జోషిమఠ్ దగ్గర కూలిన హెలికాప్టర్: చాపర్‌లో పైలట్ సహా మొత్తం ఆరుగురు

బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తున్న ఒక హెలికాప్టర్ జోషిమఠ్ దగ్గర కూలిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు, ఒక పైలట్ ఉన్నారు.

సారాంశం

  • బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు యాత్రికులతో వెళ్తున్న ఒక హెలికాప్టర్ జోషిమఠ్ దగ్గర కూలిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులున్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
  • న్యూజీలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఓడిపోయింది. 87 పరుగుల తేడాతో భారత్‌పై న్యూజీలాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. 260పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 172 పరుగులే చేయగలిగింది.
  • ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
  • అర్నబ్ తుపాను తీరం దాటిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
  • తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

లైవ్ కవరేజీ

  1. కర్రల గొడుగు: ‘ఇది బరువు కాస్తాది, తుపాను వచ్చినా నిలుస్తది’ -

    వీడియో క్యాప్షన్, స్థానికంగా జనాలు ఉపయోగించే ప్రత్యేకమైన గొడుగులు

    ‘అర్నబ్ తుపాను’ వేళ గాలులకు గొడుగులు ఎగిరిపోయినట్లు చాలా వీడియోలలో కనిపించాయి.

    ఈ క్రమంలో 'అర్నబ్ తుపాను' కవరేజీలో వెళ్తున్న బీబీసీ బృందానికి శ్రీకాకుళం జిల్లాలో గొర్రెలను కాచే కొంతమంది దగ్గర ఈ ప్రత్యేకమైన గొడుగులు కనిపించాయి.

    ఈ గొడుగులు ఎలా తయారు చేస్తారు? తదితర వివరాల గురించి ఆయనతో బీబీసీ మాట్లాడింది.

  2. క్రిస్టా పైక్ : మరణ శిక్ష విఫలం.. కానీ ‘నొప్పిలేని క్షణమే లేదు’

    అమెరికా, మరణశిక్ష, విషపూరిత ఇంజెక్షన్లు
    ఫొటో క్యాప్షన్, క్రిస్టా పైక్

    సెప్టెంబర్‌లో మరణశిక్ష అమలు ప్రయత్నం విఫలమైన తర్వాత అమెరికాకు చెందిన క్రిస్టా పైక్ మొదటిసారి స్పందించారు.

    ఆమె తరఫు లాయర్ల బృందం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.

    "ఆ రాత్రి జరిగిన ఘటన తర్వాత నొప్పి లేకుండా ఒక్క క్షణం కూడా గడవలేదు. నా శరీరమంతా నొప్పిగా ఉంది. నా చేతులు, భుజాలు, గొంతు నొప్పిగా ఉన్నాయి. మాట్లాడడానికి ఇప్పటికీ ఇబ్బందిగా ఉంది. ఈ నొప్పి శారీరకమైనది మాత్రమే కాదు. మానసికమైనది కూడా " అని ఆమె చెప్పినట్టు ఈ ప్రకటనలో ఉంది.

    50 ఏళ్ల పైక్ గత నెల చివర్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    సెప్టెంబర్‌లో పెంటోబార్బిటాల్‌ను రెండు ఇంజెక్షన్లద్వారా ఎక్కించి క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమయింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ ఆ ప్రక్రియ నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.

    పైక్ వయసు ఇప్పుడు 50ఏళ్లు. 18 ఏళ్ల వయస్సులో తన బాయ్‌ఫ్రెండ్‌ టడారిల్ షిప్‌తో కలిసి కొల్లీన్ స్లెమ్మర్‌ అనే యువతిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలారు. అప్పుడు కొల్లీన్ వయసు 19ఏళ్లు.

  3. ‘ఐడీబీఐను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే, ప్రభుత్వం మాట్లాడలేదు’ - రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, ఐడీబీఐ బ్యాంక్, పారిశ్రామికీకరణ
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, రాహుల్ గాంధీ ఐడిబీఐ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.

    “గతేడాది మార్చిలో మీలో కొందరు పార్లమెంట్ భవనంలో నన్ను కలవడానికి వచ్చారు. మీరు లాభదాయకంగా మార్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు అమ్ముతోంది అని నన్ను ఒక సాధారణ ప్రశ్న అడిగారు” అని రాహుల్ తన లేఖలో తెలిపారు.

