లైవ్ , ఐఎఫ్‌జే ఖాతా, పోస్టులు తొలగించాలన్న దిల్లీ పోలీసుల ఆదేశాలపై సీజేపీ అభ్యంతరం

ఈ పోస్టులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని పోలీసులు పేర్కొన్నట్లు ఐఎఫ్ఎఫ్ తెలిపింది.

సారాంశం

  • మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
  • తుపాను తీరం దాటిన సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది.
  • మురసు తుపాను కారణంగా ప్రకాశం, బాపట్లలో కౌంటింగ్ ఆలస్యమైంది.
  • భారీ వర్షాలు, ఈదురుగాలులతో రాకపోకలకు అంతరాయం
  • విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
  • హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు.
  • దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మురాసు తుపాను తీరం దాటింది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండగా, అత్యంత వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
  • ప్రకాశం జిల్లా నాగులుప్పాడులో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య అత్యధికంగా 198 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

లైవ్ కవరేజీ

  1. గుడ్ నైట్

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.

    మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  2. ఐఎఫ్‌జే ఖాతా, పోస్టులు తొలగించాలన్న దిల్లీ పోలీసుల ఆదేశాలపై సీజేపీ అభ్యంతరం

    సౌరవ్ దాస్,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్
    ఫొటో క్యాప్షన్, నవంబర్ 3, 2026 ఉదయం దిల్లీ పోలీసులు జారీ చేసిన రెండు నోటీసుల ప్రతులను ఎక్స్ సంస్థ తమకు పంపినట్లు ఐఎఫ్ఎఫ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

    సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ నుంచి ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) ఖాతాను తొలగించాలని దిల్లీ పోలీసులు కోరారు.

    అంతేకాకుండా ఐఎఫ్ఎఫ్‌కు చెందిన ఆరు పోస్టులు, సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్‌ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్‌సీ), జియో బ్లాక్ ఇన్ ఇండియా సంస్థల ఖాతాలతో పాటు మరో 16 మంది వినియోగదారుల పోస్టులను కూడా తొలగించాలని ఆదేశించారు.

    నవంబర్ 3, 2026 ఉదయం దిల్లీ పోలీసులు జారీ చేసిన రెండు నోటీసుల ప్రతులను ఎక్స్ సంస్థ తమకు పంపినట్లు ఐఎఫ్ఎఫ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

    ఈ పోస్టులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని పోలీసులు పేర్కొన్నట్లు ఐఎఫ్ఎఫ్ తెలిపింది.

    ప్రభుత్వం జారీ చేస్తున్న ఇంటర్నెట్ బ్లాకింగ్ ఆదేశాలను విమర్శించడం, వాటికి సంబంధించిన వివరాలను నమోదు చేయడం నిలిపివేయాలని మూడు సంస్థలకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు కోరినట్లు ఐఎఫ్ఎఫ్ వెల్లడించింది.

    ఈ రెండు నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని దిల్లీ పోలీసులను డిమాండ్ చేసింది ఐఎఫ్ఎఫ్. నోటీసులను ఉపసంహరించుకోకపోతే కోర్టులో సవాలు చేస్తామని స్పష్టం చేసింది.

    దీనికి సంబంధించిన పోస్టును సీజేపీ (కాక్రోజ్ జనతా పార్టీ)కు చెందిన సౌరవ్ దాస్ కూడా షేర్ చేశారు.

    సౌరవ్ దాస్ ఎక్స్‌లో స్పందిస్తూ.. "ప్రజల ఆన్‌లైన్ స్వేచ్ఛను కాపాడేందుకు ఐఎఫ్ఎఫ్ అద్భుతమైన సేవలు అందించింది. దాని ఎక్స్ ఖాతా, పోస్టులను తొలగించాలని దిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసు తిరోగమన చర్య. ఇది భావప్రకటనా స్వేచ్ఛ పట్ల తీవ్ర అసహనాన్ని తెలియజేస్తోంది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఐఎఫ్ఎఫ్‌కు మా పూర్తి మద్దతు, సంఘీభావం ప్రకటిస్తున్నాం" అని పేర్కొన్నారు.

    ఐఎఫ్ఎఫ్ అంటే ఏమిటి?

    ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అనేది భారతదేశంలో డిజిటల్ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ.

    ఇంటర్నెట్ నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా చేపట్టిన 'సేవ్ ద ఇంటర్నెట్' ఉద్యమం నుంచి ఈ సంస్థ ఆవిర్భవించింది.

