిచ్ ప్రతిజ్ఞ చేశారు.

అలా సరజెవో ముట్టడి ప్రారంభమైంది. బోస్నియా రాజధానికి సెర్బ్‌లు, క్రొయాట్లు, బోస్నియాక్‌లు (బోస్నియన్ ముస్లింలు) లతో కూడిన సైనిక బలగం రక్షణగా నిలిచింది.

చుట్టుపక్కల కొండలపై మ్లాడిచ్ దళాలు మోహరించడంతో ఏర్పడిన ఈ దిగ్బంధం 1,425 రోజుల పాటు కొనసాగింది. ఆధునిక యుద్ధ చరిత్రలో అత్యంత క్రూరమైన నగర ముట్టడుల్లో ఇదే సుదీర్ఘమైనది.

భయకంపితులైన నగర ప్రజలపై 1993 జులై 22న దాదాపు 4వేల ఫిరంగి గుండ్ల వర్షాన్ని కురిపించారు.

ముట్టడి ముగిసే సమయానికి ఫిరంగి గుండ్లకు, స్నిపర్ బుల్లెట్లకు 13వేలమంది చనిపోయారు. దాదాపు నగరంలోని ప్రతిభవనం దెబ్బతినడమో, పూర్తిగా ధ్వంసం కావడమో జరిగింది.

రాజధాని చుట్టుపక్కల గ్రామాలలో వేలాదిమంది పురుషులను చంపడమో, జైళ్లకు లాక్కుపోవడమో చేశారు. వేలాదిమంది మహిళలపై అత్యాచారం చేశారు.

జనరల్ మ్లాడిచ్ ప్రధాన కార్యాలయం నుంచి వెలువడిన ఒక ఆదేశం ఆయన వైఖరిని స్పష్టంగా చూపించింది. "నేను ఆపమని ఆదేశించే వరకు విరామాలతో కాల్పులు జరుపుతూనే ఉండండి" అని అందులో ఉంది.

"ముస్లిం ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోండి. అక్కడ ఎక్కువ మంది సెర్బ్‌లు నివసించరు. వారు పిచ్చివాళ్లయ్యే పరిస్థితికి చేరుకునే వరకు షెల్లింగ్ చేయండి" అని ఆదేశించింది.

తన సైన్యానికి ఉన్న శక్తిని ఆస్వాదిస్తూ, ఆయన రేడియో ద్వారా ఆదేశాలు ఇచ్చేవాడు. ఆ సందేశాలను ఉద్దేశపూర్వకంగానే కోడ్ చేయకుండా ప్రసారం చేసేవారు. దీంతో అవి ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యేలా చూసేవారు.

ఒక ప్రాంతంపై ఆయనసైనికులు గురిపెట్టినప్పుడు, "వారి మెదళ్లను కాల్చండి" అని ఆయన అరిచేవారు. తన ఆదేశాలను "దేవుడే ఇచ్చిన ఆదేశాలు’ గా భావించి పాటించాలని సైనికులకు చెప్పేవారు.

బోస్నియా

ఫొటో సోర్స్, Sygma via Getty Images

ఫొటో క్యాప్షన్, బోస్నియా సెర్బ్ కారాగార శిబిరంలో బక్కచిక్కిపోయిన ఖైదీలు... వీరిలో బతికి బయటపడ్డ కొంతమంది బాధితులు తదుపరి రాట్కో మ్లాడిచ్‌పై జరిగిన విచారణకు హాజరయ్యారు

‘మీ నాన్నను వదిలేయ్’.. మ్లాడిచ్ కుమార్తెకు ప్రియుడి హెచ్చరిక

వారాంతాల్లో ఆయన తన కుటుంబాన్ని కలుసుకునేవాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు బెల్‌గ్రేడ్‌లో సురక్షితంగా ఉండేవారు.

వారు కలిసి బోర్డు ఆటలు ఆడేవారు. రాజకీయాల గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడకుండా ఉండేవారు. అయితే ఆయన 23 ఏళ్ల కుమార్తె అనా ఒక యువ వైద్యుడు, మానవ హక్కుల కార్యకర్తతో ప్రేమలో పడ్డారు.

