నేపాల్ ప్రధాని బాలెన్ షా 'భారత భూభాగాల ఆక్రమణ' వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ, ఏమందంటే..

ఫొటో సోర్స్, Getty Images
"భారత్ మాత్రమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదు. నేపాల్ కూడా కొన్నిచోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది" అంటూ నేపాల్ ప్రధాన మంత్రి బాలెన్ షా ఆదివారం చేసిన వ్యాఖ్యలు భారత్, నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ఇప్పుడు, ఈ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా స్పందించింది.
మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత్ - నేపాల్ సరిహద్దులో కొన్ని ప్రాంతాల విషయంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలున్నాయని స్పష్టం చేశారు.
మరోవైపు, బాలెన్ షా వ్యాఖ్యలపై నేపాల్‌లో రాజకీయ వర్గాల నుంచే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, ప్రధాని ప్రకటనకు సంబంధించి విదేశాంగ శాఖ ప్రత్యేకంగా వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ "భారత్ - నేపాల్ సరిహద్దుపై నేపాల్ ప్రధాని, నేపాల్ విదేశాంగ శాఖ వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. భారత్ - నేపాల్ సరిహద్దులో 98 శాతం వరకు డీమార్కేషన్(బోర్డర్ లైన్) పూర్తయినప్పటికీ, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. గండక్ నది ప్రవాహంలో మార్పుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది" అని చెప్పారు.
"అదనంగా సరిహద్దులోని నిర్దిష్ట ప్రాంతాల్లో 'నో మ్యాన్స్ ల్యాండ్'లో సరిహద్దు దాటి జరుగుతున్న ఆక్రమణలు, భూకబ్జాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటిని రెండు దేశాలు కలిసి మ్యాపింగ్ చేస్తున్నాయి. సరిహద్దుకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించేందుకు ద్వైపాక్షిక వ్యవస్థలను ఏర్పాటు చేశాం. భారత్-నేపాల్ మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాల్లో ఎలాంటి మూడో పక్షానికి చోటు లేదన్న విషయం అందరికీ స్పష్టం చేస్తున్నాం" అని అన్నారు.
బాలెన్ షా వ్యాఖ్యల వల్ల కాలాపాని, లింపియాధురా, సుస్తాపై తమ వాదన బలహీనపడినట్టైందని నేపాల్‌కు చెందిన పలువురు దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ ఎస్డీ ముని మాత్రం బాలెన్ షా ముక్కుసూటితనాన్ని ప్రశంసించారు.
ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ, "భారత్ - నేపాల్ సరిహద్దు వివాదం ఏకపక్ష విషయం కాదని ధైర్యంగా అంగీకరించినందుకు ప్రధాన మంత్రి బాలెన్ షాను అభినందించాలి. నది ప్రవాహ మార్పుల కారణంగా, సుస్తా ప్రాంతంలోని కొంత భారత్ భూభాగం నేపాల్ కింద ఉంది" అని రాశారు.
అయితే, ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదని కూడా ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Sunil Pradhan/Anadolu via Getty Images
బాలెన్ షా ఏమన్నారు?
నేపాల్ ప్రధాని బాలెన్ షా ఆదివారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, "భారత్ మాత్రమే నేపాల్ భూమిని ఆక్రమించలేదు. నేపాల్ కూడా అనేక ప్రాంతాల్లో భారత భూమిని ఆక్రమించినట్లు నేను ప్రధాన మంత్రి అయ్యాక తెలిసింది" అని అన్నారని కఠ్మాండూ పోస్ట్ రిపోర్ట్ చేసింది.
"ఈ అంశంపై రెండు దేశాలు కలిసి కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు" అని పేర్కొంది.
ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో ప్రధాన మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీంతో బాలెన్ షా సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
పార్లమెంట్ సమావేశంలో శ్రామిక్ శక్తి పార్టీ ఎంపీ అరేన్ రాయ్ భారత్ - నేపాల్ సరిహద్దు వివాదంపై ప్రశ్నలు లేవనెత్తారు.
