విజయ్: మద్దతు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని తెలిపిన టీవీకే బృందం

విజయ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

టీవీకే నాయకుడు విజయ్ స్వయంగా తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని వెల్లడించారు. తమకు సరిపడా ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు అందించిన లేఖలో విజయ్ పేర్కొన్నారు.

విజయ్ వెంట టీవీకే పార్టీ నేతలు అధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్, సెంగోట్టయన్, ఎన్. ఆనంద్, అరుణ్ రాజ్ ఉన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన అనంతరం, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు విజయ్‌ను స్వయంగా కలిసి మద్దతు లేఖను అందజేశారు.

మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా, టీవీకే పార్టీకి 108 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి.

తమిళనాడు శాసనసభ పదవీకాలం మే 10వ తేదీతో ముగుస్తుంది కాబట్టి అప్పటిలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, విజయ్, టీవీకే, కాంగ్రెస్

ఫొటో సోర్స్, @TVKPartyHQ/X

ఫొటో క్యాప్షన్, మే 10లోగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటవ్వాలి.

అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఇన్‌చార్జ్ గిరీశ్ చోడంకర్ విలేఖరులతో మాట్లాడారు.

"కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ తన పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను విజయ్ ఆహ్వానించారని కూడా ఆయన పేర్కొన్నారు.

కేబినెట్‌లో కాంగ్రెస్‌కు చోటు కల్పిస్తారా అని అడగ్గా, "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ విజయ్‌ను ఆహ్వానిస్తారని మేము ఆశిస్తున్నాము. కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వడమే కాకుండా, బాధ్యతాయుతంగా కూడా వ్యవహరిస్తుంది" అని ఆయన అన్నారు.

అయితే, కూటమి నుంచి వైదొలగిన కాంగ్రెస్ 'వెన్నుపోటు పొడిచిందని' డీఎంకే చేసిన విమర్శల గురించి అడగ్గా, "ప్రజల తీర్పే అంతిమం, మేము దానిని గౌరవిస్తాం" అని చోడంకర్ అన్నారు.

తమిళనాడు, విజయ్, టీవీకే, కాంగ్రెస్

ఫొటో సోర్స్, AICC

ఫొటో క్యాప్షన్, టీవీకేకు మద్దతుపై కాంగ్రెస్ ప్రకటన

అయితే, ఈ భాగస్వామ్యం భారత రాజ్యాంగాన్ని విశ్వసించని మతపరమైన శక్తులను దూరంగా ఉంచితేనే కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ షరతు పెట్టింది.

రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సరైన భాగస్వామ్యం, బాధ్యతతో ఏర్పాటయ్యే ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే కాదని.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా సహకరించుకుంటుందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)