అయితే "నీ తండ్రిని వదులుకో. లేకపోతే ఇక నన్ను ఎప్పుడూ కలవకు’’ అని ఆ వైద్యుడు ఆమెకో షరతు విధించారు. దీంతో అనా ప్రేమ గురించి కన్న కలలు, కుటుంబ బంధాల మధ్య నలిగిపోయారు. చివరకు ఆత్మహత్య చేసుకున్నారు.

కూతురు ఆత్మహత్యను మ్లాడిచ్ జీర్ణించుకోలేకపోయారు. ఈ విషాదానికి తాను తప్ప అందరూ కారణమనే విచిత్రమైన కుట్ర సిద్ధాంతాలను ఆయన నమ్మడానికి ఇష్టపడ్డారు.

చివరకు 1995లో నేటో సహనం కోల్పోయింది.

సరజెవో చుట్టుపక్కల మ్లాడిచ్ స్థావరాలపై యుద్ధ విమానాలతో , క్రూయిజ్ క్షిపణులతో దాడుల ప్రారంభించింది నేటో. వాటిలో చాలా దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.

ముట్టడి ముగిసింది. కానీ దేశాన్ని "జాతి నిర్మూలన" ద్వారా శుద్ధి చేయాలనే ఆయన హత్యాకాండ ఇంకా ముగియలేదు.

ఆ వేసవిలో తూర్పు బోస్నియాలోని చిన్న పర్వత పట్టణమైన స్రెబ్రెనిట్సాలో వేలమంది బోస్నియాక్ పౌరులను ఒకచోట చేర్చారు.

వారికి ఐక్యరాజ్యసమితి రక్షణ ఉంది. ఐక్యరాజ్యసమితి ఆ ప్రాంతాన్ని "సురక్షిత ప్రాంతం"గా ప్రకటించింది.

బోస్నియన్ సెర్బ్ దళాలు వారిపై భారీ ఫిరంగి గుండ్లు, రాకెట్లతో దాడి చేశాయి. ఐదు రోజుల తర్వాత టీవీ కెమెరా బృందాల మధ్య మ్లాడిచ్ దర్జాగా పట్టణంలోకి ప్రవేశించాడు.

ప్రధాన కూడలిలో ఆయన స్వీట్లు పంచారు, పిల్లల తలలపై చేయి వేసి, అంతా బాగానే ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే వారు ఆయన మాటలను నమ్మలేదు.

పురుషులను కాల్చి చంపారు, మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అక్కడ ఉన్న కొద్దిమంది డచ్ శాంతి పరిరక్షకులు ఏమీ చేయలేకపోయారు.

ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ గడ్డపై జరిగిన అత్యంత ఘోరమైన నేరం చోటుచేసుకుంది.

మ్లాడిచ్ దళాలు కనిపించిన ప్రతి బోస్నియాక్ పురుషుడిని పట్టుకున్నారు. వారిని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి, చాలామందిని చంపేశారు.

కేవలం కొన్ని రోజుల్లోనే 8వేల మంది పురుషుల, పిల్లల చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి కాల్చి చంపారు. వారిలో కొందరి వయసు కేవలం పన్నెండేళ్లు కాగా, మరికొందరు డెబ్బైల చివర్లో ఉన్నారు.

వారందరినీ క్రూరంగా హత్య చేసి, గుర్తు తెలియని ప్రాంతాలలో సామూహిక ఖననం చేశారు.

(ఆత్మహత్య తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు ఒత్తిడికి గురైతే భారత ప్రభుత్వ జీవన్ సాధీ హెల్ప్‌లైన్ 18002333330 సాయం కోరవచ్చు. అలాగే మీ స్నేహితులు, బంధువులతోనూ మాట్లాడండి)

జనరల్ మ్లాడిచ్

ఫొటో సోర్స్, Gamma-Rapho Images via Getty Images

ఫొటో క్యాప్షన్, జనరల్ మ్లాడిచ్ 1994లో తన దళాలను నడిపించారు

మారణ హోమం, చీకటి అధ్యాయం

అది మారణహోమం. యూరప్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం, ఐక్యరాజ్యసమితి చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టం.

ఇది అత్యంత పకడ్బందీగా నిర్వహించిన నేరం. ప్రజలకు ఐక్యరాజ్యసమితి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇవన్నీ ఐక్యరాజ్యసమితి కళ్ల ముందే జరిగిపోయాయి.

తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఈ మారణకాండకు బాధ్యత "మొట్టమొదటగా, దీనిని ప్రణాళిక వేసి అమలు చేసిన వారిదే" అని రాశారు. అయితే అంతర్జాతీయ సమాజం నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ధోరణితో తీసుకున్న నిర్ణయాల్లో తీవ్రమైన తప్పులు చేసింది" అని ఆయన పేర్కొన్నారు.

యుద్ధ నేరాలకు పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు నమోదయయ్యాయి.

ఆయనను పట్టుకు రావడానికి వీలుకల్పించే సమాచారం అందించిన వారికి అమెరికా 5 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఏడాది తర్వాత అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి బోస్నియా అధ్యక్షురాలు బిల్యానా ప్లావ్షిచ్ ఆయనను పదవి నుంచి తొలగించారు.

అయితే ఆయన ది హేగ్‌లో విచారణను ఎదుర్కోవడానికి మరో 14 సంవత్సరాలు పట్టింది.

ఆయన బెల్‌గ్రేడ్‌కు తిరిగి వెళ్లి, అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషెవిచ్ మద్దతు, రక్షణ పొందారు.

ఆ తర్వాత మ్లాడిచ్ బహిరంగంగానే జీవించారు. స్నేహితులతో కలిసి జింకల వేటకు వెళ్లేవారు, ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేసేవారు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా హాజరయ్యేవారు.

దేశ ప్రజల్లో పెద్ద వర్గానికి ఆయన ఇప్పటికీ హీరోనే . వారి దృష్టిలో సెర్బియా యుద్ధస్ఫూర్తికి, ఆ దేశ గత వైభవానికి మ్లాడిచ్ ప్రతిబింబంగా కనిపించారు

ఆయన్ను అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించకూడదని అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషెవిచ్ పట్టుదలగా ఉండేవారు. మ్లాడిచ్ వ్యక్తిగత రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక సైనిక దళాన్ని కూడా అధ్యక్షుడు ఏర్పాటు చేశారు.

2000 అక్టోబర్‌లో స్లోబోడాన్ మిలోషెవిచ్‌ను అరెస్టు చేసి ది హేగ్‌కు అప్పగించడంతో పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి.

అంతర్జాతీయంగా రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. పరారీలో ఉన్న నిందితులకు సెర్బియా రక్షణ కల్పిస్తుండటంతో, ఆ దేశం యూరోపియన్ యూనియన్‌లో చేరే ప్రక్రియ కూడా నిలిచిపోయింది.

ఆ రాత్రే మ్లాడిచ్ పారిపోయారు. ఇక తన దేశం నుంచి రక్షణ లభిస్తుందన్న అభయం ఆయనకు లేకుండా పోయింది.

తర్వాతి పదేళ్ల పాటు ఒక రహస్య స్థావరం నుంచి మరో రహస్య స్థావరానికి మారుతూ జీవించారు. మొదట విశ్వసనీయమైన అంగరక్షకుల బృందం ఆయనకు రక్షణ కల్పించింది. వారు ఒక్కొక్కరుగా దూరమైన తర్వాత ఆయన కుటుంబమే చివరకు ఆశ్రయంగా నిలిచింది.

ఆయన మాజీ రాజకీయ మిత్రులు రాడోవాన్ కరాడ్జిచ్‌ను 2008 జులైలో బెల్‌గ్రేడ్‌లోఒక బస్సులో అరెస్టు చేశారు. అప్పటికే ఆయన పొడవాటి గడ్డంతో మత ప్రబోధకుడిగా మారారు.

కొత్త సెర్బియా ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానంతో అధికారిక సహకారాన్ని ఏర్పాటు చేసుకుని, కరాడ్జిచ్‌ను అప్పగించింది. తర్వాతి వంతు జనరల్ మ్లాడిచ్‌దే.

మ్లాడిక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎటువంటి పశ్చాత్తాపం లేని మ్లాడిక్ తన విచారణ సందర్భంగా బొటనవేలు చూపారు

మూడేళ్ల తరువాత ఆచూకీ, నాలుగేళ్లు విచారణ

మూడేళ్ల తర్వాత మ్లాడిచ్ ఆచూకీ లభించింది.