    నెట్ న్యూట్రాలిటీ, భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలు వంటి పలు అంశాలపై ఐఎఫ్ఎఫ్ పనిచేస్తోంది.

  3. సీసీ కెమెరాలను ఈ విధంగా ఏర్పాటు చేయకూడదు- అలహాబాద్ హైకోర్ట్

    సీసీటీవీ
    ఫొటో క్యాప్షన్, తన పొరుగువారు ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన విధానం వల్ల తన ఇంటికి వచ్చి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

    భద్రత కోసం ఎవరైనా సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేటప్పుడు, అవి పక్కింటి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉండకూడదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

    జస్టిస్ అజిత్ కుమార్, జస్టిస్ గరిమా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం యోగేంద్ర మౌర్య వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు బార్ అండ్ బెంచ్ పేర్కొంది.

    తన పొరుగువారు ఇంట్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేసిన విధానం వల్ల తన ఇంటికి వచ్చి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టే అవకాశం ఉందని పిటిషనర్ యోగేంద్ర మౌర్య ఆరోపించారు.

    కెమెరా అమర్చిన స్థానం కారణంగా తన ఇంటికి వచ్చి వెళ్లే వ్యక్తుల వ్యక్తిగత గోప్యత కూడా దెబ్బతింటోందని పిటిషనర్ పేర్కొన్నారు.

    ఇది తన గోప్యత హక్కుకు (రైట్ టూ ప్రైవసీ) భంగం కలిగిస్తోందని చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు.

    ఈ కేసును విచారించిన ధర్మాసనం, "ఎలాంటి సీసీ కెమెరానైనా పొరుగువారి గోప్యతకు భంగం కలిగించే విధంగా ఏర్పాటు చేయకూడదు లేదా దాని దిశను అలా అమర్చకూడదు" అని వ్యాఖ్యానించింది.

    అయితే సీసీ కెమెరాను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించలేదు.

    దీనిపై తగిన ఉపశమనం పొందేందుకు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

    అంతేకాకుండా కెమెరాను తొలగించాలని కోరుతూ పిటిషనర్ దరఖాస్తు చేసుకుంటే, జిల్లా మేజిస్ట్రేట్ నెల రోజుల్లోగా దాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

  4. 20 మంది సిబ్బందిని రక్షించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఇరాన్

    ఇరాన్, భారత్
    ఫొటో క్యాప్షన్, 20 మంది సిబ్బందిని రక్షించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఇరాన్

    'అజినీ' నౌకలోని 20 మంది ఇరాన్ సిబ్బందిని రక్షించినందుకు భారత ప్రభుత్వానికి, భారత నౌకాదళానికి, భారత వైమానిక దళానికి న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

    "భారత సాయుధ దళాల నైపుణ్యం, ధైర్యం, సమన్వయాన్ని ప్రశంసిస్తున్నాం" అని ఇరాన్ రాయబార కార్యాలయం రాసుకొచ్చింది.

    "ఇది మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల పట్ల భారత్‌కు ఉన్న బలమైన నిబద్ధతను తెలియజేస్తోంది. తన సరిహద్దులకు ఆవల ప్రాణాలను కాపాడటంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఘటన చూపిస్తుంది." అని అభిప్రాయపడింది

    ఈ ఆపరేషన్‌ను భారత్, ఇరాన్‌ మధ్య స్నేహం, సంఘీభావం, సహకార స్ఫూర్తికి ప్రతీకగా ఇరాన్ రాయబార కార్యాలయం అభివర్ణించింది.

    ఇరాన్ సిబ్బందిని సురక్షితంగా రక్షించడంలో పాలుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

    ఈ మిషన్‌కుగాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియాలో భారత నౌకాదళాన్ని అభినందించారు. ముంబయికి 3,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో 48 గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత, సిబ్బందిలోని 20 మందిని కాపాడారని ఆయన అన్నారు.

    ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం కూడా సకాలంలో సహకారం అందించింది.

    భారత నౌకాదళం సముద్రపు దొంగలను గుర్తించి, వారిని అడ్డుకుని, సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

  5. మురసు తుపాను ప్రభావంతో గంటకు సగటున 1.52 నుంచి 2 మిల్లీమీటర్ల వర్షపాతం

    మురసు, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్
    ఫొటో క్యాప్షన్, సముద్ర తీరం

    ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదలిందని ఐఎండీ పేర్కొంది.