లిపులేఖ్, లింపియాధురా మార్గాల గుండా జరిగే భారత్ - చైనా వాణిజ్యంపై యూఎంఎల్ నేత పద్మ ఆర్యాల్ అడిగిన ప్రశ్నకు బాలెన్ షా స్పందిస్తూ, "లిపులేఖ్, లింపియాధురా, కాలాపాని వివాదాలు దౌత్య చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి" అన్నారు.
ఈ విషయంపై నేపాల్ ఇప్పటికే భారత్‌కు అధికారిక దౌత్యపరమైన నోటీసు పంపిందని, దానికి సమాధానం కూడా వచ్చిందని చెప్పారు.
"రెండు ప్రభుత్వాలు చరిత్రకారులు, సర్వేయర్లు, ఆ ప్రాంతాలపై అవగాహన ఉన్న నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసి చర్చల ద్వారానే పరిష్కారం కనుగొంటాయని ఆ సమాధానంలో పేర్కొన్నారు" అని బాలెన్ షా పార్లమెంట్లో చెప్పారు.
చైనా, బ్రిటన్ ప్రభుత్వాలతో కూడా ఈ సరిహద్దు వివాదంపై దౌత్యస్థాయిలో చర్చలు జరిపినట్లు బాలెన్ షా వెల్లడించారు.
"మేం భారత్, చైనాతో మాత్రమే కాకుండా బ్రిటన్ ప్రభుత్వంతో కూడా మాట్లాడాం. ఎందుకంటే, ఈ సమస్య బ్రిటిష్ ఇండియా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిన కాలానికి సంబంధించింది, కాబట్టి బ్రిటన్ కూడా ఈ విషయంలో చొరవ చూపాలని మేం కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.
లిపులేఖ్, లింపియాధురా, కాలాపాని అంశాలు నేపాల్ రాజకీయాల్లో సున్నితమైన అంశాలుగా ఉన్నాయి.
2020 జూన్‌లో నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన మ్యాప్‌లో ఈ ప్రాంతాలన్నింటినీ నేపాల్ భూభాగంగా చూపించారు.
దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఆ వాదనలు చారిత్రక ఆధారాలు, వాస్తవాలకు విరుద్ధమని, వాటికి ఎలాంటి ప్రాముఖ్యత లేదని పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
బాలెన్ షాపై ప్రతిపక్షాల విమర్శలు
ఇప్పుడు, బాలెన్ షాపై నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
నేపాలీ కాంగ్రెస్ నాయకురాలు వాస్నా థాపా మాట్లాడుతూ, "ఏ భూభాగం ఆక్రమణకు గురైందో ప్రజలకు ముందే చెప్పాల్సింది. ఇది సీరియస్ విషయం" అన్నారు.
ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.
నేపాల్ మాజీ ఉప ప్రధాన మంత్రి కమల్ థాపా స్పందిస్తూ, "నేపాల్ భారత భూభాగాన్ని ఆక్రమించిందని ప్రధాన మంత్రి భావిస్తే, ఆ భూమిని గౌరవంగా భారత్‌కు తిరిగి ఇవ్వాలి" అన్నారు.
ఆయన ఎక్స్‌లో "ఏ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారో, దానికి ఆధారాలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. పొరపాటును వెంటనే సరిదిద్దుకుని భూమిని గౌరవంతో భారత్‌కు అప్పగించాలి. అయితే, నా అభిప్రాయం ప్రకారం ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్య అతిశయోక్తి, తప్పుదోవ పట్టించే విధంగా ఉంది" అని రాశారు.
"లింపియాధురా, కాలాపాని, లిపులేఖ్, సుస్తా ప్రాంతాల్లో నేపాల్ కీలక భూభాగాన్ని భారత్ ఆక్రమించిందనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో 'నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించింది' అని ప్రధాన మంత్రి చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యం" అని విమర్శించారు.
ప్రధాన మంత్రి తన "తేలికపాటి, అభ్యంతరకర" వ్యాఖ్యలను సరిచేసుకోవాలని ఆయన కోరారు.
వివాదం మరింత పెరగడంతో నేపాల్ విదేశాంగ శాఖ విదేశీ మీడియాకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
నేపాల్‌లోని లిపులేఖ్ ప్రాంతం ద్వారా మానస సరోవర్ యాత్రామార్గాన్ని భారత్ ప్రారంభించడంపై నేపాల్ ఇప్పటికే దౌత్యపరమైన నోటీసు ద్వారా తన అధికారిక వైఖరిని తెలియజేసిందని, దానికి భారత్ నుంచి సమాధానం కూడా అందిందని ఆ ప్రకటనలో ఉంది.