పోలీసులు ఆయన పిల్లలను అనుసరిస్తూ ఒక మారుమూల ఫామ్‌హౌస్‌ వరకు వెళ్లారు. . వారిని ఎదుర్కొనేంత శక్తి లేక మ్లాడిచ్ కిటికీలోంచి చూస్తూ ఉండిపోయారు. భద్రతా బలగాలు లోపలికి వెళ్లినప్పుడు, అప్పటికే పలుమార్లు పక్షవాతానికి గురైన, ఒక బలహీనమైన 69 ఏళ్ల వ్యక్తిని వారు గుర్తించారు.

విచారణ నాలుగేళ్ల పాటు కొనసాగింది.

న్యాయస్థానం 500 రోజులకు పైగా విచారణలు నిర్వహించింది. దాదాపు 600 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. దాదాపు 10,000 ఆధారాలను పరిశీలించింది.

తీర్పు ఏంటో చాలామంది ఊహించినప్పటికీ, న్యాయ ప్రక్రియను మాత్రం పూర్తిగా అనుసరించారు.

స్రెబ్రెనిట్సా మారణకాండకు ముందు మ్లాడిచ్ తన సైనికులకు ఆదేశాలు ఇస్తున్న దృశ్యాలను చూపించారు. మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, "యుద్ధ సంప్రదాయాల" ఉల్లంఘనలలో ఆయన దోషిగా తేలారు.

కోర్టులోకి చిరునవ్వుతో, కెమెరాల వైపు బొటనవేలు పైకెత్తి ప్రవేశించారు మ్లాడిచ్. అయితే తీర్పులు వెలువడిన వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

"ఇదంతా అబద్ధం" అని అరుస్తూ, కోర్టు నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో ఆయనను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. శిక్ష ప్రకారం జైలులోనే ఆయన జీవితం ముగియాల్సి ఉంది.

ఈ విచారణకు హాజరైన అనేకమంది బాధితులు, వారి బంధువుల్లో ఫిక్రెట్ అలిచ్ కూడా ఉన్నారు. 1992లో బోస్నియన్ సెర్బ్‌ల నిర్బంధ శిబిరంలో అస్థిపంజరంలా మారిపోయిన ఆయన దృశ్యాలు అప్పట్లో ప్రసిద్ధమయ్యాయి.

"న్యాయం జరిగింది. యుద్ధ నేరస్థుడికి శిక్ష పడింది" అని ఆయన చెప్పారు. మరికొందరు మాత్రం కన్నీళ్లతో కుప్పకూలిపోయారు.

అయితే తీర్పులపై ఆనందం దేశవ్యాప్తంగా అందరిలోనూ కనిపించలేదు.

కొంతమంది బోస్నియాక్‌లు సరజెవో, స్రెబ్రెనిట్సా వెలుపల జరిగిన నేరాలకు మ్లాడిచ్‌ను దోషిగా తేల్చకపోవడంపై నిరాశ చెందారు. చాలామంది తోటి సెర్బ్‌లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ ప్రజల్లో చాలామందికి ఈ "బోస్నియా కసాయి" కేవలం ఒక సాధారణ సైనికుడు, తమ జీవన విధానాన్ని కాపాడిన వ్యక్తి మాత్రమే. అయితే బోస్నియాక్‌లు, అంతర్జాతీయ సమాజంలోని అత్యధికులు మాత్రం హత్యలకు పాల్పడి, యూరప్ వేదికపై తమ దేశానికి అవమానం తెచ్చిన దుర్మార్గుడిగా ఆయన్ను గుర్తుంచుకుంటారు.

బోస్నియాలో ముస్లింలు, సెర్బ్‌లు ఇప్పటికీ ఒకరితో ఒకరు అంతంతమాత్రపు సఖ్యతతో కలిసి జీవిస్తున్నారు. 1990లలో మ్లాడిచ్, రాడోవాన్ కరాడ్జిచ్ సాగించిన హింసాత్మక జాతీయవాద యుద్ధం ముగిసిపోయి ఉండవచ్చు. కానీ ఉద్రిక్తతలు మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)