‘హ్యాపీ జర్నీ’ మూవీ హాయిగా సాగిందా?

ఫొటో సోర్స్, X/ Gutta Productions
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అన్నపూర్ణ, ఝాన్సీ, ఆమని, సునయనలు నటించిన 'హ్యాపీ జర్నీ' సినిమా థియేటర్లోకి వచ్చింది.
రెండు రోజులు ముందుగానే పెయిడ్ ప్రీమియర్ వేసారు. మరి హ్యాపీ జర్నీ ఎలా ఉంది?
కథ ఏమంటే... గేట్ ఆంధ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్న గోవింద్ (వంశీధర్ గౌడ్) , అతని ఫ్రెండ్ (రవిశివతేజ) యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తారు.
ఏడుగురు భిన్న వయసు ఉన్న ఆడవాళ్లకి లక్కీలాటరీ తగిలిందని ఫ్రీ ట్రిప్ తీసుకెళతారు.
వాళ్లలో ఇద్దరు తల్లీకూతుళ్లు (జాన్సీ, పాయల్), 70 ఏళ్ల బామ్మ (అన్నపూర్ణ), మంత్రి భార్య (ఆమని), సింగిల్ మదర్ సునయన, ఇంకా ఇద్దరు పెళ్లికాని అమ్మాయిలు.

ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈఫిల్ టవర్ చూసి ట్రిప్ ముగిస్తారు. అసలు వీళ్లంతా ఎవరు? ఉచిత ట్రిప్ వెనుక రహస్యం ఏంటి? ట్రిప్‌లో జరిగిన ఎమోషనల్ సంఘటనలు ఏంటి? ఇదంతా మిగతా కథ.
ట్రావెలాగ్ సినిమాలు ఇంగ్లిష్‌లో చాలా వచ్చాయి. హిందీలో బాంబే టు గోవా (1972) ఫేమస్. తెలుగులో కూడా యూరప్ ట్రిప్ కామెడీ 19 ఏళ్ల క్రితం తులసి (2007) వచ్చింది.
ఆడవాళ్లంతా కలిసి ట్రిప్‌కి వెళ్లడం ఈ మధ్యనే విస్తరిస్తున్న కొత్త కల్చర్.
హ్యాపీ జర్నీ కథలో కామెడీకి, ఎమోషన్‌కి కావాల్సినంత స్కోప్ ఉంది. నలుగురు సీనియర్ నటీమణులున్నారు.
ప్రతి పాత్ర వెనుక తెలియని విచారం, విషాదం ఉంది. ఫ్రాన్స్‌లోని అందమైన దృశ్యాల నేపథ్యం ఉంది. ఈఫిల్ టవర్ దగ్గర చాలా సన్నివేశాలు తీశారు.
చిన్న సినిమా అయినా ఖర్చుకి వెనుకాడలేదని తెలుస్తూనే ఉంది. అయితే, దర్శకుడు పారిస్‌పై చూసిన శ్రద్ధ కథా కథనాల్లో చూపలేదు.
ఒక్క సీన్ కూడా మనసుకు హత్తుకునేలా లేకపోగా, ఏ సీన్ ఎందుకొస్తుందో తెలియదు.

ఫొటో సోర్స్, X/Kamalakar Film Corporation
లౌడ్ కామెడీ, అవుట్‌డేటెడ్ పంచ్‌లు, క్యారక్టర్లకి రౌండప్ లేకపోవడంతో రెండు గంటలు నిడివి కూడా విసిగించి, టీవీ సీరియల్‌ని గుర్తుకు తెస్తుంది.
చెప్పాల్సింది క్లైమాక్స్‌లో చెప్పేసా కాబట్టి ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడని దర్శకుడు భావించినట్టున్నాడు.
రెండు దశాబ్దాల క్రితం విదేశాల్లో దృశ్యాలు, అక్కడి ఇక్కట్లు జనాలని ఆకర్షించేవి.
ఇప్పుడు కొంచెం ధైర్యం చేస్తే మధ్య తరగతి వాళ్లు కూడా పారిస్ చూడొచ్చు. లేదంటే ప్రపంచమంతా యూట్యూబ్‌లో చూసుకోవచ్చు.
విదేశాల్లో కథ జరిగితే ప్రేక్షకుడికి ఇప్పుడు పెద్ద ఆకర్షణ కాదు. కథ ఉంటేనే మిగితావన్నీ. హ్యాపీ జర్నీలో జర్నీ మాత్రమే ఉంది.

ఫొటో సోర్స్, X/Kamalakar Film Corporation
కొడుకు కోడలు బాగా చూసుకుంటున్నా.. అన్నపూర్ణమ్మ వెలితికి కారణమేంటో, విమానం ఎక్కినప్పటి నుంచి మందు కోసం ఎందుకు కలవరిస్తుందో అర్థంకాదు.
జాన్సీ కూతురు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత, కాబోయే భర్తతో అంత పెడసరంగా ఎందుకు వ్యవహరిస్తుందో తెలియదు.
మంత్రిగారి భార్య సమస్య తెలియాలంటే మినిమం డిగ్రీ చదవాలి. అసలు ఈ టూర్ ఆపరేటర్ల లక్ష్యం ఏంటో అర్థంకాదు.
ఎడిటింగ్, ప్రొడక్షన్, డిజైన్, కెమెరా అంతా కరెక్ట్‌గా సెట్ చేసుకున్న దర్శకుడు అభిరామ్ నాయుడు స్క్రిప్ట్‌పై కనీస శ్రద్ధ చూపిస్తే బావుండేది.
అన్నపూర్ణ, జాన్సీ, మంచి యాక్టర్లు. సన్నివేశంలో బలముంటే విజృంభిస్తారు (ఉదాహరణకి ఎఫ్-2) లేదంటే గట్టిగా అరిచి ప్రేక్షకుల్ని తినేస్తారు. ఇక్కడ జరిగింది అదే.
ప్లస్ పాయింట్స్
1.నిడివి (రెండు గంటలే)
2.పారిస్‌లో లోకేషన్స్
మైనస్ పాయింట్స్
1.కథాకథనాలు
2.అవుట్ డేటెడ్ కామెడీ
ఫైనల్‌గా - ఆడవాళ్ల యూరప్ యాత్ర అనే టీవీ సీరియల్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