నదుల వంపుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు దాటి ఆక్రమణల సమస్యలు ఉన్నాయని, వాటిని చర్చల ద్వారానే పరిష్కరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది.
మరోవైపు, బాలెన్ షా వ్యాఖ్యలను సమర్థించే వర్గాలు కూడా ఉన్నాయి.

భారత్ పర్యటనకు ఆర్ఎస్పీ అధ్యక్షుడు
విదేశాంగ, వ్యూహాత్మక అంశాల నిపుణులు నేపాలీ జర్నలిస్ట్ పరశురామ్ కాఫ్లే ఎక్స్‌లో స్పందిస్తూ, "నేపాల్ - భారత్ సరిహద్దులో ఇరుదేశాలకూ పరస్పర ఆక్రమణల సమస్య ఉంది. సుస్తా, కాలాపాని వేర్వేరు అంశాలు. ఈ విషయం భద్రతా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు. గత ప్రభుత్వాలు ప్రజలకు అబద్ధం చెప్పాయి" అని రాశారు.
అరుణ్ సుబేది అనే మరో వ్యక్తి ఎక్స్‌లో "చరిత్రలో తొలిసారి సరిహద్దు దాటి భూఆక్రమణలు, నివాస ప్రాంతాల ఆక్రమణల అంశాన్ని ప్రధాన మంత్రి లేవనెత్తారు. ఇంతకుముందు వామపక్ష ఆధిపత్యం కారణంగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ప్రధాన మంత్రి ధైర్యం ప్రశంసనీయం" అని రాశారు.
"ఈ సమస్య పరిష్కారమైతే సుస్తా, కాలాపాని అంశాలే మిగులుతాయి" అని కూడా రాశారు.
బీబీసీ నేపాలీ కథనం ప్రకారం, అధికార రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రవి లామిచ్ఛానే వచ్చే వారం దిల్లీలో పర్యటించనున్నారు.
బాలెన్ షా ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారత్ పర్యటనకు ఆహ్వానం అందుకున్న అధికార పార్టీకి చెందిన తొలి అగ్రనేత ఆయనే.
జూన్ 1 నుంచి రవి లామిచ్ఛానే భారత్ పర్యటనకు రానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని బీజేపీ ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
నిరుడు ఏప్రిల్‌లో నేపాల్ ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన నెట్వర్క్ మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్లో భాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. అనంతరం "మ్యాప్‌లో లోపాల"కు ఆ సంస్థ క్షమాపణ చెప్పింది.
బాలెన్ షా ప్రధాన మంత్రి అయిన తరువాత కఠ్మాండూలోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభినందించాలనుకున్నారు. కానీ, అది కుదురలేదు.
బాలెన్ షా కఠ్మాండూలోని అన్ని దేశాల రాయబారులతో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించారు. భారత రాయబారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు.
ఇక రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ విడుదల చేసిన ప్రకటనలో కనీసం ఏడాది పాటు నేపాల్ ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలు చేయరని పేర్కొంది.
సంప్రదాయంగా నేపాల్‌లో ప్రధాన మంత్రి తన బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి విదేశీ పర్యటనగా భారత్‌కే వస్తారు.
కఠ్మాండూ పోస్ట్ కథనం ప్రకారం, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీని కూడా బాలెన్ షా కలవలేదు. మంత్రివర్గ స్థాయి కాని విదేశీ అధికారులను తాను కలవబోనని ఆయన చెప్పినట్లు కథనం ఆ పేర్కొంది.
అయితే, రవి లామిచ్ఛానే భారత్ పర్యటన మాత్రం అధికార పార్టీ బీజేపీ ఆహ్వానం మేరకు జరుగుతోంది.
దిల్లీ చేరుకున్న తరువాత ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సహా పలువురు అధికారులతో భేటీ అయ్యే అవకాశముంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























