ఆ నలుగురినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం: రాహుల్ గాంధీ

"నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేష్ కుమార్ ఏం చేసినా సరే, మేం వారిని వదిలిపెట్టబోం. ఆ నలుగురినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం" అని రాహుల్ గాంధీ అన్నారు.

సారాంశం

  • దిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత కొద్దిసేపటికి విడుదల చేశారు.
  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇతర విపక్ష నేతలు జంతర్ మంతర్‌కు బయలుదేరారు.
  • 'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తేనే యువకులు వెనక్కి తగ్గుతారు' అని సీజేపీ నేత సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.
  • రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచింది, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని అంచనా.
  • రాహుల్, ప్రియాంక గాంధీలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
  • సృష్టిలోని అణువుల అసమానత రహస్యాన్ని ఛేదించినందుకుఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ బి. కాగన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం

  2. ఆ నలుగురినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు.

    ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసన కోసం జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపారు.

    ఆ తర్వాత కొద్దిసేపటికి విపక్ష నేతలను పోలీసులు విడుదల చేశారు.

    "నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేష్ కుమార్ ఏం చేసినా సరే, మేం వారిని వదిలిపెట్టబోం. ఆ నలుగురినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం" అని రాహుల్ గాంధీ అన్నారు.

    మరోవైపు పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

    "ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి వెళ్తున్న ఎంపీలతో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. వారు ఎంపీలైన మమ్మల్ని కొడుతున్నారు. పోలీసులు నన్ను చాలా చోట్ల గాయపరిచారు. మమ్మల్ని నెట్టేసి నేలపై పడేశారు. మేం ఇక్కడి నుంచి కదిలేది లేదు. నేను ఇక్కడి నుంచి కదలను" అన్నారామె.

  3. 'తోపులాటలో కిందపడిన రాహుల్ గాంధీ'

    రాహుల్ గాంధీ, అశుతోష్
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ కిందపడినట్లు వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు( స్క్రీన్ గ్రాబ్)

    జంతర్ మంతర్‌కు సమీపంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కిందపడినట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.

    సీజేపీ ప్రతినిధి అశుతోష్ ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ దిల్లీ పోలీసులపై విమర్శలు చేశారు.

    "దిల్లీ నుంచి సిగ్గుచేటు దృశ్యాలు వస్తున్నాయి. దిల్లీ పోలీసులు జాతీయ స్థాయిలో ఎంతలా తలవంపులు తెస్తున్నారో దేశమంతా గమనిస్తోంది" అని రాశారు.

  4. అణువుల అసమానత రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్

    హెన్రీ బి. కగాన్, కెన్సో సోయై, రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి
    ఫొటో క్యాప్షన్, కైరాలిటీని వివరిస్తున్న నోబెల్ రసాయన శాస్త్ర కమిటీ చైర్మన్ హీనర్ లింకే.

    సృష్టిలోని అణువుల అసమానత రహస్యాన్ని ఛేదించినందుకుఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ బి. కాగన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అణువుల ప్రతిబింబ రూపం కాకుండా నిజ రూపాన్ని మాత్రమే ప్రకృతి ఎలా ప్రత్యేకంగా తయారుచేయగలుగుతుందో ఈ పరిశోధకులు కనుగొన్నారు.

    ఉదాహరణకు, ప్రోటీన్లను తయారుచేసే అమైనో ఆమ్ల అణువులు ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల్లాంటి రెండు రూపాల్లో ఉంటాయి.

    భూమిపై ఉన్న జీవులన్నీ ఈ రెండు రూపాలలో కేవలం ఒకే ఒక్క రూపంతోనే పనిచేస్తాయి.

    అసలు జీవసృష్టి ఇటువంటి ప్రతిబింబ రూపాలలో కేవలం ఒక వైపు అణువుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందనే ప్రశ్నకు ఈ నోబెల్ గ్రహీతలు సమాధానం ఇచ్చారు.

    ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ గుణాన్ని "కైరాలిటీ" అని పిలుస్తారు. ఇటువంటి కైరల్ అణువులకు కుడి, ఎడమ చేతి రూపాలు ఉంటాయి. ఇవి చూడటానికి సరిగ్గా మన రెండు చేతుల లాగా ఉంటాయని అనుకోవచ్చు. ఒకేలా కనిపించినప్పటికీ, ఒకదానిపై ఒకటి ఇవి సరిగ్గా అమరవు.

    ప్రకృతి తన జీవక్రియల కోసం అవసరమైన రూపాన్ని మాత్రమే దాదాపుగా ప్రత్యేకంగా తయారుచేసుకుంటుంది. ల్యాబ్‌లో జరిపే రసాయన చర్యలు మాత్రం సాధారణంగా కుడి, ఎడమ చేతి అణువులను 50-50 నిష్పత్తిలో సమాన మిశ్రమంగా సృష్టిస్తాయి.మందుల తయారీ విషయానికి వస్తే ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రెండు రూపాలు మన శరీరంతో పరస్పర చర్య జరిపినప్పుడు వేర్వేరుగా స్పందిస్తాయి. అంటే, వాటిలో ఒక రూపం రోగాలను నయం చేసే గుణాలను కలిగి ఉంటే, మరొక రూపం అసలు ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు, లేదా హాని కూడా కలిగించవచ్చు.

