‘టెన్షన్ పడటం తెలియని రజత్ పాటిదార్’, ఆర్సీబీకి రెండో కప్పు అందిస్తాడా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, బాబా ఇంద్రజిత్
- హోదా, కేకేఆర్ మాజీ ప్లేయర్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఐపీఎల్ ట్రోఫీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక దశలో 17 ఏళ్ల పాటు ఎదురుచూసింది. అయితే, రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి ఈ ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఇప్పుడు వారి ముందుంది.
అహ్మదాబాద్‌లో ఆదివారం (మే 31) రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఐపీఎల్-2026 ఫైనల్లో రెండోసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా ఆర్సీబీ బరిలోకి దిగుతుంది.
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్సీబీ మళ్లీ కప్పు గెలవడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కీలకం అవుతాడని నేను భావిస్తున్నా.
ఈ సీజన్లో రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 486 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇది బెస్ట్ సీజన్‌గా నిలిచింది. తన ఆటతీరుతో ప్రతీ మ్యాచ్‌లో గొప్ప ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
నాలుగో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేయడం అంత సులువైన విషయం కాదు. కానీ, పాటిదార్ ఈ స్థానంలో 196.76 స్ట్రయిక్ రేట్‌తో అద్భుతంగా ఆడుతున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చిన రజత్ ఇన్నింగ్స్‌ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఫైనల్లోనూ రజత్ నుంచి నేను ఇలాంటి ఇన్నింగ్స్నే ఆశిస్తున్నాను.
అలాగే, కెప్టెన్సీ ఒత్తిడి ఏమాత్రం తన బ్యాటింగ్‌పై పడకుండా చూసుకుంటున్నాడు. ఇదే పాటిదార్‌లో నాకు నచ్చిన మరో అంశం. ఈ సీజన్లో కొంతమంది కెప్టెన్ల బ్యాటింగ్ ఎలా దెబ్బతిందో మనం చూశాం. కానీ, పాటిదార్ బ్యాటింగ్‌లో కెప్టెన్సీ ప్రభావం చూపించలేక పోయింది.
ఈ సీజన్లో రజత్ పాటిదార్ బ్యాటింగ్, కెప్టెన్సీ ఎందుకు ఇంత అద్భుతంగా సాగాయి? ఫైనల్ మ్యాచ్‌లో ఇవి ఎలా ప్రభావం చూపించగలవో ఇక్కడ చూద్దాం.

ఫొటో సోర్స్, ANI
రజత్ పాటిదార్ బలాలు, ఒకే ఒక్క సమస్య
సాధారణంగా ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కగిసో రబడ, మొహమ్మద్ సిరాజ్ ఇద్దరూ పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆర్సీబీ పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. అందువల్ల ఈ మ్యాచ్‌లో రజత్ పాత్ర చాలా కీలకం కానుంది.
స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడమే రజత్ పాటిదార్ అతిపెద్ద బలం. పాటిదార్ క్రీజులో ఉన్నప్పుడు స్పిన్నర్లను వాడటానికి చాలామంది కెప్టెన్లు సంకోచిస్తుంటారు. స్పిన్నర్ల విషయంలో రజత్ తన ఆటతో అలాంటి ప్రభావం చూపించాడు.
కెరీర్ ప్రారంభం నుంచే అతను స్పిన్‌ను చాలా బాగా ఆడుతున్నాడు. రజత్ దేశవాళీ మ్యాచుల్లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఎక్కువగా ఆడటం నేను చూశాను. కానీ, ఐపీఎల్లో అలా ఆడట్లేదు. అలాగని క్రీజు వదిలి ముందుకు వచ్చి ఆడే ప్లేయర్ కూడా కాదు. స్థిరంగా నిలబడి సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఆయనకు ఉంది.
బంతి లెంగ్త్‌ను ముందే సరిగ్గా అంచనా వేయడం రజత్‌కు ఉన్న మరో బలం. ఈ సామర్థ్యం వల్లే సరైన షాట్ ఎంచుకుని, దానిని చక్కగా అమలు చేయగలుగుతున్నాడు. ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అనే తేడా లేకుండా మైదానం నలుమూలలా షాట్లు ఆడగలడు. అందుకే బంతి ఏ లైన్లో వచ్చినా దాన్ని బాదగలుగుతున్నాడు.