    “నేను ఈ ప్రశ్నను లోక్‌సభలో లేవనెత్తాను. లాభదాయకమైన ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు అమ్ముతున్నారని అడిగాను. దీనికి ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పలేదు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకును కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్‌కు అమ్మాలని నిర్ణయించింది” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    బ్యాంకులో ప్రస్తుతం ప్రభుత్వానికి, ఎల్ఐసీకి 95 శాతం వాటా ఉందని, అమ్మకం తర్వాత ఈ వాటా 34 శాతానికి తగ్గుతుందని ఆయన తన లేఖలో రాశారు. “ఐడీబీఐ ప్రైవేట్ చేతుల్లోకి వెళితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ అంతమైపోతుంది. మీ హక్కులు ఇప్పటికే బలహీనమయ్యాయి. ఇప్పుడు వాటి చివరి రక్షణ కూడా అంతమైపోతుంది” అని రాహుల్ తెలిపారు.

    రాహుల్ గాంధీ లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో స్పందించారు.

    “బ్యాంకులు, ఆర్థిక సంస్థలను తన సొంత ప్రైవేట్ సంస్థల్లా కాంగ్రెస్ ఉపయోగించుకుందని మనందరికీ తెలుసు. తమ ఇష్టానుసారం రుణాలు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో రుణాలు ఇవ్వడానికి సంబంధించిన ముఖ్యమైన నియమ నిబంధనలను కూడా విస్మరించారు” అని ఆమె ఆరోపించారు.

    ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపింది.

    “భారత పారిశ్రామికీకరణకు ఆర్థిక సహాయం అందించడానికి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెహ్రూ స్థాపించారు. ఇప్పుడు అదే సంస్థను మోసపూరితంగా అమ్ముతున్నారు” అని ఆ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. “మీ మద్దతుతో మా పోరాట పటిమ రెట్టింపు అయింది. దేశ చారిత్రక సంస్థ అయిన ఐడీబిఐని కాపాడటానికి మా చివరి శ్వాస వరకు పోరాడతాము” అని ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి పోస్ట్ చేసింది.

  4. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్
    ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  5. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు, అక్కడ వారి జీవితం ఎలా ఉంటుంది?

    ఇజ్రాయెల్ ఒక యూదు దేశం. మరి అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఎలా ఉంది?
    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఒక యూదు దేశం. మరి అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఎలా ఉంది?

    ఇజ్రాయెల్ 1948లో ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పుడు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది అరబ్బులు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు.కానీ, అలా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారికి ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. వారినే ఇప్పుడు ఇజ్రాయెల్ అరబ్బులు అని పిలుస్తున్నారు. మరింత కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  6. # విశ్వక్‌సేన్ దర్శకత్వం వహించిన కల్ట్ మూవీ ఎలా ఉంది?

    విశ్వక్‌సేన్ నటించడమే కాక #కల్ట్ సినిమాకు దర్శకత్వం వహించాడు
    ఫొటో క్యాప్షన్, విశ్వక్‌సేన్ నటించడమే కాక #కల్ట్ సినిమాకు దర్శకత్వం వహించాడు

    ప్రేక్షకుడిని కథలోకి లాగాలంటే భయంతో పాటు ఉత్కంఠ, పాత్రలతో కనెక్ట్ అయ్యేలా చేసే ఎమోషన్ కూడా ఉండాలి మరి. #కల్ట్‌ సినిమాలో అవ్వన్నీ ఉన్నాయా? హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించిన విశ్వక్ సేన్ సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా తీశాడా...మరింత చదవడానికి క్లిక్ చేయండి

  7. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్‌పై సైబర్ దాడి : హైజాకర్ల చేతిలో 6.3 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ

    బిట్ కాయిన్ , బైనాన్స్
    ఫొటో క్యాప్షన్, బిట్ కాయిన్

    ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన బైనాన్స్‌పై సైబర్ ఎటాక్ జరిగింది. ఈ దాడిలో 6.3 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు 53వేల కోట్లరూపాయల విలువైన) క్రిప్టో కరెన్సీని హ్యాక్ చేశారు. చరిత్రలో ఇదే అతిపెద్ద హ్యాకింగ్‌ ఘటనగా భావిస్తున్నారు.