    ఈ ఉదయం నోబెల్ ప్రైజ్ విలేకరుల సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడుతూ కెన్సో సోయ్, "ఇది నా జీవితంలోనే అత్యంత ఉత్సాహభరితమైన రోజుల్లో ఒకటి" అని ఆనందం వ్యక్తం చేశారు.

  5. జంతర్ మంతర్: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    జంతర్ మంతర్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీని వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు

    ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగాదిల్లీలో ప్రతిపక్షాల నిరసన బుధవారం కూడా కొనసాగింది.

    ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసన కోసం జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    'దేశద్రోహులు, నమ్మకద్రోహులపై మా పోరాటం ఆగేది లేదు' అని కాంగ్రెస్ ఎక్స్ పోస్ట్‌లో రాసింది.

    పోలీసులు తమపై దాడి చేసి, నిరసన ప్రదేశం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారని ఇండియా కూటమి ఎంపీలు తెలిపారు.

    రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ
    ఫొటో క్యాప్షన్, అంతకుముందు, జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న ప్రియాంకా గాంధీ తదితరులు.
    జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ సమీపంలో పోలీసు వాహనం ఎక్కిన నిరసనకారులు
    రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, అంతకుముందు, జంతర్ మంతర్ సమీపంలో రోడ్డుపై రాహుల్ గాంధీ
    జంతర్ మంతర్, రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ సమీపంలో పరిస్థితి
    జంతర్ మంతర్ , రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, బస్సు ఎక్కుతున్న రాహుల్ గాంధీ
    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
    ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్‌కు బస్సులో వెళుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
    జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, వాహనంపైకి ఎక్కిన నిరసనకారులు
  6. విపక్ష ఎంపీలతో కలిసి జంతర్ మంతర్‌కు రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, జంతర్ మంతర్, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, బుధవారం జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన చేపడతామని రాహుల్ గాంధీ తెలిపారు.

    చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇతర విపక్ష నేతలు జంతర్ మంతర్‌కు బయలుదేరారు.

    బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో విపక్ష నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విందు భోజనం ఏర్పాటు చేశారు. విందు అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.

    "ఇండియా కూటమి పక్షాలన్నీ నేడు జంతర్ మంతర్ వద్ద జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపడతాయి. మా డిమాండ్ నెరవేరే వరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తాం" అని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు

  7. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై కోచ్ గౌతమ్ ఏమన్నారంటే..

    క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ , కోచ్ గౌతమ్ గంభీర్
    ఫొటో క్యాప్షన్, అగార్కర్ పదవీకాలం గత నెలలో ముగియగా, ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది.

    భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో గంభీర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

    "ప్రియమైన అజిత్ భాయ్, మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ మూడు ఐసీసీ ట్రోఫీలే మీ నమ్మకానికి నిదర్శనం. చరిత్ర మీ పట్ల మరింత ఉదారంగా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను. అన్నింటికీ ధన్యవాదాలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని తెలిపారు.

    అగార్కర్ పదవీకాలం గత నెలలో ముగియగా, ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది.

    ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా లేదా అనే దానిపై పలు వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

    అగార్కర్ పదవీకాలంలో భారత్ 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత పరిస్థితిని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించారు.

  8. ఒక ఫేస్‌బుక్ పోస్టు మరణదండనకు దారి తీసింది... ‘మా అబ్బాయిని క్షమించండి’ అంటూ కుటుంబం వేడుకుంటోంది

  9. 'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తేనే యువత వెనక్కు తగ్గుతారు': సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్

    కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్

    అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన గురించి దిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ చెప్పారు.

    "దేశంలోని యువత అంతా, అంటే కామ్రేడ్లు అందరూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ చేరుకోనున్నారు. దీనిపై మేం దిల్లీ పోలీసులకు అధికారికంగా సమాచారం అందించాం. శాంతిభద్రతలు కాపాడుతూ మాకు సహకరించాలని కోరాం" అని ఆయన తెలిపారు.

    "మేం అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేశాం, అండర్‌టేకింగ్ కూడా ఇచ్చాం. దేశ యువత మరోసారి రోడ్డెక్కుతున్నారు. ఈసారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంత వరకు యువకులు వెనక్కి తగ్గరు" అని తెలిపారు.

    "ఇది కేవలం సీజేపీ ఉద్యమం, నిరసన మాత్రమే కాదని నేను మళ్లీ చెప్పదలుచుకున్నాను. ఇది జెన్-జి, యువత చేస్తున్న పోరాటం. ఓట్ల చోరీ జరుగుతుంటే, ఎన్నికలను లాగేసుకుంటుంటే అది ప్రతి పౌరుడి సమస్య అవుతుంది. కాబట్టి దేశంలోని యువతంతా ఇందులో పాల్గొనాలి. 'ఛలో దిల్లీ' అనేది మా నినాదం. కాక్రోచ్‌లంతా ఒక్కచోట చేరాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని ఆశిస్తున్నాం, దానికి అనుగుణంగానే పోలీసులకు సమాచారం ఇచ్చాం" అని సౌరవ్ దాస్ తెలిపారు.