You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?
కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన అభిజిత్ దీపక్ సోషల్ మీడియాలో బీజేపీకి నాయకులకు టార్గెట్‌గా మారారు.
తల్లిదండ్రుల భద్రత గురించి ఆందోళనతో ఉన్నానని, తన కుటుంబానికి తరచుగా బెదిరింపులు వస్తున్నాయని అభిజిత్ చెప్పారు
సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్‌లో అభిజిత్ దీపక్ ఒక వీడియో షేర్ చేశారు.
అందులో ఓ యువకుడు అభిజిత్, అతని కుటుంబ సభ్యుల గురించి అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం కనిపిస్తోంది.
తన కుటుంబానికి ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని అభిజిత్ రాశారు. ఈ బెదిరింపుల మీద అధికారులు చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.
కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఉద్యమం తమ కుమారుడి మీద చట్టపరమైన చర్యలకు దారి తీయవచ్చని అభిజిత్ తల్లిండ్రులు ఓ మరాఠీ న్యూస్ చానల్‌తో చెప్పారు. అభిజిత్‌ను అరెస్ట్ చేయవచ్చని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజిత్ దీపక్ వారంరోజుల కిందట సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు.
వారంరోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య ఇందులో సగంకంటే తక్కువ. ఈ పార్టీకి 2 కోట్లమంది ఫాలోవర్లు ఉండగా, బీజేపీకి సుమారు 93 లక్షలమంది, కాంగ్రెస్ పార్టీకి సుమారు 1 కోటీ 30 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.
ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత మే 15న ఈ ఉద్యమం మొదలైంది.
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ "వ్యవస్థలపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఇప్పటికే ఉన్నాయి. మీరు కూడా వారితో చేరాలనుకుంటున్నారా? కొంతమంది యువకులు ఉద్యోగాల్లేక, చేస్తున్న పనిలో గుర్తింపు లేక బొద్దింకల్లా అన్ని చోట్లకు విస్తరిస్తున్నారు. వారు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
అయితే ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మొదలు కావడంతో తన వ్యాఖ్యను ఓ వర్గం వక్రీకరించిందని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
అభిజిత్, అతని తల్లిదండ్రులేమన్నారంటే..
ఈ ఉద్యమం కారణంగా తమ కుమారుడు సమస్యలను ఎదుర్కోవచ్చని అభిజిత్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
"నా కుటుంబానికి ఏమీ జరగకూడదు. ఎందుకంటే పార్టీ ఏర్పాటు అన్నది నా నిర్ణయం. వాళ్లది కాదు" అని అభిజిత్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.
"నా కుటుంబానికి, నాకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయి. స్వదేశంలో ఉన్న నా కుటుంబం గురించి నాకు ఆందోళనగా ఉంది" అని ఆయన చెప్పారు.
అభిజిత్ తన తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందుతుంటే, ఆయన తల్లిదండ్రులు ఆయన భద్రత గురించి భయపడుతున్నారు.
"ప్రస్తుత రాజకీయాల్ని చూస్తే భయం కలగడం సహజమే. తను భారత్‌కు వస్తే అరెస్ట్ చేస్తారని అభిజిత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మనం ఇలాంటి సంఘటనల గురించి వార్తాపత్రికల్లో చదువుతూనే ఉంటాం" అని అభిజిత్ తండ్రి అన్నారు.
తన కొడుకు రాజకీయాలకు దూరంగా ఉండి, కెరీర్‌పై దృష్టి పెడితే బావుంటుందని అభిజిత్ తల్లి సూచించారు.
"వాడు క్షేమంగా ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం. రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనేది వాడి నిర్ణయం. అయితే వాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మా మాట వింటాడో లేదో నాకు తెలియదు. ఈ విషయంలో నేను వాడికి మద్దతివ్వను. వాడి గురించి నాకు ఆందోళనగా ఉంది" అని ఆమె అన్నారు.
30 ఏళ్ల అభిజిత్ ఉన్నత విద్య కోసం రెండేళ్ల క్రితం బోస్టన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు.
చదువుకునేందుకు తన కుమారుడు విదేశాలకు వెళ్లాడని భగవాన్ దీపక్ చెప్పారు. అభిజిత్ సోదరి అప్పటికే అమెరికాలో ఉన్నారు.
రాజకీయాల్లో చేరడానికి బదులు అభిజిత్ పుణె లేదా దిల్లీ లాంటి నగరాల్లో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
"సోషల్ మీడియాలో తనకు పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారని నాకు చెప్పాడు. వాడు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేశాడు. అయితే మనకు రాజకీయాలు వద్దని, ఉద్యోగంలో చేరాలని చెప్పాను" అని భగవాన్ దీపక్ అన్నారు
సోషల్ మీడియాలో ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన ప్రజాదరణ తనకు నిద్రలేని రాత్రులను మిగిలించిందని అభిజిత్ దీపక్ తండ్రి భగవాన్ దీపక్ అన్నారు.
"వాడిని అరెస్ట్ చేయవచ్చు. వాడికి ఏమవుతుందోనని రెండు రోజులుగా ఆందోళనగా ఉంది. నాకు రాజకీయాలంటే అసహ్యం. వాటి మీద ఆసక్తి లేదు" అని ఆయన తెలిపారు.
బీజేపీ ఏమంటోంది?
అభిజిత్ ఉద్యమాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
"అభిజిత్ దీపక్ ఆమ్ఆద్మీపార్టీ కార్యకర్త. ఆ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌ది. అతను బోస్టన్ వెళ్లడానికి ఎవరు డబ్బు చెల్లించారు? అతని వసతి, భోజన ఖర్చులను సొరోస్ ఫౌండేషన్ చెల్లిస్తోందా? ఇది ప్రతిపక్షానికి హెచ్చరిక. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు విదేశీ శక్తుల సాయం కోరతారా" అని బీజేపీ లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో రాశారు. ఈ మెసేజ్‌తో పాటు దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో అభిజిత్ దీపక్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
అభిజిత్ ఎక్స్‌లో చేసిన కొన్ని ట్వీట్లను ప్రస్తావిస్తూ బీజేపీఅనుబంధ సంస్థ భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా అభిజిత్‌ను విమర్శించారు.
"బొద్దింక లాంటి అభిజిత్ దీపక్ భారత దేశానికి ఒక ముస్లిం ప్రధానమంత్రి ని ఎందుకు కోరుకుంటున్నారు" అని అభిజిత్ గతంలో చేసిన ట్వీట్‌ను తజిందర్ బగ్గా రీ ట్వీట్ చేశారు.
"గుజరాతీ ముస్లిం జోహ్రాన్ మమ్దానీ అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నికల్లో గెలిచి ప్రపంచంలో అతి పెద్ద నగరానికి మేయర్ అయ్యారు. మోదీ హయాంలో భారత దేశంలో ఒక గుజరాతీ ముస్లింకు అలాంటి అవకాశం దక్కుతుందా" అని అభిజిత్ గతంలో ట్వీట్ చేశారు.
తన పార్టీనీ, ఉద్యమాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అభిజిత్ విమర్శించారు.
"కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో కొందరు నిరసనలు చేపట్టాలని భావిస్తున్నట్లు నేను కొన్ని పత్రికల్లో చదివాను. అయితే నాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు. నా పార్టీపై చర్య తీసుకుని, దాని ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇది సుదీర్ఘ పోరాటం. మేము ఏం చేసినా చాలా జాగ్రత్తగా, శాంతియుతంగా చేస్తాం" అని అభిజిత్ అందులో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)