    హ్యాకింగ్‌కు గురైన ఆస్తుల్లో కొంత మొత్తాన్నితిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించినట్టు బైనాన్స్ తెలిపింది. మిగిలిన ఆస్తుల్లో చాలా వరకు ఇంకా హ్యాకర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఘటన వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా భరిస్తామని సంస్థ తెలిపింది.

    ఓ ఇంజినీర్‌ ల్యాప్‌టాప్‌ హ్యాకింగ్‌కు గురవడం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని బైనాన్స్ వెల్లడించింది. దీని ద్వారా హ్యాకర్‌ అనుమతి లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం పొందినట్టు తెలిపింది.

    ఉత్తర కొరియాకు చెందిన 'ట్రేడర్‌ట్రెయిటర్‌' అనే హ్యాకింగ్‌ బృందం దీని వెనక ఉందని రెండు సంస్థలు ఆరోపించాయి.

    ఈ హ్యాకింగ్‌కు ఉత్తర కొరియాతో ఉన్న సంబంధాలపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు బైనాన్స్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే నేరస్తుల గుర్తింపును నిర్ధరించి వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు తాము దర్యాప్తు సంస్థల భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.

  8. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ, నాలుగో టీ20లో భారత్‌పై న్యూజీలాండ్ గెలుపు

    క్రికెట్, భారత్, న్యూజీలాండ్
    ఫొటో క్యాప్షన్, నాలుగో టీ20లో భారత్‌పై న్యూజీలాండ్ గెలిచింది.

    న్యూజీలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఓడిపోయింది. 87 పరుగుల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. 260పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 172 పరుగులే చేయగలిగింది.

    తిలక్ వర్మ చేసిన 35 పరుగులే భారత్ తరఫున అత్యధిక స్కోర్.

    న్యూజీలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ చేశాడు. 49 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 107పరుగులు చేశాడు.

    ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే భారత్ గెలుచుకుంది. ఐదో టీ20 ఆదివారం (నవంబర్ 1) హామిల్టన్‌లో జరగనుంది.

    క్రికెట్, భారత్, న్యూజీలాండ్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ చేశాడు.
  9. పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

    16వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలతో ఏపీ అగ్రస్థానంలో ఉంది
    ఫొటో క్యాప్షన్, 16వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలతో ఏపీ అగ్రస్థానంలో ఉంది

    భారత్‌లో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల టీచర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే 16వేలకుపైగా సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి.

    ''మా పాఠశాలలో 41 మంది విద్యార్థులకు నేనొక్కడినే పాఠాలు చెప్పాలి. స్కూల్ నిర్వహణ నుంచి ఆన్‌లైన్‌లో చేయాల్సిన అనేక పనుల కారణంగా, పాఠాలు చెప్పేందుకు చాలా తక్కువ సమయం ఉంటోంది’’ అంటున్న సింగిల్ టీచర్ల పరిస్థితి ఇలా ఉంటే... ‘పాఠాలు చెప్పడానికి టీచర్లు ఇష్టపడటం లేదంటున్నారు’’ సామాజిక కార్యకర్తలు... ఇంతకీ సింగిల్ స్కూల్స్‌లో సమస్యలు ఏమిటి? వాటివల్ల విద్యాబోధనపై పడుతున్న ప్రభావమేంటి? అందరికీ చదువు’ను ఈ పాఠశాలలు నెరవేర్చగలుగుతున్నాయా? మరింత ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

  10. జోషిమఠ్ దగ్గర కూలిన హెలికాప్టర్: చాపర్‌లో పైలట్ సహా మొత్తం ఆరుగురు

    ఉత్తరాఖండ్, జోషిమఠ్, హెలికాప్టర్
    ఫొటో క్యాప్షన్, ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి సంస్థ హెలికాప్టర్ ప్రయాణికుల వివరాలు వెల్డించింది.

    బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు యాత్రికులతో వెళ్తున్న ఒక హెలికాప్టర్ జోషిమఠ్ దగ్గర కూలిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులున్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

    అదృశ్యమైన హెలికాప్టర్ ఆచూకీ కనుగొనడానికి మరో హెలికాప్టర్‌లో గాలింపు బృందాన్ని తరలించారు.

    “ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఒక హెలికాప్టర్ మధ్యాహ్నం 1.14 గంటలకు బద్రీనాథ్ నుంచి సహస్రధార హెలిపోర్ట్‌కు బయలుదేరింది. జోషీమఠ్ లోయ సమీపంలో ఆ హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోయింది. అప్పటి నుంచి దాని జాడ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ సమాచారం అందిన వెంటనే చమోలీ జిల్లా యంత్రాంగం, ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాన్ని రంగంలోకి దించాం. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో సహాయక చర్యలకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన అన్నిహెలికాప్టర్ల రాకపోకలను నిలిపివేశాం’’ అని ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి సంస్థ సీఈవో ప్రతీక్ జైన్ చెప్పారు.

    మధ్యాహ్నం హెలికాప్టర్ బయలుదేరిన కాసేపటికే దానితో సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    హెలికాప్టర్‌లో ఉన్నవారి వివరాలు

    1. కెప్టెన్ హిమాంశు - పైలట్

    ప్రయాణికులు

    1.ప్రతాప్

    2. అరుణ్

    3. శంకర్ గౌడ

    4. సుధీర్.కె

    5. హెచ్.ఎస్. నటరాజ

  11. యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు: అమిత్ షా

    ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్, బీజేపీ
    ఫొటో క్యాప్షన్, అమిత్ షా

    ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

    లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు.

    ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేశామని ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇంకోసారి ప్రభుత్వం ఏర్పడితే దీనిని అమలు చేస్తారని ఆయన చెప్పారు.

    ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ సంస్థాగత వ్యూహం, సన్నాహాలపై చర్చించేందుకు అమిత్ షా లక్నో వచ్చారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌధురితోపాటు పార్టీలోని ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

    గత ఎన్నికల్లో బీజేపీ ఫలితాలను కూడా తన ప్రసంగంలో అమిత్ షా ప్రస్తావించారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పార్టీకి కేవలం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని, పార్టీ సంస్థాగతంగా బలోపేతమయిన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లతో 73 స్థానాలను గెలుచుకుందని ఆయన అన్నారు.

    పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కూడా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయని, 312 స్థానాల్లో విజయం సాధించిందని అమిత్ షా అన్నారు.

  12. గుడ్ ఆఫ్టర్‌నూన్...

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని. రాత్రి 10గంటలవరకు ఇక్కడ ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

  13. భూటాన్‌లో ఉప్పొంగిన గ్లేసియర్ లేక్.. పశ్చిమబెంగాల్, అస్సాంలోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్

    ఎస్పీ అమిత్ కుమార్ షా
    ఫొటో క్యాప్షన్, ఎస్పీ అమిత్ కుమార్ షా

    భూటాన్‌లోని షింటాఫు గ్లేసియర్ లేక్ ఉప్పొంగింది. దీంతో సంకోష్ నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో హై అలర్ట్ జారీ చేశారు.

    "సంకోష్, బ్రహ్మపుత్ర నదుల్లో వచ్చే వరదల ముప్పు దృష్ట్యా, కూచ్ బెహార్, తుపాన్‌గంజ్, బుసిర్‌హాట్‌లోని తేయాకు తోటలు, నదీ తీరాలలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి" అని పశ్చిమబెంగాల్ మంత్రి నిషిత్ ప్రమణిక్ చెప్పారు..

    భూటాన్‌లోని షింటాఫు సరస్సులో హిమానీనదం ఉప్పొంగి వరదలు సంభవించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, కేంద్ర జల సంఘం పశ్చిమ బెంగాల్, అస్సాంలకు హెచ్చరిక జారీ చేసింది.

    రాబోయే 6 నుంచి 8 గంటలలోపు సంకోష్ నది అకస్మాత్తుగా ఉప్పొంగి, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్, అస్సాంలోని ధుబ్రిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

    పశ్చిమ బెంగాల్, అస్సాంలోని సంకోష్ నదీ తీరాన ఉన్న ఈ రెండు జిల్లాలలోని స్థానిక అధికారులకు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సివిల్ డిఫెన్స్ సిబ్బంది లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరిస్తున్న వీడియోను పీటీఐ వార్తా సంస్థ షేర్ చేసింది.

    "భూటాన్‌లో మేఘ విస్ఫోటనం కారణంగా, ఈ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉంది, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి" అని ఆ వీడియోలో ఉంది.

    వరద ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నామని అలీపుర్‌దువార్ ఎస్పీ అమిత్ కుమార్ షా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

  14. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  15. అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్

    అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన ఒక డాల్ఫిన్ కొట్టుకువచ్చింది.

    బీసీసీ ప్రతినిధులు అక్కడికి వెళ్లేసరికి అది చనిపోయి ఉంది.

    అప్పటికే జనం దాని చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

    మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు.

  16. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో నేషనల్ హైవేపై వరద నీరు.. ఇచ్ఛాపురానికి రెండు వైపులా రాకపోకలకు అంతరాయం

    శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు
    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు

    అర్నబ్ తుపాను తీరం దాటిన తరువాత కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

    దీంతో శ్రీకాకుళంలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉప్పొంగాయి.

    ముఖ్యంగా మహేంద్ర తనయ, బాహుదా నదులకు ఎగువన ఒడిశా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో దిగువ ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

    ఒడిశా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్టణం ఇచ్ఛాపురంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

    ఇక్కడి బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి. జాతీయ రహదారికి వెళ్లే మార్గం కూడా వరద నీటిలో మునిగిపోయింది.

    పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే.. సుమారు పది ఇళ్లు మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు ఇళ్ల పైఅంతస్తులు, డాబాలపైకి చేరుకున్నారు.

    వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    మరోవైపు, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. పలు చోట్ల వరద నీట్లో వాహనాలు చిక్కుకుపోయాయి.

    రైలు మార్గంలోనూ కొంతమేర పట్టాలు వరద నీట్లో మునిగిపోయాయి.

    వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఫొటో క్యాప్షన్, వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఫొటో క్యాప్షన్, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
    ఫొటో క్యాప్షన్, ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
  17. అర్నబ్ తుపాను ప్రభావంతో దిల్లీలో వర్షాలు

    దేశ రాజధానిని తాకిన అర్నబ్ తుపాను ప్రభావం
    ఫొటో క్యాప్షన్, దేశ రాజధానిని తాకిన అర్నబ్ తుపాను ప్రభావం

    దేశ రాజధాని దిల్లీలో రాత్రి నుంచి వానలుపడుతున్నాయి. తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని ఐఎండీ ప్రకటించింది.

    జాతీయ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతమంతటా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి.

    తీరం దాటిన తర్వాత కూడా అర్నాబ్ తుపాను వివిధ రాష్ట్రాల్లో వర్షాలకు కారణవుతోందని ఐఎండిడైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర తెలిపారు. అందుకే దిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

    "ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన అర్నబ్ తుపాను బలహీనపడుతూ క్రమంగా ఉత్తరం వైపు కదిలింది. దీని ప్రభావంతో, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఒడిశాలో అసాధారణ వర్షాలు పడ్డాయి. ఆ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, దిల్లీ అంతటా వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.” అని అన్నారు.

  18. అంతర్వేదీ తీరానికి కొట్టుకొచ్చిన భారీ షిప్

    అర్నబ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్వేది తీరానికి ఒక భారీ షిప్ రావడం చర్చనీయాంశంగా మారింది.

    సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఓడ వచ్చిందని కోస్టుగార్డు అధికారులు చెబుతున్నారు. విశాఖ నుంచి సింగపూర్ బయల్దేరిన ఈ షిప్, తుపాను ధాటికి ఇలా తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు.

    ఇందులో ఉన్న సిబ్బందిని కోస్ట్‌గార్డ్ దళాలు కాపాడాయి.

  19. ‘ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా’ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

    హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని దిల్లీలో నిర్వ‌హించారు.

    కార్య‌క్ర‌మానికి కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

    పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

    "2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

    ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
    ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