    ఇది ఒంగోలుకు ఉత్తర-ఈశాన్యంగా 30 కి.మీ, బాపట్లకు నైరుతిగా 40 కి.మీ, కావలికి ఉత్తర-ఈశాన్యంగా 90 కి.మీ, విజయవాడకు దక్షిణ-నైరుతిగా 100 కి.మీ మచిలీపట్నానికి పశ్చిమ-నైరుతిగా 120 కి.మీ దూరంలో ఉంది. ఇది మరింతగా ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ, మధ్యాహ్నానికి బలహీనపడి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

    నవంబర్ 3, 2026 అర్ధరాత్రికల్లా ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. మచిలీపట్నం, విశాఖపట్నంలోని డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా దీని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

    "ప్రస్తుతానికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. గంటకు సగటున 1.52 నుంచి 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. గత రెండు గంటల్లోనే సుమారు 6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. బుడమేరు పరీవాహక ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదు. రహదారులను క్లియర్ చేసే బృందాలు, పర్యవేక్షణ బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా పెద్దగా రహదారులు మూసుకుపోవడం లేదా అంతరాయాలు కలగడం వంటివి లేవు. రాబోయే 24 నుంచి 36 గంటల పాటు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తాం. ప్రజలు అధికారులకు సహకరించి, సూచనలను పాటించాలని కోరుతున్నాను. అనవసర ప్రయాణాలకు, బయటకు వెళ్లడానికి దూరంగా ఉండండి. ప్రభుత్వం తరపున పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించినప్పుడు, అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేవు" అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

  6. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ

    కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ
    ఫొటో క్యాప్షన్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ

    కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసినట్టు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.

    తీవ్ర తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ కె. నాగరత్న తెలిపారు.

    కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసినట్టు వెల్లడించారు.

    మత్స్యకారులు నవంబర్ 4వ తేదీ ఉదయం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

    ఐఎండీ హెచ్చరికల దృష్ట్యా, పరిస్థితిని సమీక్షించే వరకు తీరప్రాంత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని తెలిపారు. తుపాను బలహీనపడే వరకు ఐఎండీ ఇచ్చే తాజా సమాచారాన్ని, సూచనలను అనుసరించడం మంచిదన్నారు.

  7. నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు సమీపంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. తమిళనాడు పర్యటకుడు మృతి

    నేపాల్
    ఫొటో క్యాప్షన్, నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు సమీపంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు

    నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ మేరకు నేపాల్ పౌర విమానయాన సంస్థ డిప్యూటీ అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్బీబీసీకి ధ్రువీకరించారు.

    ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు.

    ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన పర్యటకుడు అక్కడికక్కడే మరణించినట్లు సోలుఖుంబు అసిస్టెంట్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ భూపేంద్ర థాపా ధ్రువీకరించారు. మృతుడిది భారత్‌లోని తమిళనాడు రాష్ట్రంగా చెప్పారు.

    గాయపడిన మరో వ్యక్తిని హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించారు.

    ఈ ప్రమాదం ఉదయం 8.15 గంటల ప్రాంతంలో జరిగిందని పౌర విమానయాన సంస్థ పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, లుక్లా నుంచి వస్తున్న, గోరఖ్‌పూర్ నుంచి తిరిగి వెళ్తున్న ఒక హెలికాప్టర్ బేస్ క్యాంప్ సమీపంలోని ఒకే ప్రదేశంలో దిగడానికి ప్రయత్నిస్తుండగా ఢీకొన్నాయి.

    ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియడం లేదని జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. మంచు కారణంగా హెలికాప్టర్లు వేరే హెలిప్యాడ్‌పై దిగడానికి ప్రయత్నించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

    అధికారుల ప్రకారం, ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీకి చెందిన హెలికాప్టర్లు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. అధికారులు ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

  8. ఒంగోలులో భీకర గాలులు, వర్షం

    ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌ ప్రాంతంలో భీకర గాలులు, వర్షం
    ఫొటో క్యాప్షన్, ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌ ప్రాంతంలో భీకర గాలులు, వర్షం

    దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మురసు తుపాను తీరం దాటింది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండగా, అత్యంత వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటుతున్న తరుణంలో తీర ప్రాంతమంతటా బలమైన గాలులు వీస్తున్నాయి.

    సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు

    నాగులుప్పలపాడు(ప్రకాశం)లో 198.01 మి.మీ

    కొత్తపట్నం(ప్రకాశం)లో 182.25 మి.మీ

    బాపట్ల(ప్రకాశం)లో 128.53 మి.మీ

    చీరాల(ప్రకాశం)లో 124.10 మి.మీ

    త్రోవగుంట(ప్రకాశం)లో 116.93 మి.మీ

    ఒంగోలు అర్బన్(ప్రకాశం) 106.97 మి.మీ

    చిలకపాడు(ప్రకాశం)లో 104.50 మి.మీ

    సంతనూతలపాడు (ప్రకాశం)98.7మి.మీ

    మొగల్తూరు(పశ్చిమగోదావరి)లో 96 మి.మీ

    మలికిపురం(కోనసీమ) 93.7 మి.మీ వర్షపాతం నమోదు అయినట్టు ప్రఖర్ జైన్ తెలిపారు.

  9. పులివెందుల పోలింగ్‌పై వైసీపీ వేసిన పిటిషన్ కొట్టివేత- కౌంటింగ్‌కు లైన్ క్లియర్

    పులివెందుల, కడప, వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
    ఫొటో క్యాప్షన్, పులివెందుల పోలింగ్‌పై వైసీపీ వేసిన పిటిషన్ కొట్టివేత- కౌంటింగ్‌కు లైన్ క్లియర్()

    పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ కోసం వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

    పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

    మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించింది. దీన్ని విచారించిన హైకోర్టు నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది.

    ఉదయం 7.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. వైసీపీ నేతలు ప్రమీలమ్మ, వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు కొట్టివేసింది.

    పులివెందుల మున్సిపాలిటీ కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  10. మురసు తుపాను ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ఆలస్యం, గరికిపాటి ఉమాకాంత్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్, మురసు, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్,
    ఫొటో క్యాప్షన్, ఓట్ల లెక్కింపు(ప్రతీకాత్మక చిత్రం)

    మురసు తుపాను ప్రభావం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై కనిపించింది. రెండు జిల్లాల్లో లెక్కింపు ఆలస్యం కానుందని అధికారులు ప్రకటించారు.

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం మార్పులు చేశారు.

    ఈ రెండు జిల్లాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ 11.30 గంటలకు వాయిదా వేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కౌంటింగ్ యథావిధిగా సాగుతుందన్నారు.

    భారీ వర్షాలు, ఈదురుగాలులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రహించిన ఎన్నికల అధికారులు అందుకు తగట్టుగా చర్యలు తీసుకున్నారు.

    అందుకే ఉదయం 10.30 గంటలకు మరోసారి పరిస్థితి సమీక్షించనుంది. వర్షాలు తగ్గకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

    ఈ నిర్ణయం కేవలం ప్రకాశం, బాపట్ల జిల్లాలకే పరిమితమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశించింది.

  11. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, గరికిపాటి ఉమాకాంత్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్‌, మున్సిపాలిటీ ఎన్నికలు
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

    ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలట్లు లెక్కిస్తున్నారు.

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించనున్నారు.

    జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో యథావిధిగా లెక్కింపు ప్రారంభించామన్నారు.

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుపాను ప్రభావం ఉంది.

    విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కారణంగా కొన్నిచోట్ల కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది పూర్తిగా చేరుకోలేదని అధికారులు చెప్పారు. కొందరికి ఆర్డర్‌ కాపీలు కూడా అందడంలోనూ ఆలస్యమైందని చెబుతున్నారు.

  12. ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను

    ఒంగోలుకు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను
    ఫొటో క్యాప్షన్, ఒంగోలుకు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను

    తీవ్ర తుపాను మురసు బంగాళాఖాతంలో ఉత్తర-వాయవ్య దిశగా పయనించి ఒంగోలు సమీపంలో తీరం దాటింది.

    మంగళవారం ఉదయం 3.30 నుంచి 5.30 గంటల మధ్య నెల్లూరు- నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిందని ఐఎండీ ప్రకటించింది.

    ఈ సమయంలో గాలి వేగం గంటకు 100–110 కిలోమీటర్లుగా ఉందని, గాలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినప్పుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిందని వెల్లడించింది.

  13. విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    విశాఖపట్నం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌
    ఫొటో క్యాప్షన్, హెచ్‌పీసీఎల్ గాజువాక నడిబొడ్డున ఉంటుంది. దీని చుట్టూ వేలాది నివాసాలు ఉంటాయి.

    విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపురం, శ్రీహరిపురం పారిశ్రామిక ప్రాంతాల పరిసరాల్లో ఈ ఘటనతో ఆందోళన నెలకొంది.