ఫొటో సోర్స్, ANI
రజత్ ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వంటి స్పిన్నర్లకు కచ్చితంగా సవాల్ అవుతాడు. పాటిదార్ క్రీజులో ఉన్నప్పుడు స్పిన్ బౌలర్లను తీసుకురావడానికి గిల్ కచ్చితంగా ఆలోచనలో పడతాడు.
ఈ సీజన్లో పాటిదార్ స్పిన్‌తో పాటు పేస్ బౌలింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మూమూలుగానే పేస్ బౌలింగ్‌ను బాగా ఆడే రజత్ ఈసారి వారి బంతులను ఎక్కువగా బౌండరీలు, సిక్సర్లుగా మలుచుతున్నాడు.
అయితే, రజత్ ఈసారి షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లుగా కనిపిస్తోంది. గత సీజన్లలో షార్ట్ బాల్స్ వేసినప్పుడు అతను స్క్వేర్ లెగ్ దిశగా ఆడేవాడు. కానీ, ఈ సీజన్లో ఫైన్ లెగ్ వైపు స్కూప్ షాట్ ఆడబోయి తన వికెట్ కోల్పోవడం కనిపించింది.
కాబట్టి, గుజరాత్ బౌలర్లు పాటిదార్‌పై షార్ట్ బాల్ వ్యూహాన్ని ఉపయోగించవచ్చు. కగిసో రబడ, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు పాటిదార్‌కు సవాలు విసరవచ్చు. వీరిని ఎదుర్కోవడానికి పాటిదార్ ఆ బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీకి పంపాలి, లేదా షార్ట్ బాల్స్ వచ్చినప్పుడు సింగిల్స్ తీసి మిగతా బంతులను ఉపయోగించుకోవాలి. ఈ మేరకు తన ఆటతీరులో కాస్త మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, ANI
ప్రశాంతమైన కెప్టెన్
పాటిదార్ కెప్టెన్సీ కూడా అద్భుతంగా ఉంది. ఈ సీజన్లో నాకు బాగా నచ్చిన ఇద్దరు కెప్టెన్లు ప్యాట్ కమిన్స్, రజత్ పాటిదార్. ఆర్సీబీని నిరుడు చాంపియన్‌గా నిలిపిన పాటిదార్ ఈ సీజన్లోనూ అదే విజయ పరంపరను కొనసాగించాడు. తమ జట్టుపై ఉన్న అంచనాలను చక్కగా మోస్తున్నాడు.
చాలామంది కెప్టెన్లను మనం ఎక్కువగా ప్రశంసిస్తూ ఉంటాం. ఉదాహరణకు గత కొన్ని సీజన్లుగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వ లక్షణాలను చాలామంది కొనియాడారు. అయితే, పాటిదార్ అందరి దృష్టిని అంతగా ఆకర్షించడు. రజత్ ఎప్పుడూ ప్రశాంతంగా, మౌనంగా ఉండటం వల్ల ఆయన గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ, అన్ని ప్రశంసలకు అతను అర్హుడు.
స్టార్ ప్లేయర్లతో కూడిన ఆర్సీబీ జట్టులో చక్కని వాతావరణం ఉండేలా రజత్ చూసుకుంటున్నాడు. అంతమంది హేమాహేమీలు, భారీ అభిమానగణం ఉన్న జట్టును నడిపించడం, ఇన్నేళ్ల కప్పు కలను నెరవేర్చడం అంత సామాన్యమైన విషయం కాదు.

ఫొటో సోర్స్, ANI
విజయాలు సాధిస్తున్నాడనే కారణంతోనే నేను రజత్‌ను మెచ్చుకోవట్లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా, నిదానంగా ఉంటూ జట్టును నడిపిస్తున్న తీరు నాకు నచ్చుతుంది. కఠిన పరిస్థితుల్లో కూడా ఆందోళనకు గురి కాకుండా ఉంటాడు. అందుకే తప్పుడు నిర్ణయాలు కనబడవు. ఒక జట్టుగా ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అదే సమయంలో, అప్పుడప్పుడు ఎదురయ్యే ఓటములను, వైఫల్యాలను మైదానంలో రజత్ ఎదుర్కొనే విధానం బాగుంటుంది.
అతనిలో ఈ లక్షణాన్ని నేను ముందే గమనించాను. బుచ్చిబాబు టోర్నమెంట్లో రజత్తో కలిసి నేను ఆడాను. దాదాపు 20 రోజులు మేం కలిసి ప్రయాణించాం. అప్పుడు ఆయన కెప్టెన్ కాదు. కానీ, ఎంతో ప్రశాంతంగా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనించేవాడు. ఎలాంటి క్లిష్ట సమయంలోనూ ఆందోళన చెందని రజత్ స్వభావాన్ని నేను అప్పుడే చూశాను. అవన్నీ ఇప్పుడు ఆర్సీబీ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి.
ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టుపై కచ్చితంగా భారీ ఒత్తిడి ఉంటుంది. వారు డిఫెండింగ్ చాంపియన్స్ కావడంతో అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా, గుజరాత్ టైటాన్స్ జట్టు తమకు బాగా అలవాటైన అహ్మదాబాద్ పిచ్‌పై, తమ సొంత గడ్డపై, సొంత అభిమానుల మధ్య ఆడబోతోంది. ఇది టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం.
అహ్మదాబాద్ మైదానంలోకి అడుగుపెడితే టైటాన్స్ బ్యాటర్లు, బౌలర్లు మరింత మెరుగ్గా ఆడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఓపికగా, ప్రశాంతంగా ఉండే కెప్టెన్ మాత్రమే సవాళ్లను తట్టుకోగలడు. ఈ లక్షణాలతో అహ్మదాబాద్ పిచ్, టైటాన్స్ జట్టు విసిరే సవాళ్లను కచ్చితంగా ఎదుర్కొని, ఆర్సీబీకి రెండో ఐపీఎల్ ట్రోఫీని అందిస్తాడని నేను నమ్ముతున్నాను.
ఆర్సీబీ జట్టు ఈ సీజన్లో రజత్ పాటిదార్‌ను రూ. 11 కోట్లకు రిటెయిన్ చేసుకుంది.
ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు (తుది జట్టు అంచనా)
ఆర్సీబీ ప్లేయర్లు: విరాట్ కోహ్లీ, వెంకటేశ్/సుయాశ్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్, భువనేశ్వర్, హేజల్‌వుడ్, జాకబ్ డఫీ, రసిఖ్ సలామ్
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, నిశాంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, హోల్డర్, రషీద్ ఖాన్, రబడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