    రిఫైనరీలో రఫ్ పిచ్ ఆయిల్‌ (తారు) నిల్వ ఉన్న ట్యాంకు సమీపంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో పక్కనే ఉన్న రహదారులపై ప్రయాణిస్తున్నవారు వాటిని గమనించారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

    దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. కొందరు మంటలు వ్యాప్తిని చూసి ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. హెచ్పీసీఎల్ గాజువాక నడిబొడ్డున ఉంటుంది. దీని చుట్టూ వేలాది నివాసాలు ఉంటాయి.

    విశాఖపట్నం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌
    ఫొటో క్యాప్షన్, హెచ్పీసీఎల్ ప్రమాద దృశ్యాలను అటుగా వెళ్తున్నవారంతా సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి

    ప్రమాదానికి కారణాలపై ఆరా

    హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    ఆయిల్‌ ట్యాంకు పేలిపోయిందంటూ పారిశ్రామిక ప్రాంతంలో వదంతులు వ్యాపించాయి.

    ఇందులో వాస్తవం లేదని చెప్పారు.

    ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు పరిశీలన చేపట్టారు.

    విశాఖ హెచ్పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు
    ఫొటో క్యాప్షన్, విశాఖ హెచ్పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు

    రఫ్ పిచ్ ఆయిల్ అంటే ఏమిటి?

    రఫ్ పిచ్ ఆయిల్ అనేది బిటుమెన్‌ (తారు) తయారీలో ఉపయోగించే మధ్యంతర ఉత్పత్తి.

    తారు ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే లేదా సహజంగా లభించే నల్లటి, చిక్కటి, జిగటగా ఉండే హైడ్రోకార్బన్‌ పదార్థం.

    దీనిని వేడి చేసినప్పుడు మెత్తబడి, ప్రవహించే స్వభావం పెరుగుతుంది. అలాగే మండేటప్పుడు వెలువడే ఆవిరి, ఉష్ణోగ్రతను బట్టి అగ్ని ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది.

    దీనిని రోడ్ల నిర్మాణం, వాటర్‌ప్రూఫింగ్‌, రూఫింగ్‌ వంటి పనులకు ఉపయోగిస్తారు.

    విశాఖపట్నం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌
    ఫొటో క్యాప్షన్, హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు.

    స్థానిక పోలీసులు ఏమన్నారంటే...

    ఈ ప్రమాదంతో గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో అందరిలోనూ అందోళన నెలకొంది.

    సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలతో పెద్ద ప్రమాదాన్ని తలపించాయి. దీనిపై మల్కాపురం సీఐ నర్సింహరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

    “పెట్రోల్ తయారు చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వ్యర్థ ఉత్పత్తిని నిల్వ చేసే ట్యాంకర్‌లో మంటలు వ్యాపించాయి.

    ఈ మంటలను హెచ్పీసీఎల్ ఫైర్ ట్యాంకులు అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.” అని సీఐ నర్సింగరావు తెలిపారు.

    విశాఖ
    ఫొటో క్యాప్షన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు HPCL యాజమాన్యంతో మాట్లాడినట్లు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

    ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే గణబాబు

    విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు(గణబాబు) HPCL యాజమాన్యంతో మాట్లాడినట్లు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

    “హెచ్పీసీఎల్ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం…”సల్ఫర్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ సమయంలో భారీగా మంటలు బయటకు రావడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలను అదుపు చేసేందుకు చుట్టుపక్కల పరిశ్రమల సహాయం తీసుకున్నారు. గత రెండు గంటలుగా పలువురు పరిశ్రమల యాజమాన్యంతో పాటు అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.” అని పోస్ట్ చేశారు.

  14. మురసు: ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరం దాటుతున్న తీవ్ర తుపాను

    ఒంగోలు, మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతున్న మురసు తుపాను
    ఫొటో క్యాప్షన్, ఒంగోలు, మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతున్న మురసు తుపాను

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటుతోంది. తీవ్ర తుపానుగా మారిన తరువాత ఇది మంగళవారం తెల్లవారుజాము నుంచి ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకి, దాటుతోందని భారత వాతాావరణ శాఖ(ఐఎండీ) నవంబరు 3న ఉదయం 5 గంటలకు జారీ చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.

    ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

    తుపాను ముందుభాగంలోని ప్రధానమైన వాల్ క్లౌడ్ ఎక్కువ భాగం భూభాగంలోకి ప్రవేశించిందని తెలిపింది. సైక్లోన్ ఐ మాత్రం ఇంకా తీర ప్రాంతంలోకి ప్రవేశించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వెల్లడించింది.

    మురసు తుపాను గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 9 కిలోమీటర్ల వేగంతో క‌దిలింది.

    తీవ్ర తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన అప్‌డేట్స్ మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి